17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ షణ్ముఖి ఆంజనేయరాజు

★★★★★★★★★★★★★★★ 
💥 #తెలుగునాటకరంగ #వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
నేటి మన చిరస్మరణీయులు ప్రముఖ రంగస్థల నటులు #శ్రీషణ్ముఖి #ఆంజనేయరాజు గారు...
గాయకులు..నటులు..ప్రయోక్త...

సంగీతం మానవులనేగాక,
శిశువుల్ని‌,పాముల్నీ,పక్షుల్నీ సైతం 
ఆనంద సాగరంలోముంచగల శక్తి 
సంగీతానికి కలదని నిర్వచించారు.
కళ లన్నింటిలో  సంగీతానికే 
అగ్రస్థానాన్ని ఇచ్చారు.

అందువల్లే కొందరు మహనీయులు 
సంగీత రసాస్వాదనలో ఓలలాడి జీవితాలను 
సార్థకం చేసుకున్నారు. మరికొంతమంది 
సంగీత కళోపాసననే
యోగ సాధనంగా పరిగ్రహించి ఉత్తమ సంస్కార
విశిష్టులై తమ జీవితాలను పునీతం చేసుకున్నారు.

అలా గత తరంలో  'ఆంధ్ర బాల గంధర్వ గాన' 
ప్రఖ్యాతివహించి,ప్రేక్షకులను ఉర్రూతలూగించి,
ఆంధ్ర దేశమంతటా ఘన సన్మానాలందుకొని 
'గాయక నటరత్న' గా వెలుగొందిన 
షణ్ముఖి ఆంజనేయ రాజు గారు,
1928 డిశంబరు 1వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని, రామచంద్రపురం తాలూకా
అనపర్తి లో జన్మించారు. 
తరువాత గుంటూరు జిల్లాలో
తెనాలి తాలూకా మోదుకూరు గ్రామంలో 
స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

ప్రాథమిక విద్యాభ్యాసం గడచిన తరువాత ఆయన అత్యంత అభిమానంతో నేర్చుకున్న విద్య శాస్త్రీయ సంగీతమే.సంగీతం నేర్చుకున్న తర్వాత వీరు 
1946లో నాటకరంగంలో ప్రవేశించి మహాశివభట్ట వెంకటరాజు గారి పర్యవేక్షణలో 
నటుడుగా తీర్చిదిద్దబడ్డారు.

పాండవోద్యోగం, గయోపాఖ్యానం, సతీ సక్కుబాయి నాటకాలలో శ్రీకృష్ణ పాత్రను, రామాంజనేయ యుద్ధం, పాదుకా పట్టాభిషేకంలో రాముని పాత్రను, తులాభారం, కృష్ణలీల, మైరావణలో నారద పాత్రను, హరిశ్చంద్రలో హరిశ్చంద్ర, నక్షత్రక పాత్రలను, రామదాసులో కబీరు, చింతామణిలో బిల్వమంగళుడు, భవానీశంకరుడు పాత్రలను, బొబ్బిలిలో విజయరామరాజు పాత్రను, తెలుగుతల్లిలో నాగేశ్వరరావు, మొదలైన పాత్రలను 
తన గానమాధుర్యంతో,గానసుధారసంతో వీనులవిందుచేస్తూ అభినయించి ప్రేక్షకుల నోలలాడించి గాయక నటుడుగా, 
గాయకరత్నగా వేనోళ్ళ కొనియాడబడినారు.

షణ్ముఖి ఆంజనేయరాజు తన నట జీవితంలో మహోన్నత వైభవం అనదగ్గ స్థాయిని చవిచూశారు. ఇప్పటి సినీనటుల్లా ఓ మెటాడోర్ వ్యాన్, దానిలో పరుపులు, అసిస్టెంట్లు వగైరా సౌకర్యాలను సమకూర్చుకొని, ఒకరోజు రాత్రి ఒక ఊళ్ళో 
ఒకటో కృష్ణుడిగా నటించి మరో ఊళ్ళో 
రెండో కృష్ణునిగా నటించేవారు.

షణ్ముఖి ఆంజనేయరాజుగారికి పేరు తెచ్చిపెట్టిన పాత్రల్లో రామాంజనేయ యుద్ధం నాటకంలో రాముని పాత్ర కూడా ఒకటి. మరీ ముఖ్యంగా, రాముడి పాత్రలో షణ్ముఖి, హనుమంతుని పాత్రలో సంపత్‌నగర్ లక్ష్మణరావుల కాంబినేషన్ చాలా ప్రాచుర్యం పొందింది. వ్యక్తిగత స్పర్థ కొంతవరకూ ఉన్న వీరిద్దరూ నాటకంలో ఒకరినొకరు ఎత్తిపొడుచుకునే పద్యాలు పాడుతూండడం ఈ జోడీకి మరీ లాభించింది

కేవలం నటుడుగా, గాయకుడు గానే కాక,
ఆంధ్రకేసరిప్రకాశం పంతులు గారి ప్రోత్సాహంతో గాంధీజీ జీవితాన్ని బు‍ర్రకథగా 
కడు రమ్యంగా చెప్పారు.

వీరు 1948లో బాలా త్రిపురసుందరీ నాట్యమండలిని స్థాపించి ఎన్నో నాటకాలను ప్రదర్శించారు. 
వీరు నాటక దర్శకుడిగా నందనార్, రేవతి, తెలుగుతల్లి, హరిశ్చంద్ర, గయోపాఖ్యానం, సుభద్రార్జున, శ్రీకృష్ణాభిమన్య యుద్ధం మొదలైన నాటకాలకు ప్రాణం పోసి అనేక మంది నటీనటులకు శిక్షణ ఇచ్చారు. వీరు హార్మోనియం, వాయులీనంలలో ప్రవీణులు.

ఏలూరు తెలుగు దర్భారులో కూరెళ్ల లక్ష్మణ్రావుగారి ప్రోత్సాహంతో కనకాభిషేకం.కాకినాడలో 
పైడా లక్ష్మయ్య జమీందారు గారి అధ్యక్షతన కనకాభిషేకం జరిగింది. అలాగే విజయవాడలో, తాడేపల్లిగూడెం గూడెం తాలూకా అడవికొలను గ్రామంలో,శ్రీకాకుళంలో,నరసరావుపేటలో,రాజమండ్రిలో, వంగలపూడిలో,నందికొట్కూరు లో 
ఇలా మరెన్నోచోట్ల ఆయన స్వర్ణకంకణ 
ఘన సన్మానాలందుకొన్నారు.

రామాంజనేయ యుద్ధం, పాండవోద్యోగ విజయం, మైరావణ మొదలైన నాటకాలను గ్రామఫోను
రికార్డులుగా ఇచ్చారు. ఆకాశవాణి కళాకారుడిగా
ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాంగల్య విజయం 
చిత్రంలో శ్రీరాముని పాత్ర ధరించారు.

తన శ్రావ్యమైన కంఠంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని
చేసిన వీరు 1997 ఫిబ్రవరి 18న పాలంగి గ్రామంలో నటరాజులో ఐక్యమయ్యారు

  ◆ ఉపయుక్త గ్రంథం:
    'కళాప్రపూర్ణ' డా౹౹ మిక్కిలినేని
    రాధాకృష్ణమూర్తి గారి
   'నటరత్నాలు'
★(వి.ఎస్.రాఘవాచారిగారి కళాదీపిక సౌజన్యంతో...)★

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి