17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ అబ్బూరి కమలా ేవి

★★★★★★★★★★★★★★★★★★ 
    💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★★★★ 
అది 1950 దశకం... ఆంధ్రదేశంలో ఒక పట్టణము...అక్కడ విజయదశమి సందర్భమున దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి...
ఆరోజు నవరాత్రి పందిరిలో జరిగే సాంసృతికకార్యక్రమానికి చుట్టూ ప్రక్కల ఉన్న పల్లెటూళ్ల నుండి ఎడ్ల బండ్లమీద...
కాలినడకన తోనూ విపరీతంగా జనం వచ్చారు...కారణం...!!??
ఆ రోజు  పందిరిలో కాళ్లకూరి వారి "చింతామణి" నాటకప్రదర్శన ఉన్నది.

పైగా  చింతామణి గా స్త్రీ పాత్రలకు పేరుగాంచిన మహానటుడు బుర్రా వారు నటిస్తున్నారు...
అంతకుమించి ఆయనతో బిల్వమంగలుని గా ఒక స్త్రీ నటించబోతోంది...ఆమె ఎవరో ...పురుషులు స్త్రీ పాత్రలు ధరించి పేరుగాంచుచున్న రోజుల్లో...
ఒక స్త్రీ అయివుండి పురుష పాత్రలను పోషించి మెప్పిస్తోంది... !!
 అంతకుముందు..పీసపాటి కృష్ణుడిపాత్ర వేయగా, తాను  దుర్యోధనుడిగా...
 మాధవపెద్ది వెంకటరామయ్యగారు
దుర్యోధన పాత్ర వేయగా  ,వారితో  శ్రీకృష్ణ పాత్రలో నటించి, పేరు గాంచిన కమలాకరరావు...!!
అదే నండీ కమలాదేవి....!!
ముద్దుగా,సరదాగా అప్పటి సహాచర నటులు అలా పిలుచుకునే
 అబ్బూరి కమలాదేవి...!!
ఆమే నేటి మన చిరస్మరణీయురాలు... 
 
శ్రీ అబ్బూరి కమలాదేవి ప్రఖ్యాత రంగస్థల  ప్రసిద్ధ నటి. సమాజ నిర్వాకురాలు..
 ఈమె శ్రీకృష్ణ, హరిశ్చంద్ర, దుర్యోధన...బిల్వమంగలుడు..కార్యవర్ధిరాజు... వంటి పురుషపాత్రలను నటించడంద్వారా ప్రసిద్ధి చెందింది.
★ఆరంభ జీవితం★
ఈమె 1925, నవంబరు 2వ తేదీన కృష్ణా జిల్లా, పెడన గ్రామంలో తోట వెంకయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించింది. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఈమెకు ఐదుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెళ్లెల్లు. ఈమె బాల్యం చాలా గారాబంగా సాగింది. ఈమె తండ్రి భజనగీతాలను ఆలాపించేవాడు. ఈమె తన తండ్రితో పాటుగా గొంతు కలుపుతూ ఉండేది. ఈమె అన్నయ్య సుబ్రహ్మణ్యం డి.వి.సుబ్బారావు కంపెనీ నాటకాలలో వివిధ పాత్రలను పోషిస్తుండేవాడు. ఈమె అన్నయ్యతో పాటు రిహార్సల్స్‌కు వెళుతుండేది. అలా రిహార్సల్స్‌ను దగ్గరగా చూసిన కమలాదేవికి అప్రయత్నంగానే నాటకాలు ఒంటబట్టాయి. అయితే ఆనాటి సాంఘిక పరిస్థితుల కారణంగా ఈమె ఇంట్లోని పెద్దలు ఈమె రంగస్థలంపై నటించడానికి అంగీకరించలేదు. స్వతంత్ర భావాలు కలిగిన కమలాదేవికి పెద్దల ధోరణి నచ్చలేదు. ఈమె ఇల్లు వదిలి గుడివాడలో కుటుంబస్నేహితుల ఇంటిలో తలదాచుకుంది. అక్కడ మల్లికార్జునరావు వద్ద పద్యాలు పాడే విధానాన్ని నేర్చుకుంది. మొదటి సారిగా ఈమె తులసీదాసు నాటకంలో మమత పాత్రను, కృష్ణలీలలు నాటకంలో దేవకి పాత్రలను పోషించి చక్కని రూపం, కమ్మని గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాటకం కోసం రేయింబవళ్లు కష్టపడటం, ఊరూరు తిరగటం వల్ల ఈమె అనారోగ్యం పాలయ్యింది. అయినా ఈమెను ఇంటికి తీసుకువెళ్లడానికి ఆనాటి కుల కట్టుబాట్ల కారణంగా ఈమె కుటుంబ సభ్యులు ముందుకురాలేదు. ఆరోగ్యం కుదురు పడ్డాక ఈమె ఏలూరుకు వెళ్లి అక్కడ స్థిరపడింది.

★నాటక ప్రస్థానం★
ఏలూరుకు వచ్చాక ఈమె నటజీవితం మలుపు తిరిగింది. అద్దంకి శ్రీరామమూర్తి, బందా కనకలింగేశ్వరరావు, చింతలపూడి సత్యంవంటి రంగస్థల ప్రముఖులతో కలిసి నటించే అవకాశం వచ్చింది. హార్మోనిస్టు సాతాని రంగయ్య వద్ద సంగీతం నేర్చుకుంది. 'ద్రౌపదీ వస్త్రాపహరణం' నాటకంలో ద్రౌపది, చింతామణి, రాధ పాత్రలు నేర్చుకుని అభినయించడం మొదలు పెట్టింది. 

'శ్రీకృష్ణ తులాభారం' నాటకంలో శ్రీకృష్ణుని పాత్రపోషణతో ఈమె తొలిసారి మగవేషం ధరించిన మహిళానటిగా చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రక ఘటన ఏలూరు పక్కనే ఉన్న దెందులూరులో జరిగింది. మగవారు స్త్రీ పాత్రలు పోషిస్తున్న ఆరోజులలో మహిళ అయివుండి పురుషపాత్రలను ధరించడంతో ఆమె పేరు ఊరూరా పాకింది. ఈమె ఖ్యాతి సాంస్కృతిక రాజధాని తెనాలికి చేరింది. వెంటనే తెనాలిలో ఉన్న ప్రముఖ నాటక నిర్వాహకుడు అబ్బూరి నాగేశ్వరరావు ఏలూరు వచ్చి ఈమెతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. దానితో ఈమె కళాయాత్రలో తెనాలి మరోమజిలీ అయ్యింది. తెనాలిలో నందుల ఆంజనేయులు పర్యవేక్షణలో పద్యాలాపన శిక్షణ పొందింది.

ఈమె అబ్బూరి వరప్రసాదరావు, పీసపాటి, మల్లాది, పువ్వుల సూరిబాబు, మాధవపెద్ది వెంకటరామయ్య, షణ్ముఖి ఆంజనేయ రాజు, అద్దంకి శ్రీరామమూర్తి, ఆచంట వెంకటరత్నం నాయుడు,కళ్యాణం రఘురామయ్య, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలైన ప్రముఖులతో కలిసి నటించింది. కురుక్షేత్రం నాటకంలో కళ్యాణం రఘురామయ్య ఒకటవ కృష్ణుడుగా నటిస్తే ఈమె రెండవకృష్ణుడిగా నటించింది. మాధవపెద్ది వెంకట్రామయ్య దుర్యోధనుడి పాత్రలో నటిస్తే ఈమె కృష్ణుడుగా నటించింది. బాలనాగమ్మ నాటకాలలో పీసపాటి సత్యవతి బాలనాగమ్మగా వేషం కడితే ఈమె కార్యవర్ధిగా వేషం ధరించేది. చింతామణి నాటకంలో బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి చింతామణిగా నటిస్తే ఈమె బిల్వమంగళుడిగా నటించింది. హరిశ్చంద్ర నాటకంలో టైటిల్ పాత్రను ఈమె ధరించగా చంద్రముఖి పాత్రను బుర్రా వేసేవాడు. ఈమె పురుషపాత్రలను చూసి మెచ్చిన అద్దంకి శ్రీరామమూర్తి, సూరిబాబు తదితరులు ఈమెను సరదాగా కమలాకర్‌ రావు అని సంబోధించేవారు. ఈమె నాటకాలు ప్రదర్శించే సమయంలో బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఈమెను వేషంలో చూసి ఆడ, మగ తేల్చుకోలేక పందాలు కాసేవారు.

ఈమె 1952లో "కమలా నేషనల్ నాట్యమండలి" స్థాపించి ఏ ఆధారంలేని బాలబాలికలని, స్త్రీలని చేరదీసి, వారికి నటనలో శిక్షణ ఇచ్చి వారి చేత ప్రదర్శనలు కూడా ఇప్పించింది

★కుటుంబం ★
ఈమె అబ్బూరి నాగేశ్వరరావును కులాంతర వివాహం చేసుకుని అబ్బూరి కమలాదేవిగా మారింది. ఈమె అత్తింటి వారు అభ్యుదయ భావాలు కలిగినవారు. ఈమె తన భర్త తరఫు బంధువుల నుండి ఏనాడూ ఎటువంటి కులవివక్షకు గురికాలేదని స్వయంగా చెప్పుకుంది
★సినిమారంగం★
ఈమె కొల్లేటి కాపురం, భూమికోసం, ఈ చదువులు మాకొద్దు, తరం మారింది, పల్నాటి యుద్ధం తదితర తెలుగు సినిమాలలోను, ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించిన కల్పన అనే హిందీ చిత్రంలోను నటించింది.

★పురస్కారాలు★
రంగస్థలాన్ని మెరిపించిన ఈ మహానటికి ప్రజలు, సాంస్కృతిక సంస్థలు బ్రహ్మరథం పట్టాయి. కళాప్రవీణ", "అభినయ సామ్రాజ్ఞి" అనే బిరుదులు ఈమెకు లభించాయి.

ఈమెకు పాలకోడేరు, విజయవాడలలో కనకాభిషేకం జరిగింది. 

ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి చేతుల మీదుగా సువర్ణ ఘంటా కంకణం స్వీకరించింది. 

1998లో ఆంధ్రపదేశ్ ప్రభుత్వంచే ఎన్‌.టి.ఆర్.పురస్కారం లభించింది. 
(సేకరణ-నూలు) 

    💐💐💐💐💐💐💐💐💐💐💐
     ఆమెకు ఇవే మా   నివాళులు...!!
💐💐💐💐💐💐💐💐💐💐💐

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి