17, అక్టోబర్ 2020, శనివారం

సి.ఎస్.ఆర్(చిలకలపూడి సీతారామాంజనేయులు)

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
తెలుగు నాటక రంగ తొలినాళ్ళలో కృష్ణ పాత్రకు మేటి...!!
శ్రీ సీతారామాంజనేయులు చిలకలపూడి...!!

సి.ఎస్.ఆర్ గా మనం పిలుచుకునే తొలితరం నాటకరంగ,చిత్ర రంగనటులు పూర్తిపేరు చిలకపాటి సీతారామాంజనేయులు గారు
నరసరావుపేట. జూలై 11, 1907న జన్మించారు. తండ్రి లక్ష్మినరసింహ మూర్తి నరసరావుపేట రెవెన్యూ కార్యాలయంలో పనిచేసేవారు. ఆయనకు నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో సి.ఎస్‌.ఆర్‌ అందరికన్నా పెద్దవాడు. తండ్రికి నాటకాల మీద అభిలాష. ఆ కళాభిమానమే సి.ఎస్‌.ఆర్‌కు కలిసివచ్చిన అంశం. తండ్రికి అద్దంకి బదిలీ కావడంతో సి.ఎస్‌.ఆర్‌ విద్యాభ్యాసం ఆవూరిలోనే జరిగింది. ఐదవ తరగతిలోనే సుమతి శతకం, వేమన శతకం కంఠతా నేర్చుకున్నారు. పైగా ఆ పద్యాలను రాగం మేళవించి ఆలపిస్తుంటే ఉపాధ్యాయులు మెచ్చుకునేవారు. అప్పుడు వారి పాఠశాలకు టి.వి.సుబ్బారావు ప్రధాన ఉపాధ్యాయునిగా వుండేవారు. సి.ఎస్‌.ఆర్‌లోని ప్రతిభను గుర్తించి ఒక మంచి నాటకం వేయించాలనుకున్నారు. ఆ హెడ్మాస్టర్‌కు షేక్‌ స్పియర్‌ నాటకాలంటే తగని అభిమానం. ‘మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌’ నాటకంలో సి.ఎస్‌.ఆర్‌ చేత షైలాక్‌ పాత్రను పోషింపజేయాలని ఆశించారు. అప్పుడు సి.ఎస్‌.ఆర్‌ ఆరవ తరగతిలో వున్నారు. వయసు కేవలం 11 ఏళ్లు మాత్రమే. ఆ హెడ్మాస్టారు సి.ఎస్‌.ఆర్‌కు ఇంగ్లీషు నేర్పి, ఆ నాటకంలో ఉన్న ప్రాచీన ఇంగ్లీషు పదాలను ఎలా ఉచ్చరించాలో తర్ఫీదు ఇచ్చారు. హైస్కూలు ఇనస్పెక్షన్‌ జరిగే సమయంలో, స్కూల్స్‌ ఇనస్పెక్టర్‌ వారి సమక్షంలో సి.ఎస్‌.ఆర్‌ చేత షైలాక్‌ పాత్రను నటింపజేశారు. అధికారి మన్ననలే కాక, ఉపాధ్యాయులు, సహచర విద్యార్దుల నుంచి కూడా సి.ఎస్‌.ఆర్‌కు అభినందనలు దక్కాయి. అలా నటనమీద సి.ఎస్‌.ఆర్‌కి ఆసక్తి పెంచింది ఆ హెడ్మాస్టారురే. 1919లో తండ్రికి ఒంగోలు బదిలీ కావడంతో సి.ఎస్‌.ఆర్‌ చదువుసంధ్యలు అక్కడే కొనసాగాయి. ఆ పట్టణంలో మూడు నాటక సమాజాలు ఉండేవి. హిందూ నాటక సమాజం, కృష్ణ విలాస సభ, శృంగార విలాస సభ పేర్లతో ఆ సమాజాలు తరచూ నాటక ప్రదర్శనలు ఇస్తుండేవి. సి.ఎస్‌.ఆర్‌ చక్కగా పాటలు పాడేవారు. తన తోటి మిత్రులతో కలిసి ‘బొబ్బిలి యుద్ధం’ నాటకం ప్రదర్శిస్తే సి.ఎస్‌.ఆర్‌ అందులో మంచన బుచ్చన్న పాత్ర పోషించారు. దాంతో సి.ఎస్‌.ఆర్‌ నాటక సమాజాల దృష్టిని ఆకర్షించారు. ఆయా సంఘాలు ప్రదర్శించే నాటకాల్లో సి.ఎస్‌.ఆర్‌ చేత నారద, కృష్ణ పాత్రలు పోషింపజేశారు. సాంఘిక నాటకం ‘వరవిక్రయం’లో సి.ఎస్‌.ఆర్‌ లింగరాజు పాత్ర ధరించేవారు. అప్పుడు సి.ఎస్‌.ఆర్‌ వయసు కేవలం పదిహేనేళ్లు మాత్రమే. అప్పుడే సి.ఎస్‌.ఆర్‌ పేరు ప్రముఖ నటులు స్థానం నరసింహారావు దృష్టిని ఆకర్షించింది. స్కూలు ఫైనలు పరీక్షా సమయంలో కూడా ఒక నాటకంలో తప్పనిసరి వేషం వేయాల్సి వచ్చింది. అయినా సరే అటు నాటకం వేస్తూ, పరీక్ష ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఒంగోలులో ఇంటర్మీడియట్‌ చదువుతుండగా, తండ్రికి పొన్నూరు బదిలీ అయింది. తండ్రికి చదివించే స్థోమత లేకపోవడంతో సి.ఎస్‌.ఆర్‌ చదువుకు స్వస్తి పలికారు. ఉద్యోగార్ధం బెజవాడ (ఇప్పుడు విజయవాడ)లో కోఆపరేటివ్‌ ఇనస్పెక్టర్‌ శిక్షణ తీసుకున్నారు. ఆ శిక్షణ సంస్థ ప్రిన్సిపాలు సి.ఎస్‌.ఆర్‌ చేత ఒక నాటకం వేయించారు. దానికి అందరి ప్రశంసలు లభించాయి. రాజమండ్రిలో ‘రామదాసు’ నాటక ప్రదర్శనకు యడవల్లి సూర్యనారాయణ చేరుకోలేకపోవడంతో సి.ఎస్‌.ఆర్‌కు కబురొచ్చింది... వెంటనే రాజమండ్రి రమ్మని. సి.ఎస్‌.ఆర్‌ రాజమండ్రి వెళ్లి రామదాసు నాటకంలో ప్రధానమైన రామదాసు పాత్రను పోషించారు. అలా సి.ఎస్‌.ఆర్‌ పేరు మూడు జిల్లాలకు పాకింది. 1927లో చల్లపల్లి రాజా పట్టాభిషేకం జరిగినప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ‘రామదాసు’ నాటకం ప్రదర్శిస్తే సి.ఎస్‌.ఆర్‌ అందులో రామదాసుగా నటించారు. దాంతో బెజవాడలోని రామాగ్రాఫ్‌ గ్రామఫోన్‌ రికార్డింగ్‌ కంపెనీ వారు సి.ఎస్‌.ఆర్, స్థానం నరసింహారావు కాంబినేషన్‌లో రామదాసు పద్యాలు, పాటల్ని రికార్డు చేశారు. ఆ రికార్డులు వేలాదిగా అమ్ముడుపోయాయి. తరువాత నుంచి సి.ఎస్‌.ఆర్‌-స్థానం నరసింహారావులు కలిసి అనేక నాటకాలు ప్రదర్శించారు. సి.ఎస్‌.ఆర్‌ రూపొందించిన ‘తుకారాం’ నాటకానికి మంచి పేరు వచ్చింది.
★సింహద్వారం గుండా సినిమాలలోకి ప్రవేశం...
టాకీ సినిమాలు వచ్చిన కొత్తల్లో తెలుగు సినిమాల నిర్మాణం క్రమంగా ఊపందుకుంటున్నది. తొలిరోజుల్లో పౌరాణిక సినిమాలనే ఎక్కువగా నిర్మించేవారు. నాటకాలలో నటించిన పాత్రలనే రంగస్థల నటులు సినిమాలలో కూడా పోషించేవారు. నాటక స్క్రిప్టులనే యధాతధంగా ఉపయోగించి అందులోని పాటలు, పద్యాలను నటీనటులే పాడేవారు. అప్పటికే సి.ఎస్‌.ఆర్‌ రంగస్థల కృష్ణుడుగా పేరు సంపాదించారు. 1936లో బెజవాడ సరస్వతి టాకీస్‌ అధిపతులు కురుకూరి సుబ్బారావు, పారుపల్లి వెంకట శేషయ్య ‘ద్రౌపది వస్తాప్రహరణము’ అనే మల్లాది అత్యుతరామశాస్త్రి పౌరాణిక నాటకాన్ని కొల్హాపూర్‌ సినీటోన్‌ కంపెనీలో సినిమాగా నిర్మించారు. బ్రిటీష్‌ ఎకోస్టిక్‌ ఫోటోఫోను యంత్రం మీద సినిమా చిత్రీకరణ జరిగింది. హెచ్‌.వి.బాబు దర్శకత్వం వహించగా హెచ్‌.ఎం.రెడ్డి నిర్మాణ పర్యవేక్షణగావించారు. పసుమర్తి యజ్ఞనారాయణశాస్త్రి పాటలు, పద్యాలు రూపొందించగా జి.మాధవ టాంబే సంగీత పర్యవేక్షణ చేశారు. ఇందులో శ్రీకృష్ణుడుగా సి.ఎస్‌.ఆర్, ద్రౌపదిగా కన్నాంబ నటించారు. చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్‌ (ధర్మరాజు), దొమ్మేటి సూర్యనారాయణ (భీముడు), దొమ్మేటి సత్యనారాయణ (అర్జునుడు), యడవల్లి సూర్యనారాయణ (దుర్యోధనుడు), నెల్లూరి నగరాజరావు (శకుని), కడారు నాగభూషణం (అశ్వథ్థామ), ఆరణి సత్యనారాయణ (విదురుడు) పి.సూరిబాబు (నారదుడు), రామతిలకం (సత్యభామ), నగరాజకుమారి (రుక్మిణి) ఇతర పాత్రలు పోషించారు. అదే సమయంలో లక్ష్మి ఫిలిమ్స్‌ సంస్థ ‘ద్రౌపది మాన సంరక్షణము’ పేరుతో ఎం.జగన్నాథస్వామి దర్శకత్వంలో పోటీగా సినిమా నిర్మించింది. దైతా గోపాలం చిత్ర రచన చేయగా బొంబాయి ఫిలిం సిటీ స్టూడియోలో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో బళ్ళారి రాఘవ దుర్యోధనుడుగా, బందా కనకలింగేశ్వరరావు శ్రీకృష్ణుడుగా, సురభి కమలాబాయి ద్రౌపదిగా నటించగా, ఇతర పాత్రలను బి.చలపతిరావు (అర్జునుడు), పారుపల్లి సుబ్బారావు (ధర్మరాజు), ఎ.వి.సుబ్బారావు (భీముడు), దైతా గోపాలం (విదురుడు), రంగస్వామి అయ్యంగార్‌ (శకుని), మాధవపెద్ది వెంకట్రామయ్య (శిశుపాలుడు), లీలాబాయి (సత్యభామ), శ్రీహరి (రుక్మిణి) పోషించారు. ‘ద్రౌపది వస్తాప్రహరణము’ చిత్రం ఫిబ్రవరి 29న విడుదల కాగా, ‘ద్రౌపది మానసంరక్షణం’ చిత్రం మార్చి 24న విడుదలైంది. టాకీలు రావడం కొత్త కావడంతో రెండు చిత్రాలూ బాగానే ఆడాయి. జయా ఫిలిమ్స్‌ వారు 1938లో ‘తుకారాం’ చిత్రాన్ని కోయంబత్తూరు సెంట్రల్‌ స్టూడియోలో నిర్మించారు. అందులో తుకారాం పాత్రను సి.ఎస్‌.ఆర్‌ పోషించారు. ఆ పాత్ర పోషించిన సి.ఎస్‌.ఆర్‌కు మంచి పేరొచ్చింది.
★హీరోగా సి.ఎస్‌.ఆర్‌ జైత్రయాత్ర...
పుల్లగూర శేషయ్య అధ్వర్యంలో శ్రీశారదా రాయలసీమ ఫిలిమ్స్, కడప వారు 1939లో ‘జయప్రద’ సినిమా నిర్మించారు. అందులో పురూరవుడుగా సి.ఎస్‌.ఆర్‌ నటించగా సీనియర్‌ శ్రీరంజని జయప్రదగా నటించింది. సాలూరు రాజేశ్వరరావు ఈ చిత్రంతోనే సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అదే సంవత్సరం ఫేమస్‌ ఫిలిమ్స్‌ వారు ‘తిరుపతి వేంకటేశ్వర మహాత్మ్యం’ (బాలాజి) సినిమా నిర్మించారు. పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనివాసుడుగా సి.ఎస్‌.ఆర్‌ నటించగా శాంతకుమారి పద్మావతిగా నటించింది. కవికోకిల దువ్వూరు రామిరెడ్డి, బుచ్చన్నశాస్తి రచనా సహకారం, ఆకుల నరసింహారావు సంగీత సహకారం అందించారు. దిగ్విజయంగా ఆడిన తొలి తెలుగు సినిమా ఇదే. రాజా శాండో దర్శకత్వం వహించిన ‘చూడామణి’ (1941) సాంఘిక చిత్రంలో సి.ఎస్‌.ఆర్‌ హీరోగా నటించగా పుష్పవల్లి హీరోయిన్‌గా నటించింది. దాంతో సి.ఎస్‌.ఆర్‌ సినిమా రంగంలో స్థిరపడ్డారు. అదే సంవత్సరం రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారి ‘తల్లిప్రేమ’ సాంఘిక చిత్రం విడుదలైంది. కడారు నాగభూషణం దర్శకత్వం వహించగా కన్నాంబ సి.ఎస్‌.ఆర్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఆ రోజుల్లో గొప్ప విజయాన్ని నమోదుచేసింది. రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారే నిర్మించిన ‘సుమతి’ చిత్రంలో కూడా సి.ఎస్‌.ఆర్‌ హీరో. 1945లో రాజేశ్వరి ఫిలిమ్స్‌ సంస్థ కడారు నాగభూషణం దర్శకత్వంలోనే ‘పాదుకా పట్టాభిషేకం’ సినిమా నిర్మించింది. శ్రీరాముడుగా సి.ఎస్‌.ఆర్‌ నటించగా, పుష్పవల్లి సీతగా నటించింది. కైకేయిగా కన్నాంబ, భరతుడుగా బందా కనకలింగేశ్వరరావు, దశరథుడుగా అద్దంకి శ్రీరామమూర్తి, లక్ష్మణుడుగా కొచ్చెర్లకోట సత్యనారాయణ నటించారు. అదే సంవత్సరం గూడవల్లి రామబ్రహ్మం అక్కినేనిని పరిచయం చేస్తూ నిర్మించిన సూపర్‌ హిట్‌ జానపద చిత్రం ‘మాయాలోకం’లో నవభోజరాజు అనే ఒక వెర్రిబాగుల రాకుమారుడు పాత్రను సి.ఎస్‌.ఆర్‌ పోషించారు. నిజానికి రామబ్రహ్మం సి.ఎస్‌.ఆర్‌ని హీరోగా నటించమని కోరారు. కానీ ఆ హీరో పాత్రకు కుర్రవాడైతే బాగుంటుందని సి.ఎస్‌.ఆర్‌ సలహా ఇచ్చారు. ‘హీరో వేషానికి మంచి యువకుడు దొరికితే సరేసరి. లేకుంటే ఆ పాత్రను మీరే వేయాల్సి వుంటుంది’ అని రామబ్రహ్మం సి.ఎస్‌.ఆర్‌తో అన్నారు. అలా తెలుగు వెండితెరకు అక్కినేని నాగేశ్వరరావును హీరోగా పరిచయం చేసే విషయంలో సి.ఎస్‌.ఆర్‌ కూడా ఒక చెయ్యి వేసినట్లయింది. సి.ఎస్‌.ఆర్‌కు వైవిధ్యం గలిగిన పాత్రలు కూడా అదే సంవత్సరం దొరికాయి.

★ క్యారక్టర్‌ నటుడుగా...
భరణీ సంస్థ నిర్మించిన ‘రత్నమాల’ (1947) సినిమాలో నటించేనాటికి సి.ఎస్‌.ఆర్‌కు నలభై ఏళ్లు నిండాయి. భరణీ రామకృష్ణరావు దర్శకత్వంలో నిర్మించిన ఈ జానపద చిత్రంలో భానుమతి మేనమామ ధూమకేతుగా సి.ఎస్‌.ఆర్‌ నటించి మెప్పించారు. 1950లో ఎ.వి.ఎం వారు మెయ్యప్పన్‌ దర్శకత్వంలో ‘జీవితం’ సాంఘిక చిత్రం నిర్మించారు. ఎస్‌.వరలక్ష్మి ఈ చిత్రంతోనే వెండితెర ప్రవేశం చేసింది. ఇందులో సి.ఎస్‌.ఆర్‌ శివశంకర లింగేశ్వరప్రసాద్‌ పాత్ర పోషించారు. హాస్యనటుడు కస్తూరి శివరావు ఎలైడ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను స్థాపించి స్వీయ దర్శకత్వంలో ‘పరమానందయ్య శిష్యులు చిత్రాన్ని నిర్మించారు. అందులో సి.ఎస్‌.ఆర్‌ పరమానందయ్యగా నటించి మెప్పించారు. ఈ చిత్రంలో అక్కినేని చంద్రసేన మహారాజుగా, లక్ష్మీరాజ్యం లీలావతిగా నటించారు. సి.ఎస్‌.ఆర్‌ శిష్యులుగా శివరావు, రేలంగి, నల్ల రామ్మూర్తి, ఇమామ్, రావులపల్లి, ఇమిటేషన్‌ ఆచారి నటించారు. సినిమా ఆశించినంత గొప్పగా ఆడలేదు. 1951లో రాజేశ్వరి ఫిలిం కంపెనీ వారు కడారు నాగభూషణం నిర్మాణ దర్శకత్వంలో ‘సౌదామిని’ చిత్రాన్ని నిర్మించారు. అందులో విక్రమసేన మహారాజుగా సి.ఎస్‌.ఆర్‌ నటించారు. మహారాణి సౌదామినిగా కన్నాంబ నటించింది. సినిమా విజయవంతమైంది.

1946లో సారథిఫిలిమ్స్‌ సంస్థ తమ నాలుగవ చిత్రంగా ‘గృహప్రవేశం’ చిత్రాన్ని నిర్మించింది. ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భానుమతి, ఎల్‌.వి.ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. ఇందులో సి.ఎస్‌.ఆర్‌ రమణారావు పాత్రలో హేమలతకు మేనల్లుడిగా నటించారు. సి.ఎస్‌.ఆర్‌ జూనియర్‌ శ్రీరంజనితో ప్రేమ నటిస్తూ, భానుమతిని వివాహం చేసుకోవాలని మోసానికి ఒడికడతాడు. ఇందులో భానుమతి-సి.ఎస్‌.ఆర్‌ మధ్య జరిగే వినోద సన్నివేశాలు సినిమాకు నిండుదనం చేకూర్చడమే కాకుండా సినిమా విజయానికి దోహదపడ్డాయి. ‘జానకి నాదేనోయ్, మదిలో కోరిక లీడేరాయ్‌ అక్కా తులశమ్మక్కా’ అనే పాటను రమణారావు పాత్రకోసం సి.ఎస్‌.ఆర్‌ చేత పాడించి నటింపజేశారు. ఆ పాట ప్రేక్షకుల్ని బాగా అలరించింది. హాస్యాన్ని మిళితంచేసిన విలనీతో నిండిన గిరీశం వంటి పాత్రను సి.ఎస్‌.ఆర్‌ అద్భుతంగా పండించారు.
★సీఎస్స్‌ఆర్‌ చెప్పి పండించిన డైలాగ్‌లు, 
జగదేకవీరుని కథలో "హే రాజన్‌ శృంగార వీరన్‌" అంటూ సీఎస్స్‌ఆర్‌ చెప్పిన డైలాగ్‌లు, రాజనాలతో కలిసి ఆయన పండించిన కామెడీ మరచిపోవడం సాధ్యం కాదు.. విజయావారి నవ్వుల హరివిల్లు అప్పుచేసి పప్పుకూడులో సీఎస్సార్‌ అప్పు అనే పదానికి కొత్త అర్థాన్ని నిర్వచించారు. "వెయ్యి రూపాయిలు కావాలంటే పది మంది దగ్గరా పది వందలు తీసుకోవడం కంటే ఒక్కరి దగ్గిరే అప్పుతీసుకో. వడ్డీ తీరిస్తే సరి. అసలు చెల్లించినప్పటి మాట కదా" అంటూ ఆయన చెప్పే డైలాగ్‌లు పడీపడీ నవ్విస్తాయి.

సీయస్సార్‌ నటజీవితంలో మరో మైలు రాయి మాయాబజార్‌ లోని శకుని పాత్ర. "ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది" వంటి డైలాగులు ఆయన నటనా ప్రతిభకు అద్ధంపడతాయి. కన్యాశుల్కం లో రామప్ప పంతులుగా, ఇల్లరికంలో మేనేజరు గా, జయం మనదేలో మతిమరుపు రాజుగా, కన్యాదానంలో పెళ్ళిళ్ల పేరయ్యగా,  వినోదా వారు నిర్మించిన ‘దేవదాసు’ (1953)లో దుర్గాపురం జమీందారుగా, సావిత్రికి వృద్ధ భర్తగా నటించి దేముడు ""నీకు మేలుచేస్తాడు పార్వతీ" అంటూ ఆ పాత్రకు వన్నె తెచ్చారు. 1954లో భరణీ సంస్థ ‘చక్రపాణి’ అనే సినిమా నిర్మించింది. అక్కినేని, భానుమతి ఇందులో హీరో హీరోయిన్లు. అయితే టైటిల్‌ రోల్‌ చక్రపాణిగా, పిసినిగొట్టు జమీందారుగా సి.ఎస్‌.ఆర్‌ నటించడం విశేషం. ‘లైలామజ్ను’, ‘జీవితం’ వంటి సినిమాలలో సి.ఎస్‌.ఆర్‌కు క్యారక్టర్‌ నటుడిగా పేరొచ్చింది. సి.ఎస్‌.ఆర్‌ మొత్తమ్మీద 175 సినిమాలలో వైవిధ్య పాత్రలు పోషించారు. సి.ఎస్‌.ఆర్‌కు ఇద్దరు సోదరులు. ‘సువర్ణసుందరి’, ‘గుణసుందరి కథ’, ‘మాయాబజార్‌’ వంటి సినిమాలకు సహాయ దర్శకులుగా పనిచేసిన సి.ఎస్‌.నాగేశ్వరరావు ఒక సోదరుడు కాగా, భరణీ పిక్చర్స్‌ సంస్థలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేసిన సి.వి.రత్నం మరో సోదరుడు. అటువంటి అసమాన ప్రతిభగల సి.ఎస్‌.ఆర్‌ 1963 అక్టోబరు 8న తన 56వ సంవత్సరంలో తనువు చాలించారు..వారికి ఈ సందర్భమున తెలుగునాటక రంగ వైభవం నివాళులు అర్పిస్తుంది...!!💐
               (సేకరణ-నూలు)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి