17, అక్టోబర్ 2020, శనివారం

డి.వి.సుబ్బారావు(బందరు)

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
ఈనాటి మన చిరస్మరణీయులు....
వేంకటసుబ్బారావు దేవరకొండ....
కడవరకూ శ్వాసించారు నాటకాన్నే గుండెల నిండా...
తింటే గారిలే తినాలి..!!
వింటే భారతం వినాలి...!!
"చూస్తే డి.వి.సుబ్బారావు గారి హరిశ్చంద్ర పాత్ర అభినయమే  చూడాలి"..... !!
అనేది ఆరోజుల్లో జన వాక్యం..
కాదు ప్రశంసా వాక్యం...
మధురమైన గాత్రం,
శ్రావ్యమైన గానం,
సొగసైన రూపం,
ఆకర్షణీయమైన ముఖం,
ఎటువంటి భావాన్నైనా 
అలవోకగా ప్రదర్శించగల 
విశాలనేత్రాలు,కనుబొమలు..ఫాలభాగం.
అపూర్వమైన కళాభినివేశం,హావభావాలు..
చెప్పలేనంత నాటకాభిరుచి,
నాటకం అంటే కసి..తపన
పట్టుదల, చేసే వృత్తి పైనఉన్న గౌరవం...భక్తి
వీటన్నిటికీ మించి,
క్రమశిక్షణతో కూడిన గొప్ప వ్యక్తిత్వం...వినయం
ఇవన్నీ ఒక్కచోట కలిసి, కలగలిసి
కన్పించిన ఒక  రూపము యొక్క స్వరూపమే మన నేటి చిరస్మరణీయులు
శ్రీ డి.వి.సుబ్బారావుగారు..

వీరు సర్వ కళలకూ కాణాచి గావున్న బందరు పట్టణమున,గొడుగు పేటలో1893 సం: జులై 15 వ తేదీన లో మాతామహుల ఇంట జన్మించారు..వీరి పూర్తి పేరు దేవరకొండ వెంకట సుబ్బారావు.
వీరి తండ్రి పేరు గంగయ్య...తల్లి పేరు వర్ధనమ్మ..వీరు వైదిక బ్రాహ్మణులు.. 

వీరి చిన్నతనంలో సంసార బాధలతో సుబ్బారావు గారి తండ్రి ఆర్ధిక పరిస్థితి బాగలేక వీరిని బాపట్ల కు,  సుబ్బారావు గారి పెదబావగారి దగ్గరకు పంపారు...అక్కడ ఉండి వారు చదువుకుంటూ 7వతరగతి పాసయ్యి, తరువాత సొంత ఊరయిన బందరు వచ్చి నోబుల్ హై స్కూల్ లో చేరారు...అక్కడ  పరీక్షలు వ్రాసే సమయంలో  బందరులో  కలరా వ్యాధి వ్యాప్తి చెందటం వలన  చదువుకు స్వస్తి చెప్పారు.  

వీరు బాల్యంలో కొంత కాలం పితృపితా మహుల దగ్గర  గూడూరులో పెరిగారు...
 గూడూరులో అయిదు దేవాలయాలు ఉండేవి..వాటిలో ఏడాదిపొడుగునా..ఉత్సవములు, వేడుకలు జరిగేవి.. వాటిలో తోలుబొమ్మలు..వీధినాటకములు,కూచిపూడి భాగవతాలు, భోగంమేళాలు,హరికధలు జరిగేవి.

తండ్రితో పాటు సుబ్బారావు గారు ఆ ప్రదర్శనలు తెల్లవార్లూ మేల్కొని చూచేవారు..మర్నాడు ఆ గూడూరు గ్రామదిబ్బలమీద స్నేహితులముందు హిరణ్యకశిపుడు... ప్రహ్లాదుడిలా వేషం ధరించి...మాటలతో.. పాటలతో భావప్రకటనా హావభావములతో దారినిపోయేవారిని ఆకర్శించేవారు..

రమణయ్య పంతులు అనే  ఆయన వీరిని  చూచి బందరు లోని భువనరంజనీ థియేటర్ అనే నాటక సమాజంలో వీరిని చేర్చారు..మొదటిగా వీరు "మంజువాణి' అనే చెలికత్తె వేషంతో తన 14 ఏండ్ల వయసులో(1908)లో రంగస్థలంలో స్త్రీ పాత్రతో ప్రవేశం చేశారు..
అలా ఆ సంస్థలో పుత్రవిజయం నాటకంలో చంద్రకాంతుడిగా..కుశలవ నాటకంలో కుశుడుగా..
సీతా లంకాదహనం లో సీతగా..నందినీవర్షం నాటకంలో చారుమతిగా, ప్రసన్నయాదవం నాటకంలో..కృష్ణుడిగా,బలభద్రుడిగా నటించేవారు..
ఆ రోజుల్లో వీరికి నెలకు 4 రూపాయలు జీతం గా సమాజం వారు ఇచ్చేవారు..సుబ్బారావు గారు జీతం పెంచనందున ఆ కంపెనీ వదిలేసి కొన్నాళ్ళు బందరులోనే ఒక వకీలు దగ్గర గుమస్తాగాచేరారు..

1910లో సెప్టెంబర్ 12 వతేదీన ఇండియన్ డ్రమెటిక్ కంపెనీ అనే నాటక సమాజాన్ని నల్లూరి బ్రహ్మానందం అనే ఆయన బందరులో స్థాపించారు..వీరికి సుబ్బారావు అంటే మహా ప్రాణం...సుబ్బారావు గారు ఆ కంపెనీలో చేరి 1910 నుండి 1946 వరకూ పలు రకాల పాత్రలు పోషించి ప్రసిద్ధి పొందారు.

ఆయన ఎంపిక చేసుకున్న పాత్రలు కూడా ఆణిముత్యాలే...
హరిశ్చంద్రుడు,నలుడు, పఠాన్, గోవింద సింగ్, వింధ్యరాజు,విశ్వపతి,తిమ్మరుసు,
శకారుడు,అర్జునుడు,శ్రీకృష్ణుడు,చాణక్యుడు, పృథ్వీరాజు‌, అక్షయకుమారుడు,మణభద్రుడు,
భగదత్తుడు,జయద్రధుడు,విజయరామరాజు,శ్రీరాముడు, లక్ష్మణుడు,సత్యవంతుడు,
సారంగధరుడు,భవానీశంకరుడు,దుర్యోధనుడు,కంసుడు ,భీముడు,వసుదేవుడు 

ఇలా ఎన్నెనో గొప్ప పురుషపాత్రలతోపాటుగా... యశోద,చంద్రమతి, పార్వతి, భానుమతి,సుగుణమణి,బుద్ధిమతివంటి స్త్రీ పాత్రల్నీ అపూర్వమైన రీతిలో పోషించి,నాలుగు దశాబ్దాలకాలంలో 54 రకాల వైవిధ్యమైన పాత్రలు ధరించి 
తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

పద్యపఠనంలో డి.వి.సుబ్బారావు గారిది ఓ ప్రత్యేకమైన పద్ధతి. 
తెలుగు పద్యనాటకాన్ని ఓ గొప్ప మలుపు తిప్పిన ఖ్యాతి 
నిజంగా ఆయనదే.వారి పద్యం సులువుగా,సుందరంగా,సుబోధకంగా,
ఉండడమేగాక,రాగ సమన్వితంగా, రసభావ స్ఫురితంగా ఉండేది. 
పద్యంలో పదబంధం విడిపడి, స్పష్టతతో పామరులకు కూడా సులువుగా అర్థమయ్యేది.
పద్యంలోని భావం ప్రస్ఫుటంగా కనిపించేది.అంతేగాక పద్యానికి ఉండవలసిన సంగీతం,
సందర్భం కలగలిసి విన్పించేవి.పద్యపఠనంలోని మాధుర్యం,భావప్రకటనా సామర్థ్యం 
ఇలా అన్ని అంశాలు ఆయన పాడే పద్యంలో కన్పించేది. 
డి.వి.సుబ్బారావు గారిని ప్రేక్షకుల హృదయంలో చోటుచేసుకున్నారు .కేవలం నటుడిగానే కాదు.
ఆయన అంతకన్నా గొప్ప నాటకసంఘ నిర్వాహకుడు.
'ఇండియన్ డ్రమెటిక్ కంపెనీని'1910 లో చేరిననాటినుండి,1946 వరకూ 36 సంవత్సరాల పాటు 
దిగ్విజయంగా నడిపించారు. 
ఈ 36 సంవత్సరాల లో రమారమి 34 నాటకాలు ప్రదర్శించారు.ఎవరు ఎంత ఎక్కువ మొత్తం ఇస్తామన్నా ఆయన తన నాటక సంస్థని విడిచివెళ్లలేదు.
అంతే కాదు ప్రకటించిన సమయానికి ప్రేక్షకులు ఉన్నా లేకపోయినా 
తెర ఎత్తి నాటకం మొదలు పెట్టడం మానలేదు.

అలాగే తన సంస్థలో పనిచేసే నటీనటులందరికీ ప్రభుత్వ ఉద్యోగంలా ప్రతినెలా 
మొదటి తేదీనే జీతాలు ఇచ్చిన సమర్థ నిర్వాహకుడు ఆయన.సుప్రసిద్ధ రచయిత 
పింగళి నాగేంద్రరావు లోనిప్రతిభాసామర్థ్యాల్ని లోకానికి వెల్లడించిన సహృదయ మిత్రుడు.

'హరిశ్చంద్ర' నాటక ప్రదర్శన, 
హరిశ్చంద్రపాత్రపోషణ,డి.వి.సుబ్బారావు గారికి అసమానమైన కీర్తిని ఆర్జించి పెట్టిందనడంలో ఎంత సత్యమున్నదో అదేవిధంగా ఆ నాటకానికి,ఆ పాత్రకు జీవం పోసారనడంకూడా సత్యదూరం కాదు.

1946లో సినీరంగ ప్రవేశించి 'వింధ్యరాణి' చిత్రంలో వింధ్యరాజుగా నటించి 
ప్రశంసలందుకొన్నారు.

1916లో బందరులో జరిగిన చిత్రనళీయం' నాటక పోటీలో,
ఈ డ్రమెటిక్ కంపెనీకి విజయం లభించింది. సరస్వతీ విగ్రహం 
బహుమానంగా అందించారు.

1923లో బందరు పౌరులు 'నటరాజు' బిరుదు ప్రదానం గావించగా, 
1943లో అదే బందరులోనే నాట్యకళా ప్రపూర్ణ'బళ్ళారి రాఘవాచార్యులు 
తన హస్తాలమీదుగా'నటరాజ శేఖర'బిరుదుతో,  గజారోహణంతోనూ, ఘనంగా సన్మానించారు

1917లో గుంటూరు లో 
' హరిశ్చంద్ర' నాటక పోటీలు జరిగినప్పుడు ఆ పోటీలో సుబ్బారావు గారు
మొదటి బహుమతి అందుకున్నారు. ఆయన ఏ పాత్ర ధరించినా 
ఆయన మరుగుపడి, ఆ పాత్ర రూపమే రంగస్థలిపై ఆవిష్కరింపబడేది.
ఇదే ఆయన అసమాన,అద్వితీయ ప్రతిభకు తార్కాణం.

ఆరోజుల్లో మద్రాసులో తెలుగు చలన చిత్ర దర్శక, నిర్మాతలు మంచి నటీనటుల అన్వేషణలో బందరు వచ్చి వీరి నిర్వహణలో ఉన్న సమాజం లోని నటీనటులను ఆ పాత్రలకు ఎంపిక చేసుకునేవారు...అలాగే ఘంటసాల బలరామయ్యగారు.."సీతారామజననం" చిత్రానికి బాల నటుల అన్వేషణలో బందరువచ్చి వీరిని కలిసి తిరుగు ప్రయాణంలో విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేని వారిని చూడబట్టి వారికి సినీజీవితం ఆరంభమయింది. 

ఆయన ఆంధ్ర  నాటక రంగం స్వర్ణ యుగంలోకి ప్రవేశిస్తుండగానే ప్రవేశించి,బాల నటులు గా,నటులుగా,ఉత్తమనటులుగా,మహనటులుగా,ప్రయోక్తగా,న్యాయనిర్ణేతలుగా,,సమాజ నిర్వహకులుగా,సినీ నటులుగా,పలువిధాలుగా నాటకరంగానికి విశిష్ట సేవలుచేసి,దాని అభ్యున్నతికి ఆహారహారం పాటుబడి నటరాజశేఖరుడిగా చిరస్థాయి కీర్తి వ్యాప్తి తో 1960 జనవరి 7వతేదీన ఆ నటరాజులో ఐక్యమయినారు...

తెలుగు నాటకం నిలచి ఉన్నంత కాలం డి.వి.సుబ్బారావు గారు నిలచే ఉంటారు. 
ముఖ్యంగా 'సత్యహరిశ్చంద్ర' నాటక ప్రదర్శన ఎక్కడ జరిగినా,అక్కడ ఒక్క సారైనా
ఆయన ప్రస్థావన రాకుండా ఉండటం జరగదు.

ఆంధ్ర నాటక రంగంలో ఒక మేరు పర్వతం సుబ్బారావు డి. వి...!!
ఆయన అధిరోహించని ఎత్తులు ఏవి..!!??
★★★★★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★★★★
(సేకరణ-నూలు)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి