23, అక్టోబర్ 2020, శుక్రవారం

శ్రీ సురభి కమలాబాయి

ఆంధ్ర నాటకరంగ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యం వహించే సురభి నాటకాల చరిత్ర ఆంధ్రులందరికీ పరిచయమైనదే. ఆంధ్రనాటకరంగానికి తొలి ఉత్సాహాన్ని ఇచ్చిన ధార్వాడ కంపెనీవారూ, 
తోలు బొమ్మల ఆటలవారూ 
ఏ మహారాష్ర్టులో, 
ఈ సురభి నాటక కళాకారులు కూడా 
ఆ మహారాష్ట్రులే.
సురభి కళాకారులు ఆంధ్రనాటకరంగానికి 
అపార మైన సేవచేశారు. 
కేవలం భుక్తికొరకే కాక కళాదృష్టితో 
వారు నాటకాలను ప్రదర్శిం చారు. 
కుటుంబాలు కుటుంబాలే ఆంధ్రదేశపు 
నాలుగు చెరగులా విస్తరించి నాటకరంగానికి బహుముఖ సేవ చేశారు.

అలా సేవచేసిన కుటుంబాలకోవకు చెందినదే 
సుప్రసిద్ద చలనచిత్ర ప్రథమ కథానాయకి 
సురభి కమలాబాయి.

కమలాబాయి 1908 ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాదులో జన్మించింది. 
తండ్రి ప్రసిద్ధ సురభికళాకారుడు 
వనారస పెద కృష్ణాజీరావుగారు. 
తల్లి వెంకుబాయి. ఈమె మహా సంగీత విద్వాంసురాలు. జంఝూటి రాగాలాపన చేయడంలో అందెవేసిన విదుషీమణి. అందువల్ల ఈమెను 
జంఝూటి వెంకుబాయి 
అని పిలిచేవారు.

కమలాబాయి తండ్రి కృష్ణాజీరావుగారికి స్వంత 
సురభి నాటక సమాజం ఉండేది. 
కళాకారుల కుటుంబంలో పుట్టిన కమలాబాయి చిన్నతనంలోనే వారి సమాజ నాటకాలలో బాలకృష్ణుడు. ప్రహ్లాదుడు, లవుడు మొదలైన బాలపాత్రలను అద్భుతంగా పోషించింది.

కమలాబాయి నహజసౌందర్యవతి, 
కమ్మని కంఠం, స్వచ్ఛమైన, శ్రావ్యమైన ఉచ్చారణ, పాత్రపోషణలో ఆమెకు ఆమెయే సాటి.

బాలవేషాలతో పేరు తెచ్చుకున్న కమలాబాయి యుక్తవయస్సురాగానే సమాజంలోని కథానాయకి పాత్రలను అన్నిటినీ కడు సమర్థనీయంగా నటిస్తూ, తండ్రి గారి అనంతరం సమాజాన్ని స్వయంగా 
తానే నిర్వహించింది.

కమలాబాయ నటజీవితంలో 
కొన్ని వందల సువర్ణ, రజత పతకాలను 
బహమతిగా పొందింది.

ఆ రోజుల్లో నాటక ప్రదర్శనాలలో 
మధ్య మధ్య వచ్చే విరామసమయాలలోనూ, 
హాస్య సన్నివేశాలలోనూ 
అద్భుతంగా నృత్యం చేస్తూ ఉండేది.

ఆమెకు సహజ సంగీతజ్ఞానం ఉన్నా, 
హిందూస్థానీ సంగీతం నేర్చుకోవాలనే 
కుతూహలంతో బొంబాయి వాస్తవ్యుడు 
పరశురాంబువ వద్ద హిందూస్థానీ సంగీతాన్నీ అభ్యసించి బాలగంధర్వగా ప్రశంసలను అందుకుంది.

తెలుగు టాకీయుగం ప్రారంభమైన తరువాత ప్రప్రథమంగా చలన చిత్రాలలో కథా నాయకి పాత్రధరించిన ప్రప్రథమ తెలుగు వనిత సురభికమలాబాయి. 
ఆ ఘనత ఆమెకే దక్కింది.

బాల్యం నుంచి రంగస్థల నటిగా ఎదుగుతూ,
1931లో  హెచ్‌.ఎం.రెడ్డి రూపొందించిన 
తొలి టాకీ చిత్రం
'భక్త ప్రహ్లాద'లో హిరణ్యకశిపునిగా నటించిన 
మునిపల్లె వెంకటసుబ్బయ్య సరసన 
లీలావతిగా నటించారు.

తరువాత సర్వోత్తమ బదామి దర్శకత్వంలో 
సాగర్‌ ఫిలింస్‌ రూపొందించిన 
'పాదుకా పట్టాభిషేకం'లో సీతగా 
అద్దంకి శ్రీరామమూర్తి సరసన, 
'శకుంతల'లో శకుంతలగా యడవల్లి సూర్యనారాయణతో నటించారు. 
బి.వి.రామానందం దర్శకత్వంలో 
కృష్ణా ఫిలింస్ నిర్మించిన 
'సావిత్రి'లో సావిత్రిగా 
టైటిల్‌ రోల్‌ పోషించారు. 
సరస్వతి సినీ టోన్‌ నిర్మించిన 
'పృథ్వీపుత్ర'లో ఓ ముఖ్యపాత్ర పోషించారు.

కమలాబాయి ప్రతిభ గురించి విని, 
ప్రత్యక్షంగా చూసి ముగ్ధుడైన సాగర్ ఫిల్మ్ అధినేత కమలాబాయిని బొంబాయికి ఆహ్వానించాడు. 
అక్కడే పదేళ్లపాటు ఉండి సాగర్ ఫిల్మ్ నిర్మించిన సినిమాలలో నటించింది. 
మహాభారతం వంటి 25 చిత్రాలలో నటించింది.

1939లో విడుదలైన భక్తజయదేవ 
సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలో 
నటించడం ప్రారంభించింది. 
విశాఖపట్నంలోని ఆంధ్రా సినీ టోన్ అనే 
చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న 
ఈ చిత్రాన్ని తెలుగు, బెంగాళీ భాషలలో నిర్మించారు. 
ఈ రెండు భాషలలోనూ కమలాబాయే కథానాయకి. 
ఆ చిత్రంలో రెంటచింతల సత్యనారాయణ, 
సురభి కమలాబాయి ముఖ్య పాత్రధారులు. 
ఆ చిత్రానికి హిరేన్ బోస్ అనే బెంగాలీ ఆయన దర్శకుడు. అయితే ఆయన సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రం కావడంతో చిత్ర నిర్మాణం 
సరిగా సాగలేదు. నిర్మాణం ఆగిపోయి నిర్మాతలకు భారీగా నష్టం వచ్చే పరిస్థితిలో కథానాయిక పాత్ర ధరించడంతో పాటు దర్శకత్వం, 
ఎడిటింగ్ కూడా తనే నిర్వహించి, 
చిత్రాన్ని పూర్తి చేసి అందర్నీ 
ఆశ్చర్యపరచింది కమలాబాయి.
అయితే చిత్రం టైటిల్స్ లో మాత్రం 
దర్శకుడిగా హిరేన్ బోస్ పేరే కనబడుతుంది.

అలాగే తొలి ద్విభాషా చిత్రమైన 
తుకారాం (1940) తెలుగు వెర్షన్లో 
ఈమె నటించింది. అప్పటి వరకు 
కథానాయకి పాత్రలు పోషించిన కమలాబాయి
ఆ తర్వాత సినిమాలలో కారెక్టర్ రోల్సు వెయ్యటం ప్రారంభించింది. ఈ విధంగా నటించిన సినిమాలలో పత్ని, మల్లీశ్వరి, లక్ష్మమ్మ, పాతాళభైరవి, 
సంక్రాంతి, అగ్నిపరీక్ష ముఖ్యమైనవి.

మద్రాసులో జరిగిన భారత చలన చిత్రోత్సవం సందర్భంలో దక్షిణభారత నటీనటసమాఖ్యవారు 
ప్రప్రథమంగా తెలుగు చిత్రాలలో నటించినందుకు 1957 జనవరి 17వ తేదీన ఒక షీల్డు, 
సన్మానపత్రం ఆమెకు ప్రదానంచేసారు.

1966లో ఆంధ్ర ఫిల్మ్ జర్నలిస్టుల అసోషియేషన్ వారు, 
1967లో ఏలూరులో ఆంధ్ర నాటక కళాపరిషత్తు మహాసభలలో పరిషత్తువారు, 
1969లో ఏలూరు వై . ఎమ్. హెచ్. ఎ.వారు,  
నాటక సినిమా రంగాలకు 
ఆమె చేసిన సేవను ప్రశంసిస్తూ 
ఘనంగా సన్మానించారు.

హిందూస్థానీ సంగీతంతో పాటు హార్మనీ, 
సారంగీ, వయొలిన్ మొదలైన వాద్యాలను 
గొప్పగా వాయించేది.

కమలాబాయి హాస్య చతుర. 
సినిమా సెటులో ఉన్నప్పుడూ, 
విడిగానూ కడు చమత్కారంగా మాట్లాడేది.

అనేక తెలుగు నాటకాలలోనూ, 
సినిమాలలోనూ వివిధ పాత్ర లను 
అద్భుతంగా పోషించి ప్రసిద్ధ నటిగా 
వెలుగొందిన సురభి కమలాబాయి 
1971 ఫిబ్రవరి 18వ తేదిని ఏలూరులో 
ఆమె స్వగృహంలో స్వర్గస్థురాలైంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి