28, అక్టోబర్ 2020, బుధవారం

బి.వి.రంగారావు

శ్రీ బి.వి. రంగారావు
 ప్రముఖ రంగస్థల నటులు, కళాప్రవీణ బిరుదాంకితులు.

శ్రీ రంగారావు 1920, సెప్టెంబర్ 24 న నరసింహారావు, సీతారావమ్మ దంపతులకు కృష్ణాజిల్లా, విజయవాడ సమీపంలోని తెన్నేరు లో జన్మించారు. 12 సంవత్సరాల వయసులో తల్లి మరణించడంతో మేనమామైన తెన్నేటి చలపతిరావు దగ్గర ఉండి ఎస్.ఎస్.సి. పూర్తిచేసి విజయవాడ మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగిగా చేరారు.

★రంగస్థల ప్రస్థానం
వెంట్రప్రగడ నారాయణరావు ప్రోత్సాహంతో మారుతీ సీతారామయ్య (హార్మోనిస్టు) దగ్గర శిక్షణ పొందారు. అనంతరం పాండవోద్యోగ విజయాలు, గయోపాఖ్యానం మొదలైన నాటకాలలో అర్జునుడి పాత్రతో నాటకరంగంలోకి ప్రవేశించారు. పులిపాటి వెంకటేశ్వర్లు తరువాత అర్జున పాత్రలో విశేష గుర్తింపు పొందారు. బందా కనకలింగేశ్వరరావు ప్రోద్భలంతో ఏలూరు ప్రభాత్ నాటక సమాజంలో చేరి ఆయన పక్కన అర్జునుడు, భృగుమహర్షి (శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం) పాత్రలలో నటించారు.

బందా విజయవాడలోని ఆలిండియా రేడియోలో చేరడంతో, బి.వి.రంగారావు వృత్తి నటుడిగా వెలుగొందారు. ప్రముఖ రంగస్థల నటులైన అబ్బూరి రామకృష్ణారావు, అద్దంకి శ్రీరామమూర్తి, మాధవపెద్ది వెంకటరామయ్య మొదలైన వారితో కలిసి నటించారు. అనంతరం పీసపాటి నరసింహమూర్తి పక్కన అర్జునుడి పాత్రలో రేడియో నాటకాలలో నటించారు. ఈయన వివిధ నాటకాలలో విభిన్న పాత్రలలో నటించినా, అర్జునుడి పాత్రలోనే ఎక్కువపేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 1975, సెప్టెంబర్ 30న రంగారావు ఉద్యోగ విరమణ సందర్భంగా సత్య హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు. అప్పుడు విజయవాడ పట్టణ పౌరులు, కళాకారులు రంగారావును ఘనంగా సన్మానించారు. కళారంగ వికాసం కోసం కృషి చేసిన బి.వి. రంగారావును ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ కళాప్రవీణ బిరుదునిచ్చి సత్కరించింది.

★నటించిన పాత్రలు:
అర్జునుడు (పాండవోద్యోగ విజయాలు, గయోపాఖ్యానం)
భృగుమహర్షి (శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం)
హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్ర
శివాజీ (శివాజీ) - నెల్లూరు లో గవర్నరు చేతుల మీదుగా రజత పాత్ర బహుమతిగా వచ్చింది.
శ్రీ రంగారావు 1996లో ఆ నటరాజు సాన్నిధ్యం చేరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి