17, అక్టోబర్ 2020, శనివారం

ఈలపాట రఘురామయ్య

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
"ఎవరి పాట అయితే విని నైటింగేల్ ఆఫ్ ఆంధ్ర" అని విశ్వకవి రవీంద్ర నాధ్ ప్రస్తుతించారో....
ఎవరి నటనైతే చూచి సాక్షాత్ రఘు రాముడివే నీవని కాశీనాధుని నాగేశ్వరరావు గారు పాత్ర పేరు పెట్టి మెచ్చుకున్నారో....
ఎవరి ఈలపాట అయితే విని ఆయన వేళ్ళ మధ్య పరికరం ఏమన్నా ఉందా..!!?? అని ప్రధాని  జవహర్ లాల్ నెహ్రు ఆశ్చర్యం తో ఆడిగారో....
 ఆ #ఈలపాట #రఘురామయ్య గారే  మా తెలుగు నాటక రంగ  వైభవం ఈ నాడు గుర్తుకుతెచ్చుకుంటున్న "#చిరస్మరణీయులు...  
మనం ఈలపాట  రఘురామయ్య  అని పిలుచుకునే ఈయన అసలు పేరు కల్యాణం చిన వెంకటసుబ్బయ్య.ఆయన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో 1901 మార్చ్ 5వతారీఖున కల్యాణం నరసింహా రావూ,సుబ్బమ్మ దంపతులకు అయిదవ సంతానంగా జన్మించాడు.వారు మొత్తం ఎనిమిది మంది సంతానం.ఇతని కంటే పెద్దతని పేరు కూడా వెంకటసుబ్బయ్య కావడంతో ,ఇతనిని చిన వెంకటసుబ్బయ్య అని పిలిచే వారు.
చిన్నప్పటినుండీ చదువుకు దూరంగానూ,ఆటపాటలకు దగ్గరగానూ గడిపేవారు.

ఏవో కూని రాగాలు తీస్తూ,లొల్లాయి పదాలు పాడుతూ,ఊళ్లో ఏ సన్నాయి మేళం కనపడినా వారి వెంటబడిపోతూ,ఊరి వెంట బలాదూరుగా తిరుగుతున్న ఆయన్ని గొర్రెలను కాసేపనిలో పెట్టారట తల్లిదండ్రులు.తల్లి చాలా గారాబంగా చూసేదట ,అందరికీ జొన్నన్నమైతే ఇతనికి వరన్నం,మీగడపెరుగూ పెట్టేదట.

అలా గొర్రెలను కాచుకుంటూ యేవో తోచిన పాటలు పాడుకుంటూ తిరిగే ఆయన,తోటి గొర్రెలకాపరులను పిలవడానికి ఒక రోజు ఈల వేశాడట.అది చాలా ప్రత్యేకంగా తోచిన మిత్రులు"ఇదేదో భలేగా వుందే"అని మెచ్చుకుంటే ,ఈలమీద పాటలూ,రాగాలూ కూడా తీసి వినిపించాడట.ఇలా చినవెంకటసుబ్బయ్య పద్యాలూ,పాటలూ బాగా పాడుతున్నాడని తెలుసుకున్న,వారి ఊరి వాడే అయిన దంటు వెంకట కృష్ణయ్య ,తన స్నేహితుడూ ప్రఖ్యాత నటుడూ అయిన యడవల్లి సూర్య నారాయణకి అప్పగించాడు. యడవల్లి .సూర్యనారాయణ గుంటూరులో వుండేవాడు,ఆయన "నాటక పితామహ"అని పిలుచుకునే హరిప్రసాదరావు శిష్యుడు.

ఆయన ఆ సమయంలో "రామదాసు"నాటకంలో రామదాసు కొడుకు రఘురాముడు వేషం వేసేందుకు ,బాగా పాడగల బాలనటుడి కోసం వెతుకుతున్నాడు. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టనిపించిందాయనకు.చదువుసంధ్యా లేని చిన సుబ్బయ్య లో అధ్భుతమైన గాన ప్రతిభ దాగి వుందని గమనించాడాయన .అతనికి మంచి తర్ఫుదు ఇచ్చి మంచి నటుడుగానూ ,గాయకుడుగానూ తీర్చిదిద్దాలనుకున్నాడు.అతని పాట విన్న వెంటనే తన జేబులోనుండి ముఫ్ఫయి రూపాయలు తీసి ఇచ్చారు. పారితోషికంగా.ఆ డబ్బుతో అతని తండ్రి సుద్దపల్లిలో మూడెకరాలు పొలం కొన్నాడట. ఇదంతా జరిగేటప్పటికి చిన వెంకట సుబ్బయ్యకి ఏడెనిమిది సంవత్సరాల వయస్సు.అప్పటి నుండీ ఆయన తన దగ్గరే వుంచుకుని అతనికి పాడటంలో,నటనలో మంచి శిక్షణ నిచ్చాడు.పొద్దున లేచిన దగ్గరనుండీ వివిధ రాగాలలోని పద్యాలూ,పాటలూ వినడం,రాగాలు గుర్తించటం,సాధన చేయడం,సంభాషణలు ,పలకడం మళ్లీ సాయంత్రం రిహార్సల్సూ.ఇటువంటి శిక్షణలో చిన వెంకట సుబ్బయ్య సానబెట్టిన వజ్రంలా తయారయ్యారు.

యడవల్లి సూర్యనారాయణగారి "రామదాసు, శకుంతల,కృష్ణ లీలలు"లోని బాలపాత్రలు వరసగా "రఘురాముడు,భరతుడు,శ్రీకృష్ణుడు "పాత్రలు ధరిస్తూ పద్యాలూ,పాటలూ అవలీలగా పాడుతూ మంచి పేరు తెచ్చుకుని "గాన బాలసరస్వతి "అనే బిరుదుకూడా తన గురువు గారి గురువైన హరిప్రసాద రావు గారి చేతుల మీదుగా అందుకున్నారు.
మరి ఈ చిన వెంకట సుబ్బయ్య "రఘురామయ్య "ఎలా అయ్యాడంటే,యడవల్లి బృందం ఆంధ్ర దేశంలోనే కాక చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పర్యటిస్తూ తమ నాటకాలను ప్రదర్శించే వారు ,అలా వారు మద్రాసు లో 1912సం"లో విక్టోరియా హాలులో "రామదాసు "ప్రదర్శి స్తున్నపుడు,రామదాసు కొడుకుగా నటిస్తున్న చినవెంకట సుబ్బయ్య ధాటీగా ,పద్యాలూ,పాటలూ పాడుతుంటే అతిథి గా వచ్చిన కాశీనాథుని నాగేశ్వరరావుగారు చూసి ఎంతో మెచ్చుకుని కొంత డబ్బూ ,ఒక బంగారు గొలుసూ ప్రదానం చేసి "రఘురాముడంటే ఇతనే "అన్నారట.ఆనాటి నుండీ అందరూ ఆయన్ని "రఘురామయ్య "అని పిలవ సాగారు.

చిన్నప్పుడు గొర్రెలు కాచుకునేటప్పుడు పాడిన ఈలపాట,నాటకాల వాళ్లను కూడా ఆకర్షించింది.నాటకం చివర తప్పని సరిగా ఆయన ఈలపాట కచేరీ కూడా వుండటం ఆనవాయితీ అయింది.1915 లో సికింద్రాబాద్ లో జరిగిన ఈల పాట కచేరీ తర్వాత అందరూ ఆయన్ని "ఈలపాట రఘురామయ్య "అనసాగారు. క్రమేణా ఆయన బాలనటుడి స్థాయినుండీ పెద్ద నటుడి స్థాయికి చేరుకున్నాడు.మనిషి రూపం కూడా చక్కగా వుండటంతో,అన్ని రకాలపాత్రలూ,స్త్రీ వేషాలతో సహా కొట్టినపిండి అయ్యాయి.
యడవల్లి సూర్యనారాయణతో బాటు,కపిలవాయి రామనాథశాస్త్రి,జొన్నవిత్తుల.శేషగిరిరావు,పువ్వుల సూరిబాబు,స్థానం నరసింహా రావు,రాళ్లభండి కుటుంబరావులాంటి ఉద్దండులైన నటుల సాహచర్యంలో పోటా పోటీగా నటించి,సాటిలేని మేటిగా రాటుదేలారు.కానీ ఆయన తనను కన్న కొడుకుగా చూసుకుని ఉన్నతశ్రేణికి చెందిన నటునిగా తీర్చి దిద్దిన గురువు యడవల్లి సూర్యనారాయణను మరిచి పోలేదు జీవితాంతం కృతజ్ఞతగా తలుచుకునే వారు.

ఇంతలో టాకీ సినిమాల ప్రభంజనం బలంగా వీచసాగింది.రంగస్థల నటులందరూ,యడవల్లి సూర్యనారాయణతో సహా సినిమాల వేపు బలంగా ఆకర్షింపబడ్డారు. ఈ లోగా బెజవాడలో మారుతీ టాకీసు స్థాపించిన ప్రముఖ ఎగ్జిబిటర్ పోతిన శ్రీనివాసరావుగారు ,ఒక నాటక ప్రదర్శనలో నారదుడిగా నటిస్తున్న రఘురామయ్యను చూసి చాలా ముచ్చట పడ్డారు.
ఆయన పూనా లోని "సరస్వతీ సినీ టోన్ "అనే సంస్ధ తరఫునతాను నిర్మించి,దర్శకత్వం వహించిన "పృథివీ పుత్ర" అనే సినిమాలో నారద వేషానికి రఘురామయ్యను బుక్ చేశారు.అలా ఆయన చిత్రజైత్ర యాత్ర ప్రారంభమైంది.
మన రఘురామయ్యను "పృథివీ పుత్ర" సినిమాకు నారద పాత్రకోసం బుక్ చేసుకున్న నిర్మాతా,దర్శకుడూ పోతిన శ్రీనివాసరావు అని చెప్పుకున్నాం కదా ఆయన నిర్మాత డూండీ కి తండ్రి.

అంతే కాదు ఆంధ్రదేశంలో మొట్టమొదట సినిమా థియేటర్ (1921)ని "మారుతీ టాకీస్ "పేరిట బెజవాడలో నిర్మించిన ఘనత ఈయనదే .అందులో మొదట్లో టాకీలు రాకమునుపు మూకీలు కూడా ఆడేవారు. పూనాలోని "సరస్వతీ సినీటోన్ "అనే సంస్థ తమ చిత్రాలకు ఎగ్జిబిటర్ గా వున్న పోతిన.శ్రీనివాసరావుని తమ సంస్థ పేరిట ఒక తెలుగు చిత్రం తీయమని కోరింది .దానికాయన ఒప్పుకుని "పారిజాతాపహరణం,నరకాసుర వధ"లని కలిపి "పృథివీపుత్ర "అనే చిత్రం తీశాడు.అది ఆయన తీసిన ఒకే ఒక్క చిత్రం ,పూనా లో షూటింగ్ జరుపుకుంది.1933 డిసెంబర్ లో విడుదలయింది ,రఘురామయ్య నారద వేషానికి మంచి పేరు వచ్చింది.

తర్వాత బెజవాడ తిరిగి వచ్చి నాటకాలాడడం మొదలు పెట్టాడు ,మధ్య మధ్యలో సినిమాలూ వస్తూనే వున్నాయి .1935లో "భక్త కుచేల"వచ్చింది అందులో కృష్ణుడి వేషం.ఈ సినిమా రిలీజయ్యాక ,నిర్మాత హెచ్ .ఎం .రెడ్డి,దర్శకుడు హెచ్ .వి .బాబు కలిసి "దృౌపదీ వస్త్రాపహరణం"అనే సినిమాతీయాలనుకుని ,అందులో కృష్ణుడి వేషం రఘురామయ్యకిద్దామనుకున్నారు,ఎలా వుంటాడో చూద్దామని "భక్తకుచేల" ప్రదర్శించే థియేటర్ కి వెళ్లి చూసి "చాలా లావుగా,మోటుగా వున్నాడని వద్దనుకున్నారు.ఈ మాటలు వారి వెనకే వున్న రఘురామయ్య విని బాధపడ్డాడు.ఆవేషం సి.యస్ .ఆర్ .కి వెళ్లింది.ఆ రోజునే నటుడికి శారీరం (గాత్రం)తో పాటు శరీరం కూడా ముఖ్యమే అని తెలుసుకున్న రఘురామయ్య కఠినమైన ఆహారనియమాలతో,క్రమబధ్ధమైన వ్యాయామంతో,యోగాభ్యాసం తో తన శరీరాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు.తన ఆరోగ్యానికేం ఢోకా లేదనీ ఎనభై యేళ్లు పైబడి బతుకుతాననీ చెప్పేవారట.చివరి వరకూ ఆయన నియమ బధ్ధమైన జీవితాన్నే గడిపే వారు.

భక్త కుచేల తర్వాత ఆయన "లంకాదహనం,రుక్మిణీ కల్యాణం,కచ దేవయాని,గొల్లభామ "మొదలైన చిత్రాలలో నటించారు.విచిత్రమేమంటే ఆయన సుమారు41 చిత్రాలలో నటించారు అందులో నాలుగో,అయిదో సాంఘికాలు మిగతా వన్నీ పౌరాణికాలే. వాటిల్లో మళ్లీ 13శ్రీకృష్ణ పాత్రలూ,10నారద పాత్రలూ,4ఇంద్ర పాత్రలూ.1967లో ఆయన శిష్యుడూ,నటుడూ అయిన పద్మనాభం తీసిన "శ్రీమర్యాదరామన్న"ఆయన చివరి చిత్రం .అయితే ఆయన నటించిన చిత్రాలలో 1947 లో వచ్చిన "గొల్లభామ "లో ఆయన వేషం ప్రత్యేకమయినది ,అందులోని పాటలూ,పద్యాలూ ప్రజలను బాగా ఆకర్షించాయి."వలపు తేనియలూనిన వనజ మీవు"అనే పద్యం పాడకపోతే జనాలు ఊరుకునే వారు కారు.ఒకసారి ఏకంగా ట్రెయినాపేశారు పద్యం పాడేదాకా. ఆయనా ,సి.కృష్ణవేణీ కలిసి పాడిన యుగళగీతాలు కూడా ఈనాడు విన్నా మధురంగా వుంటాయి.
ఆయన నటించిన చిత్రాలలో ముఖ్యమయినవి -గొల్లభామ తర్వాత"చింతామణి,దక్షయజ్ఞం,ఉషా పరిణయం,శ్రీకృష్ణమాయ,,నాగులచవితి,మదాలస ,మాయపిల్ల,దేవాంతకుడు,మోహినీ భస్మాసుర" 1967 లో వచ్చిన శ్రీమర్యాదరామన్న తర్వాత నాటక రంగానికి తిరిగి వచ్చి నాటకాలలో ముమ్మరంగా నటించసాగారు.1975లో "శ్రీరామాంజనేయ యుధ్ధం లో రెండు పాటలు ఆంజనేయుడికి ప్లేబాక్ పాడారంతే.

చివరి వరకూ ఆయన కంఠం అంతే స్థిరంగా,శ్రావ్యంగా చెక్కుచెదరకుండా వుండటాని కి హిందూస్థానీ సంగీతం మీద వున్న మక్కువతో ఆయనచేసిన సాధనా,కర్ణాటక సంగీతం మీద వున్నపట్టూ,కారణమనిపిస్తాయి.
హిందుస్థానీ సంగీతంలో ఆయన "బాలగంధర్వ"కి ఏకలవ్య శిష్యుడు.చిన్నతనం నుండీ ఆయన రికార్డులు వినేవాడు,అలాంటి బాణీల్లోనే పద్యాలూ,పాటలూ రాయించుకునే వాడు.
అసలు "బాలగంధర్వ "ఎవరంటే మరాఠీ రంగస్థలం మీద ఆడే మ్యూజికల్ డ్రామాల్లో స్త్రీ పాత్రలు ధరిస్తూ పాటలు పాడే ప్రముఖ హిందుస్థానీ గాయకుడు.ఆయన అసలు పేరు నారాయణ శ్రీ పాద రాజ హంస్ .ఆయన గురువు భాస్కర్ బువాబక్లే .చిన్నతనంలో ఆయన పాడుతుండగా విని లోకమాన్య బాలగంగాధర తిలక్ "బాలగంధర్వ "అనే బిరుదిచ్చాడు.
ఆయన బాణీని సొంతం చేసుకుని నాటకాల్లో పద్యాలూ ,పాటలూ పాడే రఘురామయ్యని చూసి తెలుగుప్రేక్షకులే కాదుమరాఠీ వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు.

1970ప్రాంతాలలో ప్రముఖ మరాఠీ నటగాయకుడూ,సంగీతజ్ఞుడూ పి.యల్ .దేశ్పాండే మన రఘురామయ్య బాణీ విని ఆశ్చర్యపోయి ,ఆయనను బాలగంధర్వ పేరిట జరిగే సంగీత పోటీలకు ముఖ్య అతిథి గా ఆహ్వానించారు.పూనా లో జరిగిన ఆసభలోమహామహులైన భీమ్ సేన్ జోషీ,హీరాబాయ్ బరోడ్ కర్ ,నారాయణరావ్ వ్యాస్ ,వసంత దేశ్ పాండేల ముందు రఘురామయ్య "మూర్తిమంత భితి ఊభి "అనే బాలగంధర్వ పాటని అతి మధురంగా గానం చేసి వాళ్లందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.ఈ సంఘటన పి.యల్ .దేశ్ పాండే బాలగంధర్వ శతజయంతి సంచికలో స్వయంగా రాసి పేర్కొన్నాడు .ఇంతకంటే ఆయన ప్రతిభకు కొలమానంవేరే కావాలా!

ఆయన వ్యక్తిగత జీవితాని కి వస్తే --మొదటి వివాహం 1930లో ఈమని గ్రామానికి చెందిన లక్ష్మీకాంతమ్మతో జరిగింది,దురదష్టవశాత్తూ ఆమె 1932లో ప్రసవ సమయంలో మరణించింది,బిడ్డకూడా దక్కలేదు.
రెండవ వివాహం 1938లో బాపట్లకు చెందినరోహిణి.సావిత్రిని చూసి ఇష్టపడి చేసుకున్నది.
ఆవిడ రఘురామయ్య కంటే చదువుకున్నది.ఆవిడ ఆయనకి నాటకాలూ ,సినిమాల స్క్రిప్టులు చదివి పెట్టడం లోనూ,పద్యాలు ధారణ చేయడం లోనూ,పదాలవిరుపుల గురించీ,భావం పలకడం గురించీ చాలా సహాయం చేస్తూ వుండేది.వారికొక కుమార్తె పేరు సత్యవతి. 1963లో ఆయన నాటకాలలో నటించే తన సహనటి ఆదోని లక్ష్మిని వివాహమాడారు వారికి ఇద్దరు మగపిల్లలు రామకృష్ణ,శ్రీధర్ ,ఒక ఆడపిల్ల ఆండాళ్

ఇక ఆయన పొందిన సన్మానాలూ ,గౌరవాలూ లెక్కేలేదు.

1928 లో రవీంద్రనాథ్ టాగూర్ కలకత్తాలో ఈయన పాట విని "నైటింగేల్ ఆఫ్ ఆంధ్రా స్టేజ్ "అని ప్రశంసించారు.1973లో బాలగంధర్వకి లభించినట్టే కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కారం లభించింది.గజారోహణాలూ,కనకాభిషేకాలూ జరిగాయి.1975 లో పద్మశ్రీ ప్రకటించారు.అయితే దురదృష్ట వశాత్తూ అది అందుకోకుండానే ఆయన మరణించారు.
మంత్రులూ,రాష్ట్రపతులూ,జడ్జీలూ ఆయన అభిమాన గణంలో వుండేవారు.1951లో ప్రథానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆయన ఈలపాట విని ఆశ్చర్యపోయి,వేళ్లమధ్య యేమైనా పరికరం వుందా అని అడిగారు. 1974లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కూడా ఈయన ఈలపాటవిని ప్రశంశించారు.

80ఏళ్ల పైనే జీవిస్తానని అందరికీ అభయమిచ్చిన రఘురామయ్య తన 74వయేట 1975ఫిబ్రవరి 24వ తేదీన తనువు చాలించి తన గంధర్వలోకానికేగారు."వలపు తేనియలూనిన"అని తేనెలూరిన గొంతు శాశ్వతంగా మూగబోయింది.
చివరి వరకూ సంతకం చేయడం కూడా చేతకాని ,ఒక పల్లెటూరి బాలుడు ,ఒక్క తప్పుకూడా లేకుండా సంస్కృత సమాసాలూ ,పద్యాలూ ,పాటలూ పాడి మహా గాయకుడుగా,మహా నటుడుగా యెదిగి నలభైవేలకు పైగా నాటకప్రదర్శనలు జరిపి,నలభై యొక్క సినిమాలలో నటించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడంటే దాని వెనక ఆయన చేసిన కృషీ,పట్టుదల ఆయన పడిన కష్టం మనకు నిజంగా అద్భుతాన్నీ,ఆశ్చర్యాన్నీ కలిగించాయి. ఆయన పాడిన పాటలూ,పద్యాలూ కొన్నయినా అంతర్జాలంలో దొరుకుతుండడం అదృష్టం
 జై రఘురామా...!!!సాకేత సార్వభౌమా...!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి