17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ పందిళ్ళ శేఖర్ బాబు

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
నేటి మన చిరస్మరణీయులు శ్రీ శేఖర్‌బాబు పందిళ్ళ...
నాటకం పై ఉన్న వారి తపన కు హర్షించాలి వేనోళ్ళ...

శ్రీ పందిళ్ళ శేఖర్ బాబు...  రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు, నిర్వాహకులు.
దేవాదాయ ధర్మదాయ శాఖలో ఉద్యోగి...
వీరు ఆగష్టు 15 , 1961వరంగల్ జిల్లా  ధర్మసాగర్ లో... జన్మించారు.. వీరితండ్రి:
రాజయ్యశాస్త్రి తల్లి:సుచేత
★రంగస్థల ప్రవేశం 
పందిళ్ళ శేఖర్‌బాబు తన 12వ ఏట 1973లో ఆత్మహత్య సాంఘిక నాటికలో సన్యాసి రాజు పాత్రతో రంగప్రవేశం చేసారు. తొలి ప్రయత్నంలోనే బహుమతుల (ద్వితీయ ఉత్తమ నాటిక, ఉత్తమ నటుడు) ను అందుకున్నారు. నాటక ప్రవేశం సాంఘిక నాటిక ద్వారా జరిగినా ఈయనకు పేరు తెచ్చినవి మాత్రం పౌరాణికాలు. 1997వ సంవత్సరం మార్చి 1న ఈయన పౌరాణిక నాటకరంగంలోకి అడుగుపెట్టారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో, శ్రీకృష్ణ పాత్రలో కన్పించి ప్రేక్షకుల్ని అలరించారు. రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైద్రాబాద్), మహాతి (తిరుపతి), హనుమంతరాయ గ్రంథాలయం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల కళావేదిక (విజయవాడ), శ్రీ వేంకటేశ్వర విజ్ఞానకేంద్రం (గుంటూరు) మొదలైన ప్రముఖ వేదికలపై, ఇతర ప్రాంతాల్లో దాదాపు 500 నాటక ప్రదర్శనల్లో నటించారు.

★ధరించిన పాత్రలు 
శ్రీకృష్ణరాయబారంలో శ్రీకృష్ణుడిగా, అర్జునుడిగా, దుర్యోధనుడిగా,
శ్రీకృష్ణతులాభారంలో శ్రీకృష్ణుడిగా, నారదుడిగా
శ్రీరామాంజనేయ యుద్ధంలో శ్రీరాముడిగా,
హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడిగా,
గయోపాఖ్యానంలో శ్రీకృష్ణుడిగా, అర్జునుడిగా, అక్రూరుడిగా, నారదుడిగా,
లవకుశలో రాముడిగా,
యయాతిలో యయాతిగా,
చింతామణిలో బిల్వమంగళుడిగా, భవానీ శంకరుడిగా,
బభ్రువాహనలో అర్జునుడిగా,
అన్నమయ్యగా నటించారు.
నిర్వాహకుడిగా సవరించు
1998లో తెలుగు పద్యాన్ని బ్రతికించండి- పద్యనాటక మనుగడకు సహకరించండి అనే నినాదంతో ‘తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్’ను స్థాపించారు. ఈ సంస్థ, ఒకవైపు ప్రసిద్ధమైన నాటకాలను ప్రదర్శిస్తూ, మరోకవైపు ఎంతో సమర్థవంతంగా నాటకపోటీలను నిర్వహిస్తూ వచ్చింది. రాష్ట్రంలోని ఎన్నో పట్టణాలలో ఎన్నో ప్రదర్శనల్ని దిగ్విజయంగా ప్రదర్శించి, ప్రేక్షకుల్ని పరవశింపజేసింది తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్. 2007వ సంవత్సరంలో తిరుపతి లో శ్రీవేంకటేశ్వరా నాట్య కళాపరిషత్ నిర్వహించిన నాటకోత్సవాలలో, శ్రీకృష్ణరాయబారం నాటకాన్ని ఎంతో ప్రతిభావంతంగా ప్రదర్శించి రెండు బంగారు గరుడ అవార్డుల్ని అందుకుంది. 2011లో శ్రీ కాళహస్తీశ్వర లలిత కళాపరిషత్ నుండి ‘యయాతి’ నాటకంతో ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ పాత్రోచిత నటి, ఉత్తమ రంగాలంకరణ విభాగాలలో అయిదు నటరాజ అవార్డుల్ని స్వీకరించింది. దీనికంతటికి ప్రధాన కారకుడు శేఖర్ బాబు అనడం అక్షరసత్యం. నటులకు ప్రోత్సాహాన్నిచ్చి, వివిధ పరిషత్తులతోపాటు, ప్రముఖ వేదికలపై నాటకాల నిర్వాహణ- దర్శకత్వ బాధ్యతల నిర్వాహణ గావించారు.
2008 నుండి ‘వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక’ అధ్యక్షునిగా, ప్రతి యేటా క్రమంతప్పకుండా నాటిక పోటీలను నిర్వహించారు. ‘రంగస్థల కళాకారుల క్రెడిట్ సొసైటీ’ని నిర్వహిస్తూ, తద్వారా వచ్చే లాభాలు, వడ్డీల నుండి 50 శాతం ‘ఐక్యవేదిక’కు కేటాయించి, సంస్థకు ఆర్థికంగా పరిపుష్టం గావిస్తున్నారు .
★న్యాయనిర్ణేతగా 
శేఖర్ బాబుగారి గుణనిర్ణయం ఎన్నదగినది, ఎంతగానో నిష్పాక్షికమైనది. రాగద్వేషాలకు తావీయకుండా, ప్రతిభకు పట్టంకట్టడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే రాష్ట్రంలోని ఎన్నో పరిషత్తులు నాటక పోటీలకు గుణనిర్ణేతగా ఆయయను ఆహ్వానించి గౌరవిస్తున్నాయి.

2008లో రాజమండ్రి లో జరిగిన నంది నాటకోత్సవాలకు పౌరాణిక నాటక విభాగంలో ప్రాథమిక న్యాయనిర్ణేతగా,
2009, 2011 సంవత్సరంలో అభినయ పరిషత్ వారు నిర్వహించే హనుమ అవార్డుల పోటీల పౌరాణిక నాటక విభాగంలో న్యాయనిర్ణేతగా,
2012లో రవీంద్రభారతిలో జరిగిన పి.ఎం.కె.ఎం. సాంఘీక నాటకపోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
★పొందిన బహుమతలు 
2007లో ‘శ్రీకృష్ణరాయబారం’ నాటకానికి ఉత్తమ నటుడు,, ఉత్తమ పద్యపఠనం విభాగాలలో రెండు గరుడ అవార్డులు (స్వీయ దర్శకత్వం)
2011లో ‘యయాతి’ నాటకానికి ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ పాత్రోచిత నటుడు విభాగాలలో మూడు గరుడ అవార్డులు (స్వీయ దర్శకత్వం)
2012లో యయాతి’ నాటకానికి ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీతం విభాగాలలో రెండు గరుడ అవార్డులు
‘బభ్రువాహన’ పద్య నాటికకు తృతీయ ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటి, ఉత్తమ పాత్రోచితనటి విభాగాలలో మూడు గరుడ అవార్డులు.
★బిరుదులు 
శేఖర్ బాబు నిర్విరామ కృషికి, దీక్షాదక్షతలను గుర్తించిన అనేక సంస్థలు ఆయనకు నటశేఖర, పౌరాణిక నట సౌర్వభౌమ, పౌరాణిక విద్వన్మణి, మెగా సిటిజన్, శ్రీపాద నాటక కళాపరిషత్ వారి పురస్కారం, పద్యనాటక కళాధురీణ వంటి బిరుదులనిచ్చి సత్కారం చేశాయి.

★నిర్వహించిన కర్యక్రమాలు 
2000 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీనుండి 11వ తేదీవరకు 7రోజులుపాటు వరుసగా ఒకే వేదికపై శ్రీకృష్ణరాయబారం, లవకుశ, సత్యహరిశ్చంద్ర, శ్రీకృష్ణతులాభారం, చింతామణి, గయోపాఖ్యానం, శ్రీరామాంజనేయ యుద్ధం నాటకాలను ‘పద్యనాటక సప్తాహం’ పేరిట, ఏడు రోజులు వరుసగా ప్రదర్శించి, ప్రధాన పాత్రలను ధరించారు. 2011లో మరలా ‘పద్యనాటక సప్తకం ’ నిర్వహించి స్వీయ దర్శకత్వంలో 7 నాటకాలను, వారానికొకటి చొప్పున ప్రదర్శించి, ప్రధాన పాత్రలు ధరించి, నిర్వాహణ వ్యయం 3 లక్షలు భరించారు.
2012లో తొలి తెలుగు సినీరచయిత, ‘పరబ్రహ్మ పరమేశ్వర’ ప్రార్థనా గీత రచయిత చందాల కేశవదాసు 136వ జయంతి ఉత్సవం తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం (హైద్రాబాద్) లో నిర్వహించారు.
2010లో అజో-విభో ఫౌండేషన్ వారు వరంగల్ లో నిర్వహించిన, ‘సాహితీమూర్తి పురస్కారం’ డా. నల్లాన్ చక్రవర్తుల రఘునాధచార్యులకు ప్రదానం చేసిన కార్యక్రమాన్ని కలిసి నిర్వహించారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న శేఖర్‌బాబు హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఏప్రిల్ 24, 2015 న రాత్రి 8 గం:లకు ఆ నటరాజులో ఐక్యం అయ్యారు.
★★★★★★★★★★★★★★
వీరు నేను అడ్మిన్ గా నిర్వహించే ఈ తెలుగు నాటక రంగ వైభవం (ఫేసుబుక్ గ్రూప్)లో  సభ్యులు గా వుండేవారు... ఇదే గ్రూప్ లో    దివంగత నటుల జీవిత విశేషాలను"చిరస్మరణీయులు" అనే శీర్షికలో నేను వీరిని గూర్చి ప్రస్తావించవలసి వచ్చినందులకు విచారిస్తూ వీరికి నా నివాళులు అర్పిస్తున్నాను.👏💐
★★★★★★★★★★★★★★

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి