31, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ దైతా గోపాలం

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
ఈనాటి  మన చిరస్మరణీయులు *శ్రీ దైతా గోపాలం* 
రంగస్థల, సినీ నటులు, రచయిత..
వీరు కృష్ణా జిల్లా..శ్రీకాకుళం గ్రామం శివార్ల లో ఉన్న పాపనాశనం లో 1900 వ సం:లోజన్మించారు

తెలుగు నాటకరంగం, మరచిపోలేని మేటి కళాకారుడు. ఈయన అనేక నాటకాలు ఆడారు. అచ్యుత రామశాస్త్రి రచించిన 'సక్కుబాయి' నాటకాన్ని దైతా గోపాలం తన సొంత పాటలతో దర్శకత్వంతో నడిపించారు. సుప్రసిద్ధ చిత్రసంగీత 

దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుకు సక్కుబాయి పాత్రను నేర్పి చాలాసార్లు ప్రదర్శించారు. 
మైలవరం కంపెనీ లూ పూర్తి నాటక సభ్యులు గా వున్నారు. నాటకాల్లోనేకాక సినిమా రచయితగా కూడా పేరుగాంచారు. శ్రీరాజరాజేశ్వరీ ఫిలింకంపెనీ అధినేత కడారు నాగభూషణం ఆదరణతో వారి చిత్రాలు సతీసుమతి (1941) సతీ సక్కుబాయి (1954) శ్రీకృష్ణ తులాభారం (1955) మొదలగు చిత్రాలకు రచయితగా పనిచేశారు. 'సతీసుమతి'లో ఆయన వ్రాసిన నిన్న సాయంత్రమున అనేపాట ఎంతోపేరు తెచ్చిపెట్టింది. ఈయన 'వరవిక్రయం' చలన చిత్రంలో కూడా నటించారు. ఘంటసాల, అక్కినేని వీరిని తరచూ కలుస్తూ ఈయన సలహాలను గైకొనేవారు. 1958లో నిర్మించిన శ్రీరామాంజనేయ యుద్ధం ఇతడు పాటలు సమకూర్చిన చివరి చిత్రం

దైతా గోపాలం రంగస్థలం బయట కూడా చాలా సౌమ్యంగా, సాధువులాగా ఉండేవారు. ఆయన సాధువు పాత్రలు వేయటంలో బాగా రాణించారు. విదురుడు, అక్రూరుడు ఈయనకు బాగా నచ్చిన పాత్రలు. సక్కుబాయి నాటకంలో శివయోగి పాత్రను కూడా ఈయన చిరస్మరణీయం చేశాడు.
వీరు 1958 లో దివంగతులయ్యారు.
★★★★★★★★★★★★★
💐వీరికివే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★★★

29, అక్టోబర్ 2020, గురువారం

శ్రీకిలాంబి కృష్ణమాచార్యులు

★★★★★★★★★★
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
ఈనాటి మన చిరస్మరణీయులు...
శ్రీ కిళాంబి కృష్ణమాచార్యులు 
రంగస్థల నటులు, దర్శకులు , నాట్యాచార్యలు
★జననం 
శ్రీ కృష్ణమాచార్యులు 1900, మే 5న ధర్మాచార్యులు...చూడమాంబ దంపతులకు జన్మించారు.

★నాటకరంగ ప్రస్థానం...
పండితుల కుటుంబం కనుక కృష్ణమాచార్యులుకు సంగీత సాహిత్యాలు వంశపారంపర్యంగా వచ్చాయి. చిన్నతనంలోనే ఆరాధనోత్సవాలలో పాటలు పాడుతూ సంగీతాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. అంతేకాకుండా, నాటక లక్షణ గ్రంథాలు చదివి నాటకకళలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే కాకినాడకు వెళ్లి, వెదురుమూడి శేషగిరిరావు, ముప్పిడి జగ్గరాజు, ఆలమూరు పట్టాభిరామయ్య మొదలైన మహానటులతో కలిసి నటించడమేకాకుండా, అనకాపల్లి లోని లలితా సమాజం ప్రదర్శించిన ప్రదర్శనలలో నటించారు. 1917లో లలితా సమాజానికి కొంతకాలం ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. నటులకు శిక్షణ ఇవ్వడంలో తగిన ప్రతిభ కలవారు. ఈయన శిక్షణలో రూపొందిన నటులు నాటక, సినీరంగాలలో రాణించారు. ఈయన నాటక కృషిని గుర్తించి ఆంధ్ర నాటక కళా పరిషత్తు 1950లో ఘనంగా సన్మానించింది.

★దర్శకత్వం చేసినవి ...
అనార్కలి
చాణక్య
ఆంధ్రశ్రీ
వేనరాజు
కురుక్షేత్రం
★నటించిన పాత్రలు...
శ్రీరాముడు
శ్రీకృష్ణుడు
కంసుడు
రుక్మాంగదుడు
విశ్వామిత్రుడు
ధర్మరాజు
భవానీ శంకరుడు
బిల్వమంగళుడు
>లింగరాజు
శర్మ (మధుసేవ)
అక్బర్
భరతుడు
దుర్యోధనుడు<,>అర్జునుడు
1957లో కృష్ణమాచార్యులుకు చక్కెర వ్యాధి రావడంతో కుడికాలు తొలగించవలసివచ్చింది.  
వీరు1959, జూలై 27న శివ సాన్నిధ్యం పొందారు.
★★★★★★★★★★★
💐వీరికివే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★

28, అక్టోబర్ 2020, బుధవారం

బి.వి.రంగారావు

శ్రీ బి.వి. రంగారావు
 ప్రముఖ రంగస్థల నటులు, కళాప్రవీణ బిరుదాంకితులు.

శ్రీ రంగారావు 1920, సెప్టెంబర్ 24 న నరసింహారావు, సీతారావమ్మ దంపతులకు కృష్ణాజిల్లా, విజయవాడ సమీపంలోని తెన్నేరు లో జన్మించారు. 12 సంవత్సరాల వయసులో తల్లి మరణించడంతో మేనమామైన తెన్నేటి చలపతిరావు దగ్గర ఉండి ఎస్.ఎస్.సి. పూర్తిచేసి విజయవాడ మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగిగా చేరారు.

★రంగస్థల ప్రస్థానం
వెంట్రప్రగడ నారాయణరావు ప్రోత్సాహంతో మారుతీ సీతారామయ్య (హార్మోనిస్టు) దగ్గర శిక్షణ పొందారు. అనంతరం పాండవోద్యోగ విజయాలు, గయోపాఖ్యానం మొదలైన నాటకాలలో అర్జునుడి పాత్రతో నాటకరంగంలోకి ప్రవేశించారు. పులిపాటి వెంకటేశ్వర్లు తరువాత అర్జున పాత్రలో విశేష గుర్తింపు పొందారు. బందా కనకలింగేశ్వరరావు ప్రోద్భలంతో ఏలూరు ప్రభాత్ నాటక సమాజంలో చేరి ఆయన పక్కన అర్జునుడు, భృగుమహర్షి (శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం) పాత్రలలో నటించారు.

బందా విజయవాడలోని ఆలిండియా రేడియోలో చేరడంతో, బి.వి.రంగారావు వృత్తి నటుడిగా వెలుగొందారు. ప్రముఖ రంగస్థల నటులైన అబ్బూరి రామకృష్ణారావు, అద్దంకి శ్రీరామమూర్తి, మాధవపెద్ది వెంకటరామయ్య మొదలైన వారితో కలిసి నటించారు. అనంతరం పీసపాటి నరసింహమూర్తి పక్కన అర్జునుడి పాత్రలో రేడియో నాటకాలలో నటించారు. ఈయన వివిధ నాటకాలలో విభిన్న పాత్రలలో నటించినా, అర్జునుడి పాత్రలోనే ఎక్కువపేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 1975, సెప్టెంబర్ 30న రంగారావు ఉద్యోగ విరమణ సందర్భంగా సత్య హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు. అప్పుడు విజయవాడ పట్టణ పౌరులు, కళాకారులు రంగారావును ఘనంగా సన్మానించారు. కళారంగ వికాసం కోసం కృషి చేసిన బి.వి. రంగారావును ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ కళాప్రవీణ బిరుదునిచ్చి సత్కరించింది.

★నటించిన పాత్రలు:
అర్జునుడు (పాండవోద్యోగ విజయాలు, గయోపాఖ్యానం)
భృగుమహర్షి (శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం)
హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్ర
శివాజీ (శివాజీ) - నెల్లూరు లో గవర్నరు చేతుల మీదుగా రజత పాత్ర బహుమతిగా వచ్చింది.
శ్రీ రంగారావు 1996లో ఆ నటరాజు సాన్నిధ్యం చేరారు.

శ్రీ ఆడబాల

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

 శ్రీ అడబాల
(కందిమళ్ల సాంబశివరావు)
 నటులు, రూపశిల్పి, 
లలిత కళా సమితిలో స్థాపక సభ్యులు, 
రంగస్థల అధ్యాపకులు.
ఈయన 1936, ఫిబ్రవరి 9 న తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సత్యమ్మ, వెంకన్ననాయుడు.

నాటకరంగానికి రూపశిల్పిగా సుపరిచితులు. ఆ శాఖలో లోతుపాతులు కూలంకషంగా, శాస్త్రీయ పద్ధతులలో అధ్యయనం చేసి నైపుణ్యం సంపాదించారు. జాతీయ స్థాయిలో నాటక విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆహార్యంలో మెళకువలు బోధించారు. సీనియర్ మేకప్ ఆర్టిస్టులలో ఆడబాల ముఖ్యులు. 
ఈయన బి.ఏ పట్టభద్రుడు. 
డాక్టర్ గరికపాటి రాజారావు వద్ద నటనలోను, ఆదర్శ నాట్యమండలి, పాలకొల్లుకి చీఫ్ మేకప్ ఆర్టిస్టు అయిన మెషక్‌ వద్ద మేకప్‌లోనూ శిక్షణ పొందాడు.

అడబాల బాల్యదశ నుండే నాటకాల్లో వేషాలు వేశారు. విద్యార్థి దశలో భమిడిపాటి 'ఇప్పుడు' అనే నాటికలో శానయ్య పాత్ర ధరించి శభాష్ అనిపించుకున్నారు. 1940 నుంచీ పినిసెట్టి శ్రీరామమూర్తి నిర్వహించిన ఆదర్శ నాట్యమండలి పక్షాన ప్రదర్శించిన పల్లెపడుచు, అన్నాచెల్లెలు తదితర నాటకాల్లో పాల్గొన్నారు. 
మద్రాస్ లో రైల్వేశాఖ ఉద్యోగం.
కె. వేంకటేశ్వరరావు శిక్షణలో ర.స.న సమాఖ్యలో 'ఫణి, రాగరాగిణి' వంటి ప్రతిష్ఠాత్మక నాటకాలలో పాల్గొన్నారు. పలుచోట్ల ఉత్తమ నటుడిగానూ, 
హాస్య నటుడిగానూ బహుమతులు అందుకున్నారు. 

1966లో సికింద్రాబాద్ వచ్చిన అడబాల 1967లో ఆంధ్ర లలిత కళాసమితిని స్థాపించిన వ్యవస్థాపక సభ్యులలో ఒకరయ్యారు. ఎ.ఆర్. కృష్ణ ఆధ్వర్యంలో చాలా నాటకాల్లో పాల్లొన్నారు. అందులో ముఖ్యమైనది 'మాలపల్లి. నేరము- శిక్ష, కప్పలు, నీలా తెరలు, లేపాక్షి, ఆశ్రయం, అరణి, వీలునామా' మొదలైన నాటకాలు, 'మానవుడు, పెళ్ళిచూపులు, పగ, అమ్మ, రాజీవం, రాతిమనిషి 'మొదలైన నాటికలు నటుడిగా అడబాలకు పేరు తెచ్చాయి.

 అడబాల కొన్ని టీవీ సీరియల్స్‌లో, అగ్నిప్రవేశం, స్టూవర్టుపురం పోలీస్ స్టేషను మొదలైన చిత్రాల్లో కూడా నటించారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి విజిటింగ్ ఫాకల్టీగా చేశారు. ఉస్మానియా, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని రంగస్థల కళల శాఖలో విజిటింగ్ లెక్చరర్ గా పనిచేశారు. ఈయన శిక్షణలో అనేక మంది శిష్యులు ఆహార్యంలో నైపుణ్యం సంపాదించారు.

ఆదర్శ నాట్యమండలి నాటకాలకు అప్పట్లో మేకప్ చేస్తున్న మాస్టారు అడబాల అసక్తిని గమనించి, మేకప్ లో తొలి పాఠాలు నేర్పి ప్రోత్సహించారు. ఆనాటి నుండి అటు నటన, ఇటు రూపశిల్పం రెండీంటినీ నిర్వహిస్తూ వచ్చారు.

నటుడిగా30 నాటకాల్లో నటించినా,
రూపశిల్పిగా రమారమి నాలుగు వేల
నృత్య,నాటక ప్రదర్శనకు మేకప్ చేసి,
రంగస్థలంతో దాదాపు ఆరుదశాబ్దాల అనుబంధం పెనవేసుకొన్న ఈయన,
ఆహార్యంలో  అగ్రతాంబూలం అందుకొన్న వీరు,
మార్చి 14, 2013న మరణించారు.
      (సేకరణ-నూలు)
★★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★

23, అక్టోబర్ 2020, శుక్రవారం

శ్రీ సురభి కమలాబాయి

ఆంధ్ర నాటకరంగ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యం వహించే సురభి నాటకాల చరిత్ర ఆంధ్రులందరికీ పరిచయమైనదే. ఆంధ్రనాటకరంగానికి తొలి ఉత్సాహాన్ని ఇచ్చిన ధార్వాడ కంపెనీవారూ, 
తోలు బొమ్మల ఆటలవారూ 
ఏ మహారాష్ర్టులో, 
ఈ సురభి నాటక కళాకారులు కూడా 
ఆ మహారాష్ట్రులే.
సురభి కళాకారులు ఆంధ్రనాటకరంగానికి 
అపార మైన సేవచేశారు. 
కేవలం భుక్తికొరకే కాక కళాదృష్టితో 
వారు నాటకాలను ప్రదర్శిం చారు. 
కుటుంబాలు కుటుంబాలే ఆంధ్రదేశపు 
నాలుగు చెరగులా విస్తరించి నాటకరంగానికి బహుముఖ సేవ చేశారు.

అలా సేవచేసిన కుటుంబాలకోవకు చెందినదే 
సుప్రసిద్ద చలనచిత్ర ప్రథమ కథానాయకి 
సురభి కమలాబాయి.

కమలాబాయి 1908 ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాదులో జన్మించింది. 
తండ్రి ప్రసిద్ధ సురభికళాకారుడు 
వనారస పెద కృష్ణాజీరావుగారు. 
తల్లి వెంకుబాయి. ఈమె మహా సంగీత విద్వాంసురాలు. జంఝూటి రాగాలాపన చేయడంలో అందెవేసిన విదుషీమణి. అందువల్ల ఈమెను 
జంఝూటి వెంకుబాయి 
అని పిలిచేవారు.

కమలాబాయి తండ్రి కృష్ణాజీరావుగారికి స్వంత 
సురభి నాటక సమాజం ఉండేది. 
కళాకారుల కుటుంబంలో పుట్టిన కమలాబాయి చిన్నతనంలోనే వారి సమాజ నాటకాలలో బాలకృష్ణుడు. ప్రహ్లాదుడు, లవుడు మొదలైన బాలపాత్రలను అద్భుతంగా పోషించింది.

కమలాబాయి నహజసౌందర్యవతి, 
కమ్మని కంఠం, స్వచ్ఛమైన, శ్రావ్యమైన ఉచ్చారణ, పాత్రపోషణలో ఆమెకు ఆమెయే సాటి.

బాలవేషాలతో పేరు తెచ్చుకున్న కమలాబాయి యుక్తవయస్సురాగానే సమాజంలోని కథానాయకి పాత్రలను అన్నిటినీ కడు సమర్థనీయంగా నటిస్తూ, తండ్రి గారి అనంతరం సమాజాన్ని స్వయంగా 
తానే నిర్వహించింది.

కమలాబాయ నటజీవితంలో 
కొన్ని వందల సువర్ణ, రజత పతకాలను 
బహమతిగా పొందింది.

ఆ రోజుల్లో నాటక ప్రదర్శనాలలో 
మధ్య మధ్య వచ్చే విరామసమయాలలోనూ, 
హాస్య సన్నివేశాలలోనూ 
అద్భుతంగా నృత్యం చేస్తూ ఉండేది.

ఆమెకు సహజ సంగీతజ్ఞానం ఉన్నా, 
హిందూస్థానీ సంగీతం నేర్చుకోవాలనే 
కుతూహలంతో బొంబాయి వాస్తవ్యుడు 
పరశురాంబువ వద్ద హిందూస్థానీ సంగీతాన్నీ అభ్యసించి బాలగంధర్వగా ప్రశంసలను అందుకుంది.

తెలుగు టాకీయుగం ప్రారంభమైన తరువాత ప్రప్రథమంగా చలన చిత్రాలలో కథా నాయకి పాత్రధరించిన ప్రప్రథమ తెలుగు వనిత సురభికమలాబాయి. 
ఆ ఘనత ఆమెకే దక్కింది.

బాల్యం నుంచి రంగస్థల నటిగా ఎదుగుతూ,
1931లో  హెచ్‌.ఎం.రెడ్డి రూపొందించిన 
తొలి టాకీ చిత్రం
'భక్త ప్రహ్లాద'లో హిరణ్యకశిపునిగా నటించిన 
మునిపల్లె వెంకటసుబ్బయ్య సరసన 
లీలావతిగా నటించారు.

తరువాత సర్వోత్తమ బదామి దర్శకత్వంలో 
సాగర్‌ ఫిలింస్‌ రూపొందించిన 
'పాదుకా పట్టాభిషేకం'లో సీతగా 
అద్దంకి శ్రీరామమూర్తి సరసన, 
'శకుంతల'లో శకుంతలగా యడవల్లి సూర్యనారాయణతో నటించారు. 
బి.వి.రామానందం దర్శకత్వంలో 
కృష్ణా ఫిలింస్ నిర్మించిన 
'సావిత్రి'లో సావిత్రిగా 
టైటిల్‌ రోల్‌ పోషించారు. 
సరస్వతి సినీ టోన్‌ నిర్మించిన 
'పృథ్వీపుత్ర'లో ఓ ముఖ్యపాత్ర పోషించారు.

కమలాబాయి ప్రతిభ గురించి విని, 
ప్రత్యక్షంగా చూసి ముగ్ధుడైన సాగర్ ఫిల్మ్ అధినేత కమలాబాయిని బొంబాయికి ఆహ్వానించాడు. 
అక్కడే పదేళ్లపాటు ఉండి సాగర్ ఫిల్మ్ నిర్మించిన సినిమాలలో నటించింది. 
మహాభారతం వంటి 25 చిత్రాలలో నటించింది.

1939లో విడుదలైన భక్తజయదేవ 
సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలో 
నటించడం ప్రారంభించింది. 
విశాఖపట్నంలోని ఆంధ్రా సినీ టోన్ అనే 
చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న 
ఈ చిత్రాన్ని తెలుగు, బెంగాళీ భాషలలో నిర్మించారు. 
ఈ రెండు భాషలలోనూ కమలాబాయే కథానాయకి. 
ఆ చిత్రంలో రెంటచింతల సత్యనారాయణ, 
సురభి కమలాబాయి ముఖ్య పాత్రధారులు. 
ఆ చిత్రానికి హిరేన్ బోస్ అనే బెంగాలీ ఆయన దర్శకుడు. అయితే ఆయన సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రం కావడంతో చిత్ర నిర్మాణం 
సరిగా సాగలేదు. నిర్మాణం ఆగిపోయి నిర్మాతలకు భారీగా నష్టం వచ్చే పరిస్థితిలో కథానాయిక పాత్ర ధరించడంతో పాటు దర్శకత్వం, 
ఎడిటింగ్ కూడా తనే నిర్వహించి, 
చిత్రాన్ని పూర్తి చేసి అందర్నీ 
ఆశ్చర్యపరచింది కమలాబాయి.
అయితే చిత్రం టైటిల్స్ లో మాత్రం 
దర్శకుడిగా హిరేన్ బోస్ పేరే కనబడుతుంది.

అలాగే తొలి ద్విభాషా చిత్రమైన 
తుకారాం (1940) తెలుగు వెర్షన్లో 
ఈమె నటించింది. అప్పటి వరకు 
కథానాయకి పాత్రలు పోషించిన కమలాబాయి
ఆ తర్వాత సినిమాలలో కారెక్టర్ రోల్సు వెయ్యటం ప్రారంభించింది. ఈ విధంగా నటించిన సినిమాలలో పత్ని, మల్లీశ్వరి, లక్ష్మమ్మ, పాతాళభైరవి, 
సంక్రాంతి, అగ్నిపరీక్ష ముఖ్యమైనవి.

మద్రాసులో జరిగిన భారత చలన చిత్రోత్సవం సందర్భంలో దక్షిణభారత నటీనటసమాఖ్యవారు 
ప్రప్రథమంగా తెలుగు చిత్రాలలో నటించినందుకు 1957 జనవరి 17వ తేదీన ఒక షీల్డు, 
సన్మానపత్రం ఆమెకు ప్రదానంచేసారు.

1966లో ఆంధ్ర ఫిల్మ్ జర్నలిస్టుల అసోషియేషన్ వారు, 
1967లో ఏలూరులో ఆంధ్ర నాటక కళాపరిషత్తు మహాసభలలో పరిషత్తువారు, 
1969లో ఏలూరు వై . ఎమ్. హెచ్. ఎ.వారు,  
నాటక సినిమా రంగాలకు 
ఆమె చేసిన సేవను ప్రశంసిస్తూ 
ఘనంగా సన్మానించారు.

హిందూస్థానీ సంగీతంతో పాటు హార్మనీ, 
సారంగీ, వయొలిన్ మొదలైన వాద్యాలను 
గొప్పగా వాయించేది.

కమలాబాయి హాస్య చతుర. 
సినిమా సెటులో ఉన్నప్పుడూ, 
విడిగానూ కడు చమత్కారంగా మాట్లాడేది.

అనేక తెలుగు నాటకాలలోనూ, 
సినిమాలలోనూ వివిధ పాత్ర లను 
అద్భుతంగా పోషించి ప్రసిద్ధ నటిగా 
వెలుగొందిన సురభి కమలాబాయి 
1971 ఫిబ్రవరి 18వ తేదిని ఏలూరులో 
ఆమె స్వగృహంలో స్వర్గస్థురాలైంది.

22, అక్టోబర్ 2020, గురువారం

శ్రీ పసుపులేటి కన్నాంబ

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

నేటి మన చిరస్మరణీయురాలు..  ఆవేశంలో జగదాంబ...
అందంలో ఒక రంభ..
ప్రసిద్ధ రంగస్థల నటి, గాయని. చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న *కన్నాంబ* పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1912లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో 1935లో హరిశ్చంద్ర తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో "ద్రౌపది"గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది.

పేరు తెచ్చిన సినిమాలు, 
ద్రౌపదీ వస్త్రాపహరణం, హరిశ్చంద్ర, పాదుక, చంద్రిక, కనకతార, పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి , అనార్కలి, దక్షయజ్ఞం , తోడికోడళ్ళు, కృష్ణ కుచేల, తదితర చిత్రాలు ఆమె నటించిన ముఖ్యమైనవి.

ఎం.జి.రామచంద్రన్, ఎన్.ఎస్.రాజేంద్రన్, శివాజీగణేశన్, నాగయ్య, పి.యు. చిన్నప్ప, నందమూరి తారక రామారావు, తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లో ఆమె నటించింది.

సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త కడారు నాగభూషణం, ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు.

కన్నాంబ పాడిన " కృష్ణం- భజరాధా' గ్రాంఫోన్ గీతాలు- ఆనాటి రోజుల్లో ప్రతియింటా మారుమ్రోగుతుండేవి. ఆమె గొప్ప నటిమణి మాత్రమే కాదు- చక్కని గాయని కూడా. సుమారు ఐదు దశాబ్దాలు తెలుగు చలన చిత్ర సీమలో తనదైన ప్రత్యేకత ప్రదర్శించిన శ్రీమతి కన్నాంబ 1964లో మే 7 వ తేదీన తుదిశ్వాస వదిలింది.

‘నేనే రాణీనైతే, ఏలనె ఈ ధర ఏకథాటిగా.....’ అని ఒక పాట. చేతిలో కత్తి పట్టుకుని, వీరావేశంతో గుర్రం మీద కూచుని ఠీవిగా, ధాటిగా కళ్లెర్రజేస్తూ పాడిన ఆ మహానటి పనుపులేటి కన్నాంబ. ఆ సినిమా పేరు ‘చండిక’ (41), ఠీవి గురించి ఆ రోజుల్లో ఆ సినిమా చూసినవాళ్లు చెప్పుకునేవారు. అందులో కన్నాంబ ఇంకా కొన్ని పాటలు పాడారు. మరొక పాట : ఏమే ఓ కోకిలా - ఏమో పాడెదవు, ఎవరే నేర్పినది ఈ ఆట ఈ పాట.....‘ ఈ పాటలో ఆమె నవ్వులు రువ్వుతూ పాడతారు. మధ్యమధ్యలో వచ్చే ఆ నవ్వు - ఆమె తప్ప ఇంకెవరు అలా నవ్వులు కలుపుతూ పాడలేరని కూడా ఆనాటి జనం చెప్పుకునేవారు.
కడారు నాగభూషణం గారిని వివాహం చేసుకుని శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ స్థాపించి తెలుగు తమిళభాషల్లో 22 చిత్రాలు నిర్మింపజేశారామె. ’సుమతి‘ (42), పాదుకాపట్టాభిషేకం (54), సౌదామిని (51), పేదరైతు (52), లక్ష్మి (53), సతీ సక్కుబాయి (54), శ్రీకృష్ణతులాభారం (55), నాగపంచమి (56) మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకుముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపెనీ..వారి ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండులో, కార్లు, వాన్‌లతో కలకల్లాడుతూ ఉండేది. ఎక్కువగా క్యారెక్టర్స్‌ ధరించినా, కన్నాంబకు హీరోయిన్‌ గ్లామరే వుండేది. ఇప్పుడు ’టైటానిక్‌ చీరలు‘ అంటూ సినిమా పేర్లతో చీరలు వస్తున్నట్టు - అప్పుడు ’కాంచనమాల గాజులు - కన్నాంబ లోలాకులు‘ అంటూ ఆభరణాలు వచ్చేవి. కన్నాంబ గొప్ప ఐశ్వర్యవంతురాలు అనీ, బంగారు కాసులు డబ్బాల్లో పోసి, పప్పులు, ఉప్పులు పెట్టుకునే డబ్బాల మధ్య ఎవరికీ తెలియకుండా ఉంచేవారనీ చెప్పుకునేవారు.
ఐశ్యర్యం ఎలా వస్తుందో ఎలా పోతుందో వరూ చెప్పలేరని పెద్దలు చెబుతారు. ఎలా పోయాయో, ఏమైపోయాయో గాని కన్నాంబ మరణంతో కంపెనీతో సహా అన్నీ పోయాయి. ఆమె భర్త నాగభూషణం ఒక చిన్నగదిలో ఉంటూ కాలక్షేపం చేసేవారు. ఒకసారి ఒక మిత్రుడు ఆయన్ని కలవాలని ఆ గదికి వెళ్లి ‘గుండె కలుక్కుమంది. ఆ వాతావరణం చూడలేక తిరిగి వచ్చేశాను’ అని చెప్పారు. ‘ఆ చిన్నగదిలో ఒక ట్రంకు పెట్టె, ఓ కుర్చీ మాత్రం ఉన్నాయి. ఎదురుగా కన్నాంబ ఫోటో, దండెం మీద తువ్వాలు తప్ప ఇంకేం కనిపించలేదు. ఆయన కిందనే చాపమీద కూచుని, దినపత్రిక చదువుకుంటున్నారు’ అన్నారా మిత్రుడు.
కన్నాంబ మృతదేహాన్ని వారి కులాచారం ప్రకారం నగలతోనే పూడ్చిపెడితే దొంగలు ఆ నగలను కాజేసి ఆమె శవాన్ని కూడా మాయం చేశారట.

నటిగా ...
ఆత్మబలం (1964)
రామదాసు (1964)
పరువు ప్రతిష్ట (1963)
లవ కుశ (1963)
ఆప్తమిత్రులు (1963)
ఆత్మబంధువు (1962)
దక్షయజ్ఞం (1962)
స్త్రీ జీవితం (1962)
జగదేక వీరుని కథ (1961)
ఉషా పరిణయం (1961)
అభిమానం (1960)
రాజ మకుటం (1959/I)
అన్నా తమ్ముడు (1958)
మాంగల్య బలం (1958)
శ్రీకృష్ణ మాయ (1958)
కుటుంబ గౌరవం (1957) (1957)
తోడికోడళ్ళు (1957)
చరణదాసి (1956)
అనార్కలి (1955)
శ్రీకృష్ణ తులాభారం (1955)
మనోహర (1954)
సౌదామిని (1951)
పల్నాటి యుద్ధం (1947)
మాయాలోకం (1945)
మాయా మచ్చీంద్ర (1945)
పాదుకా పట్టాభిషేకం (1945)
మహామాయ (1944)
కన్నగి (సినిమా) (1942)
సుమతి (1942)
అశోక్ కుమార్ (1941)
తల్లిప్రేమ (1941)
భోజ కాళిదాస (1940)
ఛండిక (1940)
మహానంద (1939)
గృహలక్ష్మి (1938)
కనకతార (1937)
సారంగధర (1937)
ద్రౌపది వస్త్రాపహరణం (1936)
హరిశ్చంద్ర (1935)
సీతా కళ్యాణం (1934)
నేపధ్య గాయనిగా...
సుమతి (1942)
తల్లిప్రేమ (1941)
గృహలక్ష్మి (1938)
★★★★★★★★★B★★
💐ఆ మహానటికివే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★        (సేకరణ-నూలు)

శ్రీ విన్నకోట రామన్న పంతులు

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
కన్యాశుల్కం చిత్రంలో అగ్నిహోత్రావధానులు వేషంలో ఇప్పటివరకూ ఆయనే మేటి ...ఆయనది చక్కని స్పష్టమైన వాగ్దాటి...
వారే ఆనాటి మన చిరస్మరణీయులు...

శ్రీ *విన్నకోట రామన్న పంతులు* ఔత్సాహిక నాటక రంగానికి నటులుగా, దర్శకునిగా, న్యాయనిర్ణేతగా, రేడియో కళాకారునిగా విశిష్ట సేవలందించిన వ్యక్తి.

తల్లిదండ్రులు
విన్నకోట వేంకటకృష్ణయ్య (తండ్రి)
అన్నపూర్ణమ్మ (తల్లి)
జీవిత విశేషాలు ..
ఇతడు 1920, ఏప్రిల్ 13న విజయవాడలో వేంకటకృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. ఇతని విద్యాభ్యాసం విజయవాడ లోని గాంధీజీ మునిసిపల్ హైస్కూలు, కాకినాడలోని ఎఫ్.ఎ.సి.ఆర్.కాలేజి, విజయనగరంలోని మహారాణి కాలేజి, పూనాలోని లా కాలేజీలలో గడిచింది. ఇతడు న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తరువాత, వృత్తిరీత్యా న్యాయవాదిగా జీవితాన్ని కొనసాగిస్తూనే మరోప్రక్క నటులుగా నాటకాల్లో పాత్రలు ధరిస్తూ నాటకరంగం బాగుకోసం పాటుపడ్డారు. వీరు నటనకు, ఆహార్యానికి సంబంధించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. వాటి మీద నటశిక్షణ, రూపశిల్పం, నాటక ప్రయోగం, రంగస్థల శాస్త్రం, వాచికాభినయం, మేకప్, మూకాభినయం, రససిద్ధాంతం, అంగికాభినయం,లైటింగ్, రంగస్థల నిర్మాణం, సాత్వికాభినయం మొదలైన పుస్తకాలు కూడా రచించారు.. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ప్రేక్షక సంఘం నటరాజ కళామండలిని స్థాపించారు. నాట్య సంఘం కార్యదర్శిగా, రాఘవకళా కేంద్రం కార్యదర్శిగా సేవలను అందించారు. జంధ్యాల, మురళీమోహన్, సుత్తి వీరభద్రరావు, సుబ్బరాయ శర్మ మొదలైన వారికి నటనలో శిక్షణను ఇచ్చారు. తెలుగు రంగస్థల, సినిమా నటుడు విన్నకోట విజయరాం ఇతని కుమారుడు. టెలివిజన్ నటుడు, సినిమా నటుడు ప్రదీప్  వీరి మనుమడు.

నాటకరంగం 
ఇతడు 1950 ప్రాంతంలో విజయవాడలో సుంకర కనకారావు, కొప్పరపు సుబ్బారావు, డి.వి.నరసరాజు, కె.వి.ఎస్‌.శర్మ, నిర్మలమ్మ మొదలైనవారితో కలిసి గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించేవారు. ఇందులో అగ్నిహోత్రావధాన్లు పాత్రను రామన్నపంతులు గొప్పగా పోషించేవారు. రాఘవ కళాకేంద్రం ప్రదర్శించిన విశ్వం పెళ్ళి, ఇనుప తెరలు మొదలైన నాటకాల్లో రామన్నపంతులు విలక్షణమైన పాత్రలను ధరించి మంచి పేరు తెచ్చుకున్నారు. తరువాత డి.వి.నరసరాజు రచించిన "నాటకం" అనే నాటకంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించి తన కీర్తిని పెంచుకున్నారు. ఈ నాటకానికి ఆంధ్ర నాటక కళాపరిషత్తు పోటీల్లో రచన, ప్రదర్శనలకు బహుమతులు లభించాయి. ఇవే కాకుండా వరవిక్రయం, పెద్దమనుషులు, ఈనాడు, ఆసామి, శ్రీరంగనీతులు మొదలైన నాటకాలలో కూడా పాత్రలు ధరించారు. రామన్నపంతులు ఉత్తమ దర్శకుడిగా అనేక నాటకాలకు దర్శకత్వం వహించారు. వీటిలో ఎన్.జి.వో., నాటకం, లేపాక్షి, సంభవామి యుగే యుగే, దశమగ్రహాలు ముఖ్యమైనవి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభమైనప్పటి నుండి మరణించేవరకూ అనేక నాటకాలలో పాత్రపోషణ చేసేవారు. సీతాపతి సంసారం ధారావాహిక నాటకంలో సీతాపతి పాత్ర ఇతనికి మంచిపేరు తెచ్చిపెట్టింది.

సినిమా రంగం
వీరు తెలుగు సినీరంగంలో ప్రవేశించి బి.యన్.రెడ్డి గారి బంగారు పాప (1954) చిత్రంలో మొదటిసారిగా జమిందారు పాత్రను పోషించారు. తర్వాత వినోదా సంస్థ నిర్మించిన కన్యాశుల్కం (1955) చిత్రంలో కూడా అగ్నిహోత్రావధాన్లు పాత్రను పోషించి తన నటనకు ప్రశంసలందుకున్నారు. బాపూరమణలు ఇతడిని పిలిచి తమ తొ_లిచిత్రం సాక్షి (1967) లో తడిగుడ్డతో గొంతులు కోసే ప్రతినాయకుడు మునసబు పాత్రను ధరింపజేశారు.

ప్రముఖ హాస్యరస చక్రవర్తి జంధ్యాల చిన్నప్పుడు తొలిసారిగా ఇతని నాటకాల కంపెనీలో నటించారు. జంధ్యాల సినీ దర్శకునిగా మారిన పిదప తన తొలిచిత్రం ముద్ద మందారం (1981) లో కథకు కీలకమైన పాత్రను పంతులు చేత వేయించారు.

చిత్రసమాహారం 
బంగారు పాప (1954) - జమీందారు
కన్యాశుల్కం (1955) - అగ్నిహోత్రావధాన్లు
దొంగరాముడు (1955)
వరుడు కావాలి (1957)
బాటసారి (1961) - జమీందారు
శ్రీకృష్ణ కుచేల (1961)
చదువుకున్న అమ్మాయిలు (1963)
రామదాసు (1964)
ఇల్లాలు (1965)
శ్రీమతి (1966)
సాక్షి (1967) - మునసబు
బంగారు పిచిక (1968) - సన్యాసిరాజు
స్నేహం (1977)
ముద్ద మందారం (1981)
మల్లెపందిరి (1982)
ముగ్గురమ్మాయిల మొగుడు (1983)
వీరికి ఒక పుత్రుడు పేరు విన్నకోట విజయరాం 
వీరు 1982, డిసెంబర్ 19న
పరమపదించారు...
★★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★

21, అక్టోబర్ 2020, బుధవారం

శ్రీ ఈవెన లక్షణస్వామి

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
ఈవెన లక్ష్మణస్వామి... 
 ప్రముఖ రంగస్థల నటులు. 

బందరు బుట్టయ్యపేట కంపెనీ అనే నేషనల్ థియేటర్ వారి నాటకాలలో ప్రముఖ పాత్రలను పోషించారు.. హిందీ నాటకాలలో కూడా నటించారు.

రంగస్థల నటులు
లక్ష్మణస్వామి 1864లో కొత్తపల్లి గ్రామంలో జన్మించారు.

★విద్యాభ్యాసం -
ఆంగ్లంలో లోయర్ సెకండరీ వరకు చదివిన లక్ష్మణస్వామి పార్సీ, హిందీ, ఉర్దూ భాషలలో పాండిత్యం సంపాదించారు.. బందరు ముస్లీం పారశాలలో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేసి, అనంతరం విక్టోరియా పబ్లిక్ లైబ్రరీలో గుమస్తాగా పనిచేశారు..

★నటించిన పాత్రలు...
శివాజీ
పఠాన్ రుస్తుం
సుమేర్ సింగ్
భీమసింగ్
మంత్రి రామశాస్తీ
విక్రమార్కుడు
విశ్వామిత్రుడు (మేనక)
హరిశ్చంద్రుడు
హిరణ్యకశ్యపుడు
శ్రీకృష్ణుడు (సుభద్ర)
రాణా ప్రతాప్ సింగ్
హైదర్ జంగ్.
 
వీరు 1913, జనవరి 7న  దివంగతులయ్యారు.
★★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★

19, అక్టోబర్ 2020, సోమవారం

నాటకం ఓ గొప్ప ప్రక్రియ. మహాకవి కాళిదాసు నాటకాన్ని “చాక్షూషమైన యజ్ఞం” అని గౌరవించాడు. యజ్ఞం చేసే ఋత్విక్వుల వంటివాడు నటుడు. అందరూ సుఖంగా భార్యాపిల్లలతో నిద్రపోయే ఎన్నోరాత్రులు, నటీనటులు నాటకనిర్మాణంలో, వ్యయపరచి, తమ సుఖాన్ని సంతోషాన్ని వదలుకొని, చెప్పలేనంత కష్టాన్ని, చెప్పుకోలేనంత శ్రమను ధారపోస్తారు. అప్పుడే ఓ నాటకం పుడుతుంది. పుట్టినబిడ్డను పదిమందికీ చూపించడానికి, పది ఊళ్ళూ తిరుగుతారు. చివరికి జనులా ప్రదర్శన చూసి, చప్పట్లు కొడితే ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతారు నటులు. ఎందుకోసం ఇదంతా? ఎవరికోసం ఇదంతా? ఈ జనం కోసమే. ఈ జనానందం కోసమే. అలా తమని తాము కొవ్యొతిలా కరిగించుకొంటూ, లోకానికి వెలుగునిచ్చే, నిస్వార్థ జీవులు కళాకారులు...

పువ్వుల రామతిలకం

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
చద్రబింబంలాంటి మంచి అందమైన వర్చస్సుగల మోము... అద్భుత హావభావాలు..వాచకం,పాట పద్యాలు చక్కని శృతితో శ్రావ్యంగా పాడటం.. మెరిసే చూపులు...వయ్యారపునడక...వీటన్నిటినీ కలగలిపి ఊహిస్తే కదిలే అందాల బొమ్మే పువ్వుల రామతిలకం...
అలనాటి ఆంధ్ర యువకుల హృదయ స్పందన...ఈమె సినిమా విడుదల రోజుల్లో గ్రామసీమలనుండి జనం కుటుంబం మొత్తం తో...
ఆహారపు ఏర్పాట్లతో చిరుదిళ్లులాంటి వాటితో, తాంబేటీకాయ మరచెంబులతో మంచినీళ్లు..పెట్టుకొని ఎడ్ల బండ్ల పై బారులు తీర్చి...పట్టణంలో ఉన్న సినిమా హాల్ కు వచ్చి చూచి...తెల్లవారి మరల తిరుగుప్రయానం చేసేవారు..ఈ సంఘటన అనుభవాన్ని మొత్తం మనసులో ప్రతిష్టించు కుని..నెమరవేసుకుంటూ కబుర్లు చెప్పుకునే వారు...
ఆరోజుల్లో విడుదల అయిన ఒక సినిమా ఇంచుమించు దక్షిణ భారతదేశంలో
అత్యంత ఆదరం పొందింది. అదే ""సావిత్రి"" చిత్రం...
1932లో, కలకత్తాలో ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన సావిత్రి చలన చిత్రం..సావిత్రి పాత్రలో పువ్వుల రామతిలకం జీవించింది..ఆ మరుసటేడే మదన్ ఫిలిమ్ కంపెనీ నిర్మించిన ""చింతామణి""సినిమాలో చింతామణిగా పేక్షకుల మనసులు దోచుకొంది..వేల్ పిక్చర్స్ ""కృష్ణ లీలలు""చిత్రంలో ఆమె యశోదగా నటించి,
ప్రేక్షకుల మనస్సులలో యశోదగా నిలచిపోయింది.."కలయో వైష్ణవ మాయయో"  అనే బమ్మెర పోతన గారి పద్యం ఆమె నోటివెంట ఎంత మధురంగా వినిపించిందంటే.. ఆ తరువాత మూడు దశాబ్దాల వరకూ..తెలుగు వారి ఇళ్ళలో ఆ పద్యం వినబడేదట.

ఇంతటి కీర్తి ప్రతిష్టలు పొందిన పువ్వుల రామతిలకం జన్మించినది మన బెజవాడ లోనే .
సుప్రసిద్ధ మృదంగ విద్వాంసులైన పువ్వుల వెంకట రత్నం గారు వీరి తండ్రి.
సంగీత విద్వాంసులైన పువ్వుల నారాయణ గారి దగ్గర ఈమె సంగీతం నేర్చుకొన్నారు.ఆమె గాత్ర మాధుర్యానికి కరిగిపోయిన మైలవరం కంపెని మానేజర్ కొమ్మూరు పట్టాభి రామయ్యగారు ఆమెకు తన లక్ష్మి విలాస సభలో అవకాశం కల్పించడం..అక్కడే ఆమె గొప్ప పేరు ప్రతిష్టలు ఆర్జించడం జరిగింది.
ఆ తరువాత గొప్ప నటులు,నిర్వాహకులైన కపిలవాయి రామనాధ శాస్త్రి గారి 
బాల భారతీ నాట్య మండలిలో చేరడం..తద్ద్వారా ఎన్నో గొప్ప పాత్రల్ని పోషించే అవకాశం,అదృష్టం ఆమెకు లభించాయి.

శ్రీ కృష్ణ లీలలు,శ్రీకృష్ణ తులాభారం,సతీ సక్కుబాయి,చింతామణి వంటి అనేక 
నాటకాలలో నటించి గొప్ప కీర్తి పొందింది..కాలం మారింది.సినీ ప్రపంచంలో నేపధ్య సంగీత ప్రాధాన్య పెరిగింది..తమ పాట తామే పాడుకోవడానికి ప్రాధాన్యత తగ్గడం ఆరంభమైంది..దానితో రామతిలకం క్రమంగా సినీ రంగానికి దూరమవక తప్పలేదు...

అపారమైన కీర్తి ప్రతిష్టలను స్వంతం చేసుకొన్న రామతిలకం తిరిగి తన గూటికే చేరవలసి వచ్చింది..బెజవాడలోనే ఆమె 14-3-1952న 47 ఏళ్ల వయసులోనే ఈ  లోకాన్ని వీడింది..

"జాతస్య మరణం ధ్రువం."..కానీ కళాకారులు మరణించినప్పటికీ జనహృదయాలలో జీవిస్తా రణదానికి ..
నేను నేడు ఆమె పై వ్యాసం వ్రాయడం...
మీలాంటి రసజ్ఞులైన పాఠకలు చదవడం...      (-నూలు)
★★★★★★★★★★★💐ఆ మహా నట కిదే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★

శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. మన జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను 'నటరత్నాలు' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.

1982లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
1949లో కేఎస్ ప్రకాశ రావు దీక్షతో మొదలై బాలకృష్ణ సినిమా భైరవద్వీపం వరకూ 400లకు పైగా తెలుగు చిత్రాల్లో నటించారు.

ఐదుసార్లు జైలుకు వెళ్లిన స్వాతంత్య్రయోధుడూ- కమ్యూనిస్టు. గ్రంథాలయ, హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్త, నాటకరంగ నటుడు, ‘ఆంధ్రుల నటరత్నాలు’ తదితర రచనలను చేసినవాడు, ప్రజానాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు, ‘తెలుగువారి జానపద కళారూపాలు’ గ్రంథ రచయిత. ‘మన పగటి వేషాలు’, ‘ఆంధ్రుల నృత్యకళావికాసం’ తదితర పరిశోధనాత్మక గ్రంథ రచయిత. ఎనభై ఏళ్లనాడు భార్యను నాటక రంగానికి పరిచయం చేసిన ప్రజా కళాకారుడు. జీవించి ఉన్న వాళ్లల్లో ఆయనతో పోల్చదగిన వారు అరుదు! గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 1914 జూలై 7న జన్మించారు మిక్కిలినేని. అయినవాళ్లు నష్టజాతకుడ న్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కోలవెన్నులో అమ్మమ్మ గారి ఇంట ఆయన బాల్యం పాదుచేసుకొంది. కపిలవాయి రామనాథ శాస్ర్తి శిష్యరికంలో ‘మిక్కిలినేని’ ఇంటిపేరుగల వారికి గర్వకారణంగా మానులా బహుముఖంగా ఎదిగి, మంగళవారం ఫిబ్రవరి 22, 2011 తేదీన మంగళవారం తెల్లవారు సుమారు మూడు గంటలకు మిక్కిలినేని విజయవాడలో తన 95వ ఏట మరణించారు. కొన్ని రోజులుగా, మూత్ర సంబంధమైన, అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఆసుపత్రిలో మరణించారు. "మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణంతో జీవించి వున్న తెలుగు సినీ కళాకారుల్లో తానే పెద్ద" అన్నారు డా. అక్కినేని నాగేశ్వరరావు. నిజమే. నాయక పాత్రలు-అనామక పాత్రలు అనే సినీ కొలమానంతో ‘అక్కినేని ఎక్కాల్సిన మెట్లూ-మిక్కిలినేని దిగాల్సిన మెట్లూ లేవు’ అనే వాడుక లోని చమత్కారమూ నిజమే.

మిక్కిలినేని వంటి నూనూగు మీసాల కుర్రాళ్లను అప్పటి సంక్షుభిత సమాజం రాటుదేల్చింది. అంతర్జాతీ యంగా ఫాసిస్టులకు, దేశీయంగా బ్రిటిష్-నైజాం నియం తృత్వానికి, ఆంధ్ర ప్రాంతంలో జమీందారీల అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ రూపొందించిన కళాసైన్యం ప్రజానాట్యమండలి. ఆ వాతావరణంలో భార్య సీతా రత్నాన్ని మిక్కిలినేని నాటక రంగానికి పరిచయం చేశారు. ఏడు దశాబ్దాల క్రితం ఎంతటి ముందడుగో!

పల్నాటియుద్ధం-బొబ్బిలియుద్ధం-కాటమరాజు కథ తదితర 30 చారిత్రక-జానపద కళారూపాల ద్వారా ప్రజలను సమీకరించిన ప్రజానాట్యమండలి 1940లలో నిషేధానికి గురైంది. ఫలితంగా కొందరు సినీరంగాన్ని ఆశ్రయించారు. వారిలో కేబీ తిలక్, తాతినేని ప్రకాశరావు, గరికపాటి రాజారావు, సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, సి.మోహనదాసు, టి.చలపతిరావు, వి.మధుసూదనరావు, మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి వంటి ముఖ్యులున్నారు.

వీరిలో నాటకరంగం నేపథ్యంగా సినీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నారు. నాటకరంగాన్ని విడవని నాగభూషణం వంటి నటులూ ఉన్నారు. నాటక రంగానికి చెందిన 400 మంది కళాకారులను ‘నటరత్నాలు’ శీర్షిక ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ప్రత్యేకత మిక్కిలినేనిదే! వీధినాటకాలు-జముకుల కథలు-బురక్రథలు ప్రదర్శిం చిన పాత రోజులను మరవకుండా, పాత స్నేహితాలను పునరావిష్కరించుకుంటూ తెలుగునేల నాలుగు చెరగులా తిరిగి స్వయంగా తెలుసుకున్న సమాచారంతో ‘ఆంధ్ర నాటకరంగ చరిత్ర’ రచించారు. డక్కికథ అనే పేరు నుంచి బురక్రథ అనేపేరు వచ్చిందని తన రచనలలో మిక్కిలినేని వివరించారు. అరవపల్లి సుబ్బారావు, ఆరణి సత్యనారాయణ, దేవతాసుబ్బారావు, నరసింహగుప్త, రెంటచింతల సత్యనారాయణ, భీమప్ప శ్రేష్టి, వంకాయల సత్యనారాయణ, రేపల్లె వెంకటశేషయ్య తదితర నటులు తమవారని తెలుసుకున్నామని, మిక్కిలినేని పరిశోధనలకు వైశ్యప్రముఖులు నివాళి పలికారు. వివిధ సామాజిక వర్గాలు తమ వారి వేర్లను/పేర్లను గుర్తించేందుకు ఉపకరించాయి మిక్కిలినేని రచనలు.

సినీజీవితంలో ప్రవేశించేముందు మిక్కిలినేని వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా చేశారు. ఆయన కుమారుడు డా.విజయకుమార్ వెటర్నరీ వైద్యులుగా పదవీ విరమణ చేయడం గమనార్హం! మిక్కిలినేనికి ఇరువురు కుమార్తెలు.

రచనలు సవరించు
నటరత్నాలు (1980, 2002)
ఆంధ్ర నాటకరంగ చరిత్ర
తెలుగువారి జానపద కళారూపాలు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1992.
ప్రజా పోరాటాల రంగస్థలం
ఆంధ్రుల నృత్య కళావికాసం
తెలుగువారి చలన చిత్ర కళ
నటించిన సినిమాలు సవరించు
శాంతినివాసం (1986)
పులి బెబ్బులి (1983)
రామ్ రాబర్ట్ రహీమ్ (1980)
గంధర్వ కన్య (1979)
చిరంజీవి రాంబాబు (1978)
దాన వీర శూర కర్ణ (1977) .... Bheeshma
సీతా కళ్యాణం (1976) .... జనకుడు
ఆడదాని అదృష్టం (1974)
బాల భారతం (1972) .... ధృతరాష్ట్రుడు
మావూరి మొనగాళ్ళు (1972)
సంపూర్ణ రామాయణం (1971) .... జనకుడు
బాలరాజు కథ (1970)
గండర గండడు (1969)
ప్రేమకానుక (1969)
దేవకన్య (1968)
కలిసొచ్చిన అదృష్టం (1968)
శ్రీకృష్ణావతారం (1967) .... ధర్మరాజు
పల్నాటి యుద్ధం (1966) .... కొమర్రాజు
అంతస్థులు (1965)
సి.ఐ.డి. (1965) .... రామదాసు
పాండవ వనవాసం (1965) .... దుశ్యాశనుడు
బభ్రువాహన (1964) .... ధర్మరాజు
మంచి మనిషి (1964)
పూజాఫలం (1964)
రాముడు భీముడు (1964)
నర్తనశాల (1963) .... ధర్మరాజు
తిరుపతమ్మ కథ (1963)
లక్షాధికారి (1963)
బందిపోటు (1963)
పరువు ప్రతిష్ఠ (1963)
శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) .... బలరాముడు
మహామంత్రి తిమ్మరుసు (1962)
గులేబకావళి కథ (1962)
గుండమ్మ కథ (1962) .... జమిందారు
దక్షయజ్ఞం (1962) .... బ్రహ్మదేవుడు
కులగోత్రాలు (1962) .... చలపతి
జగదేకవీరుని కథ (1961) .... ఇంద్రుడు
శ్రీ సీతారామ కళ్యాణం (1961) .... జనకుడు
రేణుకాదేవి మహత్యం (1960)
పెళ్ళి మీద పెళ్ళి (1959)
అప్పుచేసి పప్పుకూడు (1958)
మాయా బజార్ (1957) .... కర్ణుడు
సారంగధర (1957)
తెనాలి రామకృష్ణ (1956) .... కనకరాజు
సంతానం (1955)
పరివర్తన (1954)
మేనరికం (1954)
కన్నతల్లి (1953)
పుట్టిల్లు (1953)
పల్లెటూరు (1952)
పల్నాటి యుద్ధంలో కొమ్మరాజుగా నటించిన మిక్కిలినేని అనే కళావృక్షంలో సినీ జీవితం ఒక కొమ్మ మాత్రమే!

1999లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం పొందారు.

శ్రీ గరికిపాటి రాజారావు

ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షులు డా::శ్రీ గరికిపాటి రాజారావు గారి వర్ధంతి నేడే...
 డా:గరికపాటి రాజారావు గారు (ఫిబ్రవరి 5,1915 - సెప్టెంబరు 8,1963) తెలుగు సినిమా దర్శకులు, నాటకరంగ ప్రముఖులు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకులు.
ప్రజానాట్యమండలి సాంఘీక నాటకాలకు పెద్దపీట వేసింది. ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారు. చెప్పికోదగిన వారిలో దేవిక, అల్లు రామలింగయ్య, సంగీత దర్శకులు మోహన్ దాస్ మరియు టి.చలపతిరావులు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కరరావు మరియు బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ ఉన్నారు.
రాజారావు 1915 ఫిబ్రవరి 5వ తేదీన రాజమండ్రిలో గరికపాటి కోటయ్య, దేవరా రామలింగమ్మల దంపతులకు జన్మించారు.చిన్నప్పుడే కాకినాడలోని ఆదిభట్ల నారాయణదాసు హరికథకు వెళ్లి, పాటకు తగిన తాళం వేసి తన ప్రతిభను నిరూపించుకుని అభినందనలు పొందారు. చదువుకుంటున్న రోజుల్లో విచిత్ర వేషధారణలో ఆసక్తి చూపించిన రాజారావు, హరిశ్చంద్ర నాటకంలోనూ ఓ వేషం ధరించి పాఠశాల అధ్యాపకుల మెప్పు పొందారు. తరువాత విజయనగరంలో మేనమామ సుబ్రహ్మణ్యం ఇంట చేరి ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. రాజారావుకు 15వ ఏటనే నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. తండ్రి ఉద్యోగం చేసిన సికిందరాబాదు లాలాగూడ వర్క్‌షాపులో చిన్న గుమాస్తాగా జీవనం సాగిస్తూ, పై ఉద్యోగి పీడన భరించలేక దానికి రాజీనామా చేసి 1937లో మద్రాసు చేరారు. మద్రాసులో ఎల్‌.ఐ.యం చదువుతున్న రోజులో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి (పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు) డాక్టర్‌ రామదాసు ఈయనకు ప్రాణ స్నేహితులు. అలాంటి స్నేహ వాతావరణం యొక్క ప్రభావం వలన రాజారావు మార్క్సిస్ట్సు రాజకీయ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యారు.
మద్రాసలో చదువుతున్నప్పుడే సహ విద్యార్థులతో కలిసి గుళ్లపల్లి నారాయణమూర్తి రచించిన విడాకులు నాటకానికి దర్శకత్వం వహించారు. మద్రాసులో రాజారావు దర్శకత్వంలో ప్రదర్శించిన షాజహాన్ నాటకం సంచలనాన్ని సృష్టించింది. షాజహాన్‌గా ఎస్‌విఆర్ సాంబశివరావు, జహనారాగా డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు, ఔరంగజేబుగా రాజారావు అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు పొందారు. ఆ నాటకంలో రాజారావుకు సుప్రసిద్ధ నటుడు రూపశిల్పి దేవీప్రసాద్ రాయ్ చౌదరి మేకప్ చేయడం విశేషం. మద్రాసులో విద్యార్థులను సమీకరించి భమిడిపాటి బాగుబాగు, గాలి బాల సుందరరావు అపోహ వంటి నాటకాలను ప్రదర్శించారు
వృత్తి రీత్యా వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్యసేవలు అందించడానికి విజయవాడలోని పోరంకిలో ప్రజా వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తనే కొనుగోలు చేసి ఉచితంగా రోగులకు సేవ చేసేవారు. కొంతకాలం రాజమండ్రిలోనూ ప్రజావైద్యశాల నిర్వహించారు.
రాజారావు 1953లో పుట్టిల్లు సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్యం వహించారు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు జమున మరియు అల్లు రామలింగయ్యను వెండితెరకు పరిచయం చేశారు. పుట్టిల్లు సినిమాలో వివిధ నటులు తమ నటనకు ప్రశంసలందుకున్నా ఈ సినిమా ఆర్ధికంగా లాభించలేదు. దానితో రాజరావు ఆర్ధికంగా దెబ్బతిని అప్పులపాలయ్యారు. కానీ వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు సంఘసేవ మాత్రం ఆపలేదు. పేదవారికి ఉచితం వైద్యం చేస్తుండేవారు.
ఆ తరువాత ఈయన 1962లో విడుదలైన ఆరాధన వంటి సినిమాల్లో చిన్నాచితక పాత్రలు కూడా పోషించరు. ఆరాధనలో రాజశ్రీకి తండ్రి షావుకారు పాత్ర వేశారు. జైభవానీ నాటకాన్ని ప్రదర్శించే సమయంలో గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థులయ్యారు. అదే సమయంలో దేవుడుచేసిన మేలు చిత్రాన్ని నిర్మించినా ఆర్ధిక కారణాలవల్ల ఆ చిత్రం విడుదల కాలేదు. మానసికంగా కుంగిపోయిన రాజారావు గారు 1963 సెప్టెంబర్ 8న మద్రాసులో మరణించారు.ఆయనకు మా నివాళులు...!!💐

శ్రీ పీసపాటి నరసింహమూర్తి

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
తెలుగు నాటకరంగాన  శ్రీ పీసపాటి...
కృష్ణ పాత్రలో ఘనాపాటి...
తెలుగు నాటక రంగంపై శ్రీకృష్ణుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న నటులు. పద్యగానంలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న నటులు శ్రీ
శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు విజయనగరం జిల్లా బలిజిపేట మండలం, వంతరాం గ్రామంలో 1920, జూలై 10 న జన్మించారు. ప్రారంభంలో వారు ఆకాశవాణి లో పని చేశారు. 1938 లో రంగూన్‌రౌడీ నాటకంలో కృష్ణమూర్తి పాత్ర ద్వారా పీసపాటి నాటకరంగంలోకి అడుగుపెట్టారు. 1946 లో పాండవోద్యోగ విజయాలు నాటకంలో మొదటిసారిగా శ్రీకృష్ణుడి పాత్ర వేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు రెండు పర్యాయాలు సంగీత నాటక అకాడమీలో సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1993 లో ఆయనను కళాప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది. దాదాపు ఏడు దశాబ్దాలపాటు వేలాది ప్రదర్శనలు ఇచ్చిన పీసపాటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తిరుపతి వేంకటకవులు, విశ్వనాథ సత్యనారాయణ వంటివారు వీరిని ఎంతగానో అభినందించారు. ఎన్.టి.రామారావు గారు వీరి నటనను (కృష్ణ పాత్రను)చూసేవారు.
పాండవోద్యోగ విజయాలతో పాటు గౌతమబుద్ధ, లవకుశ, తారాశశాంకం, చింతామణి లాంటి నాటకాలు అనేకం ఆడినా పీసపాటికి ఎనలేని కీర్తి కృష్ణుని పాత్ర వల్లే వచ్చింది. అత్యుత్తమ కృష్ణునిగా ఉద్యోగవిజయాల నాటక రచయితల్లో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి నుంచి అవార్డు అందుకోవడం, టంగుటూరి ప్రకాశం నటరాజు విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వటం, బిలాస్‌పూర్ లో తెలుగురాని ఒక బెంగాలీ జంట నాటకం చూసి, గ్రీన్‌రూమ్‌లో ఆయనను తనివితీరా ముద్దాడడం తన జీవితంలో మరపురాని సంఘటనలుగా పీసపాటి పేర్కొన్నారు.
పద్యగానంలో పీసపాటి ప్రసిద్ధమైన మార్పులు తీసుకువచ్చారు. తెలుగు పౌరాణికాల్లో పద్యాలను సుదీర్ఘమైన రాగాలతో పాడడం అలవాటుగా ఉండేది. ఒక నిముషం పద్యానికి ఐదేసి నిముషాల రాగం తియ్యడం ఆనవాయితీగా ఉండేది. పీసపాటి ఆ పద్ధతిని విడనాడి, అనవసరమైన సాగతీతలను విసర్జించి, సాహిత్యానికి ప్రముఖ స్థానం కల్పిస్తూ పద్యం పాడి ప్రజలను అలరించారు. పీసపాటి కృష్ణుడి వేషధారణలో కూడా మార్పులు తీసుకువచ్చారు. దేహానికి అంటిపెట్టుకుని ఉండే నీలపు రంగు చొక్కా ధరించి నిజంగా నీలపు కృష్ణుడేననే భ్రమ కల్పించారు.
పీసపాటి 1987-1993 కాలం లో బొబ్బిలి మండలం రాముడువలస గ్రామానికి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్ని
పీసపాటి నరసింహమూర్తి 2007, సెప్టెంబర్ 28 న దివంగతులయ్యారు..

17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ దాసరి కోటి రత్నం

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
ప్రముఖ రంగస్థలనటి, తొలితరం తెలుగు సినిమా నటి, చిత్ర నిర్మాత. తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత.
 
 శ్రీ దాసరి కోటిరత్నం గారు, 1910లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో డిసెంబర్21 న జన్మించారు. తండ్రి రంగస్థల నటుడు కావడంతో చిన్నప్పటినుండే కోటి రత్నం గారికి నటనలో శిక్షణ ఇచ్చారు.. 9వ యేటనే రంగస్థలంలో అడుగుపెట్టి హరిశ్చంద్ర నాటకంలో లోహితస్య, బొబ్బిలి యుద్ధం నాటకంలో చిన్నరంగారావు, లవకుశలో కుశుడు, ప్రహ్లాదలో ప్రహ్లాద మొదలైన పాత్రలు ధరించారు. ఈమె నాటకాలలో నటిస్తూనే రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి వద్ద శాస్త్రీయ సంగీతంలోకూడా శిక్షణ పొందారు. అద్భుత నటనకు మధుర స్వరం తోడవటంతో మంచి నటీమణిగా పేరుతెచ్చుకున్నారు.

దాసరి కోటి రత్నం గారికి రంగస్థల నటిగా, గాయనిగా ఎనలేని ప్రఖ్యాతి ఉంది. ఈమె తొలి మహిళా నాటకసమాజ స్థాపకురాలు. ఈమె నాటకల్లో స్త్రీ పాత్రలతో పాటు అనేక పురుష పత్రాలు ధరించేవారు.. లవకుశ పాత్రలతో ఆరంభమైన ఆమె నటన రామదాసు, కంసుడు వంటి గంభీరమైన పురుష పాత్రలను కూడా వేసి మెప్పించారు. సావిత్రి నాటకంలో సత్యవంతుడు, సక్కుబాయి నాటకంలో కృష్ణుడు ఆమె ధరించిన పాత్రల్లో ప్రసిద్ధి చెందినవి. ఈమె సతీ అనసూయ, గంగావతరణం మొదలైన నాటకాల్లో నారదుని పాత్ర కూడా పోషించారు. పురుషులకు మాత్రమే పరిమితమైన రోజుల్లో స్వంతంగా నాటక సమాజాన్ని నిర్వహించారు. తల్లి మరణించిన తర్వాత ప్రత్తిపాడును వదిలి తాతగారి ఊరైన నక్కబొక్కల పాడుకు వెళ్లారు. అక్కడే నాటకసమాజం స్థాపించారు. నక్కబొక్కల పాడు చిన్న పల్లెటూరైనా కోటిరత్నం నాటక సమాజానికి అనతి కాలంలోనే మంచి పేరు వచ్చింది. ఈ సమాజం వేసిన నాటకాలు కొన్ని ఐదు సంవత్సరాల పాటు నిరవధికంగా ప్రదర్శించబడ్డాయి. ఐదేళ్ళ తర్వాత మకాం గుంటూరుకు మార్చి అక్కడ నాటక సమాజాన్ని కొనసాగించారు. ఈమె నాటక సమాజంలో పారుపల్లి సుబ్బారావు, తుంగల చలపతిరావు వంటివారు పనిచేసేవారు. ఈమె బృందలో పాతిక మంది దాకా స్త్రీ పాత్ర ఉండేవారని ప్రతీతి. ఎన్నో నాటకాలు అభ్యాసం చేసి, ఊరూరా ప్రదర్శించేవారు. అందరికీ కోటిరత్నం నెలవారీ జీతాలు ఇచ్చేవారు. నాటకాల్లో వచ్చిన పేరుతో ఆమె సినిమాల్లో ప్రవేశించారు.

1935లో తన నాటక బృందంతో కలకత్తా వెళ్ళి అక్కడ ఆరోరా ఫిలింస్‌ కంపెనీలో భాగస్వామిగా, బి.వి.రామానందం, తుంగల చలపతిరావులతో కలిసి భారతలక్ష్మి ఫిలింస్‌ అనే సంస్థను నెలకొల్పి, 'సతీసక్కుబాయి' చిత్రాన్ని నిర్మించారు.. ఇందులో కోటిరత్నం గారు టైటిల్ పాత్రలో సక్కుబాయిగా, తుంగల చలపతిరావు కృష్ణుడిగా నటించారు. టైటిల్‌ పాత్ర పోషించిన తొలి మహిళ కూడా ఆమే కావడం గమనార్హం. 1935లో విడుదలైన ఈ సినిమాకు చారుచంద్ర రాయ్ దర్శకత్వం వహించాడు. అదే కంపెనీ సహకారంతో, అహింద్ర చౌదరి దర్శకత్వంలో కోటిరత్నం గారు 'సతీ అనసూయ' అనే మరో చిత్రాన్ని నిర్మించి, అందులోనూ టైటిల్‌ పాత్రలో నటించారు.. ఇది ఆరోరా ఫిలింస్‌ పతాకంపైన నిర్మితమై 1935 అక్టోబరు 4న విడుదలైంది. ఆ తరువాత కోటిరత్నం గారు లంకాదహనం, మోహినీ భస్మాసుర, వరవిక్రయం, పాండురంగ విఠల, వరూధిని, పాదుకా పట్టాభిషేకం, గొల్లభామ, బంగారు భూమి, అగ్నిపరీక్ష మరియు చంద్రవంక మొదలైన సినిమాలలో నటించారు.

1958లో ఈమె అనారోగ్యం పాలై గొంతు దెబ్బతినడంతో నటనా అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగు సినిమా, నాటక రంగాలలో 45 సంవత్సరాల పాటు విశేషకృషి చేసిన కోటిరత్నం గారు  1972, డిసెంబరు 21 న చిలకలూరిపేటలో శివైక్యం పొందారు.

శ్రీ మద్దాల రామారావు

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
నేటి మన చిరస్మరణీయులు శ్రీ మద్దాల రామారావు...
తెలుగు నాటకరంగం లో..
అందునా పౌరాణిక నాటకరంగంలో..సుప్రసిద్ధుడైన నటులు..శ్రీ మద్దాల రామారావు.పౌరాణిక నాటకాలలో..ప్రతినాయకుడి పాత్రకు ఎంతో గౌరవం తెచ్చిపెట్టి..వాటినే నాయక పాత్రలుగా మలిచి..ప్రేక్షకులచేత  బ్రహ్మరథం పట్టించుకొని.. ఎనలేని గౌరవప్రతిష్ఠలు పొందిన..
 గొప్ప నటులు. భీకరాకృతితో...కంచులాంటి కంఠముతో.. గంభీరమైన వాచకముతో...వికటాట్టహాసలలతో... అనితరసాధ్యమైన సుదీర్ఘ సమాసాల ఉచ్చారణ విలాసములతో సాగి భయోప్తాతము కలిగించు ఘర్జనలతో... హావభావములతో సాగే  ప్రతినాయక పాత్రల్లో వీరి నటన చూసియే తీరవలేను..వర్ణింప నసాధ్యము..  మద్దాల రామారావు.ఆంధ్రప్రదేశ్ లోనూ..తెలంగాణలోనే కాదు..పశ్చిమబెంగాల్,
ఒరిస్సా,తమిళనాడు,కర్ణాటకరాష్ట్రాలలోనూ..వందలాది ప్రదర్శనలు ఇచ్చి..ప్రేక్షకులను మెప్పించిన ఘనత వారికే చెందుతుంది.
పశ్చిమగోదావరి జిల్లా..గణపవరం మండలం..
జల్లికొమ్మర లో..6-9-1933న కీర్తిశేషులు మద్దాల వెంకన్న..మహంకాళి దంపతుల..జ్యేష్ఠ పుత్రుడిగా 
జన్మించారు..రామారావు.పెద్దచదువులు చదవకపోయినా..స్వయంప్రతిభతో ఆయన నాటక ప్రస్థానం సాగింది. చాలా చిన్న వయసులోనే కీర్తిశేషులు టేకు సుబ్బారావు నిర్వహించే "లవకుశ"
నాటకంలో లవుడి పాత్రలో తళుక్కున మెరిసారు.
అదొక గొప్ప ముహూర్తం.నాటక రంగంతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది.
కాలక్రమంలో..బాలుడు యువకుడయ్యాడు.
అనుకోకుండా పల్నాటి యుద్ధం నాటకంలో నరసింగరాజు వేషం వేయడం..అందరి దృష్టి అటే నిలవడంతో..మద్దాల వారి అడుగులు ప్రతినాయక పాత్ర వైపే సాగాయి.అప్పుడే సుప్రసిద్ధ నాటకకర్త ..ప్రయోక్త అయిన ప్రగడ భద్రం గారి..తులసి జలంధర నాటకంలో..జలంధరుడిగా
నటించడం ఆరంభం అయ్యింది.అదొక ప్రసిద్ధనాటకం అయ్యింది.దీని తరువాత నాటకం భూకైలాస్.దాని తరువాత భస్మాసుర నాటకం వారికి ఎంతో కీర్తి తెచ్చిపెట్టాయి.ఇక..కురుక్షేత్రం నాటకం గురించి చెప్పాల్సి వస్తే..మద్దాల వారిది దుర్యోధన పాత్ర.కీర్తిశేషులు షణ్ముఖి ఆంజనేయరాజు గారిది..శ్రీకృష్ణ పాత్ర.ఇద్దరు మహానుభావుల్ని అలా వేదిక పైన చూడగలడం నిజంగా అదృష్టమే అని చెప్పాలి..వీరి కి రంగ మార్తాండ బిరుదు కలదు.
తెలుగు పౌరాణిక నాటకాన్ని వెలిగించిన మహానుభావుడు మద్దాల.సినీ రంగంలో  ప్రతినాయకుడు పాత్రల్లో ఎన్టీఆర్...ఎస్వీఆర్ ల్లా ... తెలుగు రంగస్థలములో...శ్రీ మద్దాల వారికీ..శ్రీ ఆచంట వారికీ రారాజుల్లా.. నీరాజనాలు  తెలుగు ప్రేక్షజులు పట్టే రంటే అతిశయోక్తి ఏమాత్రం లేదు ...ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీరిని కళారత్న బిరుదుతో ఘనంగా సత్కరించారు..వీరు తన 85 ఏట.6-2-2017న శివైక్యం పొందారు...
వారి కుమారుడు ఉదయభాను తన తండ్రిగారి.. వారసత్వాన్ని  కొనసాగిస్తున్నారు.

శ్రీ పనారస(సురభి) గోవిందరావు

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
తెలుగు జాతికి నవరసాల "#సురభి"ని పంచిన #వనారస...!!
వినోదాలతో జాతికి ఆనందాన్ని అందించిన భరోసా...!!
శ్రీ వనారస గోవిందరావు   కడప మండలము హానుమథ్గుండము అనుగ్రామమున తోట బలిజ వంశమునన..గంపరామన్న, పకీరమ్మ దంపతులకు కడు పేద కుటుంబంలో జన్మించారు. వీరి పెంపుడు తలిదండ్రులు సుంకమ్మ, వెంకోజీరావులు. గోవిందరావు అసలు పేరు పకీరప్ప. పెంపుడు తలిదండ్రులు పెట్టిన పేరు గోవిందప్ప. అదే గోవిందరావుగా మారింది.
ఆంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యులతో వనారస గోవిందరావు, 1929
శ్రీ గోవిందరావు
వెంకోజీరావు గారి దగ్గర సంగీతం, ఫేడేలు, నంద్యాల జ్యోతి సుబ్బయ్య కంపెనీలో చేరి పాటలు నేర్చుకున్నారు. ఆ కంపెనీలో వేసిన మొదటివేషం సత్యహరిశ్చంద్రలోని విశ్యామిత్రుడు.
మద్రాసులో నాటకాలను చూసిన గోవిందరావు తను కూడా స్టేజి నాటకాలు వేయాలని అనుకొని, సురభి గ్రామంలో కీచకవధ నాటకం ప్రదర్శించారు. అందులో గోవిందరావు నకులుడి పాత్ర ధరించారు. తరువాత కాలంలో  ‘శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సభే నేటి సురభి కంపెనీలకు మాతృసంస్థ.
తరువాత కంపెనీని సంచాల నాటక రంగంగా రూపొందించి, సంచారానికి పనికివచ్చే రేకులు, విద్యుత్ దీపాలు, వైర్ వర్క్ సామాగ్రి సంపాదించి పెద్దఎత్తున్న వివిధ ప్రాంతాలలో నాటక ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. రంగూన్ లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. స్త్రీలు నాటకాలలో నటించకూడదని అంటున్నకాలంలో తన భార్యాబిడ్డలను నాటకాలలో నటింపజేసి, సురభి నాటక సమాజాన్ని నాట్యశాస్త్ర విహిత సమాజంగా తీర్చిదిద్దారు.
1917లో భీమవరంలో అంకాదహనం నాటకంలో ఆంజనేయ పాత్రలో నటిస్తుండగా గోవిందరావు ధరించిన దుస్తులకు నిప్పంటుకొని దేహం కాలిపోయింది. నాటకాలలో నటించడానికి పనికిరాని పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ సమాజాన్ని వదిలిపెట్టలేదు. హస్యం చేప్పేవారు. కాంతామణి నాటకంలో దొంగవేషం వేసి అద్భుతంగా నటించేవారు. అందుకే నాటక ప్రదర్శన కరపత్రాలలో ‘కంపెనీ ప్రొప్రెయిటర్ చే దొంగవేషం ధరింపబడును’ అని అచ్చు వేసేవారు.
1929నాటికే ఆంధ్రదేశంలో నాటకకళ క్షీణదశ ప్రారంభమైందని గ్రహించి దానిని సరైన మార్గంలో పెట్టడానికి పెద్దలతో కలిసి ఆంధ్ర నాటక కళా పరిషత్తు స్థాపించారు. ఆ సమయంలోనే ఆ పరిషత్తు ఆయనకు ‘ఆంధ్రనాటక కళోద్ధారక’ బిరుదుతో సన్మానించింది.
చివరిదశలో ఏలూరు దగ్గర పొలసనపల్లిలో స్థిరనివాసం ఏర్పరుచుకొని చాలా దానధర్మాలు చేశారు.ఈ గ్రామము బీమడోలు నుండి చిన్న తిరుపతి వెళ్లే మార్గములో ఉన్నది... ఆ ఊరి పాఠశాల శ్రీ గోవిందరావు గారి దాతృత్వానికి గుర్తు గా మిగిలి ఉంది..ఆ గ్రామములో వీరి శిలా ప్రతిమ నెలకొల్పారు కళాభిమానులు... ఎన్నో గొప్ప కళారూపాలు ప్రదర్శించే థియేటర్ , ఏలూరు లో కల YMH హాలు నందు వీరి ప్రతిమ ఇప్పటికి మనల్ని పులకరిస్తుంది .. ఆయన శిలా విగ్రహాన్ని కళాకారులు ఏలూరులో ప్రతిష్ఠించారు.
ధరించిన పాత్రలు
విశ్వామిత్రుడు, నకులుడు, ఆంజనేయుడు, దొంగ, అర్జునుడు (సుభద్ర), రాజరాజ నరేంద్రుడు, హరిశ్చంద్రుడు, అనిరుద్ధుడు, రావణుడు, శ్రీరాముడు (సంపూర్ణ రామాయణం), విక్రమార్కుడు, బిల్వ మంగళుడు, జగన్మోహనుడు, హిరణ్యకశిపుడు, రుక్మాంగదుడు.
తన పూర్తి జీవితాన్ని నాటకరంగానికి, నాటకోద్ధరణ కోసం ధారపోసిన  శ్రీ వనారస... ౼(వికీపీడియా సౌజన్యంతో)

శ్రీ పీసపాటి నరసింహమూర్తి

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
తెలుగు నాటకరంగాన  శ్రీ పీసపాటి...
కృష్ణ పాత్రలో ఘనాపాటి...
తెలుగు నాటక రంగంపై శ్రీకృష్ణుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న నటులు. పద్యగానంలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న నటులు శ్రీ
శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు విజయనగరం జిల్లా బలిజిపేట మండలం, వంతరాం గ్రామంలో 1920, జూలై 10 న జన్మించారు. ప్రారంభంలో వారు ఆకాశవాణి లో పని చేశారు. 1938 లో రంగూన్‌రౌడీ నాటకంలో కృష్ణమూర్తి పాత్ర ద్వారా పీసపాటి నాటకరంగంలోకి అడుగుపెట్టారు. 1946 లో పాండవోద్యోగ విజయాలు నాటకంలో మొదటిసారిగా శ్రీకృష్ణుడి పాత్ర వేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు రెండు పర్యాయాలు సంగీత నాటక అకాడమీలో సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1993 లో ఆయనను కళాప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది. దాదాపు ఏడు దశాబ్దాలపాటు వేలాది ప్రదర్శనలు ఇచ్చిన పీసపాటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తిరుపతి వేంకటకవులు, విశ్వనాథ సత్యనారాయణ వంటివారు వీరిని ఎంతగానో అభినందించారు. ఎన్.టి.రామారావు గారు వీరి నటనను (కృష్ణ పాత్రను)చూసేవారు.
పాండవోద్యోగ విజయాలతో పాటు గౌతమబుద్ధ, లవకుశ, తారాశశాంకం, చింతామణి లాంటి నాటకాలు అనేకం ఆడినా పీసపాటికి ఎనలేని కీర్తి కృష్ణుని పాత్ర వల్లే వచ్చింది. అత్యుత్తమ కృష్ణునిగా ఉద్యోగవిజయాల నాటక రచయితల్లో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి నుంచి అవార్డు అందుకోవడం, టంగుటూరి ప్రకాశం నటరాజు విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వటం, బిలాస్‌పూర్ లో తెలుగురాని ఒక బెంగాలీ జంట నాటకం చూసి, గ్రీన్‌రూమ్‌లో ఆయనను తనివితీరా ముద్దాడడం తన జీవితంలో మరపురాని సంఘటనలుగా పీసపాటి పేర్కొన్నారు.
పద్యగానంలో పీసపాటి ప్రసిద్ధమైన మార్పులు తీసుకువచ్చారు. తెలుగు పౌరాణికాల్లో పద్యాలను సుదీర్ఘమైన రాగాలతో పాడడం అలవాటుగా ఉండేది. ఒక నిముషం పద్యానికి ఐదేసి నిముషాల రాగం తియ్యడం ఆనవాయితీగా ఉండేది. పీసపాటి ఆ పద్ధతిని విడనాడి, అనవసరమైన సాగతీతలను విసర్జించి, సాహిత్యానికి ప్రముఖ స్థానం కల్పిస్తూ పద్యం పాడి ప్రజలను అలరించారు. పీసపాటి కృష్ణుడి వేషధారణలో కూడా మార్పులు తీసుకువచ్చారు. దేహానికి అంటిపెట్టుకుని ఉండే నీలపు రంగు చొక్కా ధరించి నిజంగా నీలపు కృష్ణుడేననే భ్రమ కల్పించారు.
పీసపాటి 1987-1993 కాలం లో బొబ్బిలి మండలం రాముడువలస గ్రామానికి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్ని
పీసపాటి నరసింహమూర్తి 2007, సెప్టెంబర్ 28 న దివంగతులయ్యారు..

శ్రీ పువ్వుల సూరిబాబు

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
శ్రీ పువ్వుల సూరిబాబు
అలనాటి సుప్రసిద్ధ తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త.
వీరు ఫిబ్రవరి 22, 1915 సంవత్సరంలో గుడివాడ తాలూకా బొమ్మలూరు గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే మేనమామ హనుమాన్లు గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. నాటకాల మీద మోజుతో గద్వాల పారిపోయి, సంస్థానపు నాటక సమాజంలో చేరి పాత్రలు పోషించి తిరిగివచ్చారు.
ఆనాడు గుంటూరులో దంటు వెంకటకృష్ణయ్య "బాలమిత్ర సభ" పేరుతో చిన్నపిల్లల నాటక సమాజాన్ని నడుపుతున్నారు. అందులో కొప్పరపు సుబ్బారావు గారు నాటక ప్రయోక్తగా, సంగీత దర్శకులుగా శిక్షణ ఇస్తున్నారు. సూరిబాబు ఈ సభలో చేరి వివిధ వేషాలు పోషించి అనతికాలంలోనే అగ్రశ్రేణి నటుడిగా పేరుపొందారు. ఆనాటి నాటక సమాజాల వారు సూరిబాబు కోసం పోటీపడేవారు.
నాటక సమాజ
సూరిబాబు 1931 సంవత్సరంలో బాలకృష్ణ నాటక సమాజాన్ని గుడివాడలో స్థాపించి భక్త విజయం, మాయా మధుసూదన నాటకాలను పెద్ద ఎత్తున ప్రదర్శించారు. నష్టాలతో సమాజం మూతపడింది. 1936లో తెనాలి చేరి సత్యనారాయణ నాట్యమండలి పేరుతో నాటకాలను ప్రదర్శించారు.
1944 సంవత్సరంలో నటీమణి రాజరాజేశ్వరిని వివాహం చేసుకొని ఆమె పేరుమీద రాజరాజేశ్వరి నాట్యమండలిని స్థాపించి కొప్పరపు సుబ్బారావు గారితో "తారా శశాంకం" నాటకాన్ని వ్రాయించి తానే దర్శకత్వం వహించి చనిపోయేవరకు 15 వందలకు పైగా నాటకాలు ఆంధ్రదేశమంతా ప్రదర్శించారు. ఇది కాక భూకైలాస్, కురుక్షేత్రం, విప్రనారాయణ, తులాభారం మొదలైన పౌరాణిక నాటకాలను భారతదేశమంతా ప్రదర్శించి అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించారు.
వీరు చాలా విభిన్నమైన పాత్రలను పోషించారు. వాటిలో నారదుడు, కంసుడు, ధర్మరాజు, విప్రనారాయణ, బిల్వమంగళుడు, భవానీశంకరుడు, రాజరాజు, సుబుద్ధి, రామదాసు, చినరంగారావు, ధర్మారాయుడు మొదలైనవి ముఖ్యమైనవి. ఎన్ని నాటకాలాడినా, ఆయన గాత్రం కంచు గంటలా మారుమ్రోగేది. మైక్ లేకపోయినా ఒక ఫర్లాంగు దూరం వరకు పద్య పఠనము, వాచిన విధానము క్లియర్ గా వినపడేవి. పద్యాన్ని భావయుక్తంగా విరిచి పాడడంతో ప్రేక్షకులను అవలీలగా ఆకట్టుకొనేవారు.
1946లో మైసూరు మహారాజావారి దర్బారులో వీరి నాటకాలను ప్రదర్శించి సన్మానం పొందారు. 1957లో తెనాలిలో సూరిబాబుకి గజారోహణం, గండపెండేరం మొదలైన సన్మానాలు జరిపి కళావిశారద, గాన గంధర్వ మొదలైన బిరుదులు అందుకున్నారు.

సినీ ప్రస్థానం
దక్షయజ్ఞం (1962) (నటుడు మరియు గాయకుడు)
ఉషా పరిణయం (1961)
శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం (1960) (నటుడు మరియు గాయకుడు)
కృష్ణ లీలలు (1959) (నటుడు)
సతీ సావిత్రి (1957) (నటుడు)
శ్రీకృష్ణ తులాభారం (1955) (నటుడు)
జీవన ముక్తి (1942)
తారా శశాంకం (1941) (నటుడు మరియు గాయకుడు)
రైతు బిడ్డ (1939) (నటుడు)
మాలపిల్ల (1938) (నటుడు మరియు గాయకుడు)
కనకతార (1937
భారతదేశమంతా అపార ఆదరాభిమానాలను సంపాదించిన సూరిబాబు ఫిబ్రవరి 12, 1968 న స్వర్గస్తులైనారు.

శ్రీ బందా కనకలింగేశ్వరరావు

ఈనాటి చిరస్మరణీయులు లలిత కళాస్రష్ట  శ్రీ కనకలింగేశ్వరరావు బందా...
 వీరు అభినివేశం లేని రంగం అసలు ఉందా....!!?? 

కనకలింగేశ్వరరావు గారు
వీరు జనవరి 20, 1907
కృష్ణా జిల్లాలోని ఆటపాక గ్రామంలో  జన్మించారు..
ఈయన సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, వ్యాస రచయిత,నాట్యకళా పోషకుడు.
1964 లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును గెలుపొందారు.. వీరు ఆటపాకలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత బందరు నోబుల్ కళాశాల చదివి, మద్రాసు లా కళాశాల నుండి 1932 లో బి.ఎల్. పట్టా పుచ్చుకున్నారు. 1934లో మొదట న్యాయవాదిగా పనిచేసి, తరువాతి కాలంలో నాటక ప్రదర్శనమే వృత్తిగా చేసుకున్నారు. ఈయన నాటకాలలో అనేక పాత్రలు పోషించారు. వాటిలో బాహుకుడు, బిల్వమంగళుడు ఈయనకు స్వయంగా ఇష్టమైనవి.

వీరు ఏలూరులో 1938లో నాటక కళాశాలను స్థాపించి పలువురు నటులకు శిక్షణ ఇచ్చారు. ప్రభాత్ థియేటర్ అనే సంస్థను స్థాపించి నాటక ప్రయోక్తగా నూతన ప్రదర్శన రీతులను ప్రవేశపెట్టారు.

ఈయన తెలుగు సినిమా ప్రపంచంలో మొదటి తరం సినిమాలైన బాల నాగమ్మ, ద్రౌపదీ మానసంరక్షణం, పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా), సారంగధర (1937 సినిమా) సినిమాలలో నటించారు.

వీరు కూచిపూడి నాట్యకళకు ఎనలేని సేవచేశారు. ప్రభుత్వ సాయంతో కూచిపూడి గ్రామంలో సిద్ధేంద్ర కళాక్షేత్రం నెలకొల్పి నిర్వహించారు. ఈ కళ గురించి ప్రముఖ పత్రికలలో వ్యాసాలు రాసి దాని ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేశారు.1956 లో ఆకాశవాణిలో నాటక ప్రయోక్తగా పనిచేసి మంచి నాటకాలను, నాటికలను ప్రసారం చేశారు. వీరు ఆటపాక గ్రామంలో ఒక శివాలయాన్ని, ఒక చెరువును తవ్వించారు, ఒక వేద పాఠశాలను స్థాపించారు.

ఈయన 1964 లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును గెలుపొందారు. వీరి ఉత్తమ నటనకు రాష్ట్రపతి అవార్డు లభించింది.
వీరు 1968 సంవత్సరంలో డిసెంబర్ 3 వ తేదీన పరమపదించారు.
వీరికిఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు కలరు.
వీరి జన్మ శతాబ్ది ఉత్సవాలను హైదరాబాదులో 2006-07 సంవత్సరాలలో ఘనంగా నిరహించారు.వీరికి గుర్తుగా వీరి పేరు మీద ఎర్పరచిన బందా కనకలింగేశ్వరరావు అవార్డును రంగస్థల అభినవ కృష్ణులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి నట సమ్రాట్ అక్కినేని వారి చేతులమీద అందించబడ్డది..

శ్రీ వల్లూరి వెంకటరామయ్య చౌదరీ

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
కాపాళీ...!!!కాపాళీ...!!! (ఓ.....ఓ.....ఓ.....మ్) వుహ్హ...హ్హ..హహ్హ..హహ్హ...హ్హ...!!
నీవు నన్ను ఆదేశించిన ప్రకారము గందభేరుండమును  చంపి..దాని రక్తంలో వెయ్యి సార్లు స్నానం చేశా...!!
ఇక నాకు చావు లేదు కదూవ్....!!చావు లేదు కదూవ్...!!లేదు కదూవ్....!!(లే.......... దు...)
వుహహ్హ...హ్హ...హ్హ...హ్హ...హ్హ..!!మాయలపఖీరు కిక చావు లేదు.....!!మాయలపఖీరు కిక చావు లేదు...
ఫఖీరు అమరుడు....!!
ఫఖీరు అమరుడు....!!....
వుహహ్హ...హ్హ...హ్హ..........వుహహ్హ...హ్హ...హ్హ......!!!!!!

ఎవరి నాటకానికైతే గర్భిణీస్త్రీలు...గుండెజబ్బు ఉన్నవారు...చిన్న పిల్లలకూ ప్రవేశము లేదనినిర్వాహకులు అలనాడు ప్రకటించే వారో...అట్టి భయంకర...బీభత్స...నటనతో..
ఆంధ్ర దేశం యాత్తూ తన కంచు కంఠంతో...
వికట్టాట్టహాసాలతో...భీకర వదనంతో....
భయంకర హావభావాలతో ఆబాలగోపాలాన్నీ అల్ల ల్లాడించిన ఓ.. వల్లూరి వెంకట్రామయ్య చౌదరీ....!!
నీ కిదే మా ప్రణామాంజలీ...!!💐

శ్రీ వల్లూరి వెంకట్రామయ్యచౌదరి... ప్రముఖ రంగస్థల నటుడు. ఆంధ్ర డ్రమెటిక్ అమెచ్చూర్ స్థాపకులలో ముఖ్యులు...
ప్రసిద్ధ
రంగస్థల నటులు..
వీరు 1925, మే 11న సౌభాగ్యమ్మ, అంజయ్య దంపతులకు గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని కొలకలూరులో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ప్రాథమిక విద్య సొంత వూరులోనే సాగింది.
వీరి పెదనాన్న వెంకటరామయ్య నటుడు, దుగ్గిరాల కంపెనీలో వివిధ పాత్రలను పోషించేవారు. అంతేకాకుండా వీరి పాఠశాల పంతులు ముకుందరామయ్ సహజ నటుడు, గాయకుడు. పెదనాన్న, పంతులు ప్రభావంవల్ల వెంకట్రామయ్య నాటకంపై అనురక్తిని పెంచుకొని పాఠశాల వార్షికోత్సవాల సందర్భంగా శ్రీకృష్ణ రాయబారం నాటకంలో దుర్యోధన పాత్రను పోషించి, ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు.

ఒకరోజు పాఠశాలకు ఆలస్యంగా వెళ్లినందుకు పంతులు దండించడంతో స్కూల్ విద్యకు స్వస్తిపలికి, నటనవైపు దృష్టి మళ్లించారు. ఎమ్.ఎన్. రాయ్ రాడికల్ పార్టీలో చేరి, ఆ పార్టీకి సంబంధించిన గేయాలను శ్రావ్యంగా పాడేవారు. ప్రముఖ హేతువాది త్రిపురనేని రామస్వామి చౌదరి సంస్కరణలపట్ల ఆకర్షితుడై ఆయన అభిమానాన్ని చూరగొన్నారు.

త్రిపురనేని రామస్వామి చౌదరి రచించిన శ్రీరామ రావణ యుద్ధం నాటకంతో వల్లూరు నటజీవితం ప్రారంభమైంది. బాలనాగమ్మ లో ఫకీరుగానూ, రామాంజనేయ యుద్ధంలో యయాతిగానూ, సక్కుబాయిలో శ్రీకృష్ణుడుగానూ, సత్యహరిశ్చంద్రలో నక్షత్రకుడిగా నటించారు. మిత్రులైన డి.వి. సుబ్బారావు, రత్నాకరరావు, పగడాల రామారావు, జానకీదేవి, రాజకుమారి, కృష్ణవేణిలతో కలసి ఒక నాటక సంస్థను స్థాపించారు. ఆ సంస్థ తరపున బాలనాగమ్మ, భక్త శబరి, నటనాలయం, వీరపాండ్య కట్టబ్రహ్మన్న మొదలైన నాటకాలను ప్రదర్శించారు. బాలనాగమ్మ నాటకం ప్రదర్శించేటపుడు ఫకీరు పాత్రలో ఉన్న వల్లూరు వెంకట్రామయ్యను చూసి, పిల్లలు, పెద్దలు దడుచుకునేవారు. గర్భణీ స్త్రీలు, చిన్నపిల్లలు రాకూడదని నిర్వాహకులు ముందుగానే తెలిపేవారు. ఈ పాత్ర ఆయనకు బాగా పేరు తెచ్చింది. ఆయన ‘జై కపాళీ’ అనీ గంభీరమైన కంఠంతో అన్నపుడు రెండు మూడు కి.మీ.ల దాకా వినపడేది. ఈ పాత్రను ఇంత గంభీరంగా నటించి మెప్పించినవారు ఆంధ్ర నాటకరంగంలోలేరు. ఈ నాటకాన్ని పల్లెపల్లెకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.
ఆంధ్రరసాలిని సంస్థ తరపున ఆలపాటి వెంకట్రామయ్య కళాపరిషత్తులో నటనాలయం నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించారు.

శ్రీ పులిపాటి వెంకటేశ్వర్లు

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
నేటి మన చిరస్మరణీయులు.
నాటి అర్జున పాత్రలో మేటి...
శ్రీ వెంకటేశ్వర్లు పులిపాటి... 
 
తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు, ఆంధ్రనాటక కళాపరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులు.వీరు
సెప్టెంబర్ 15, 1890 న జన్మించారు.
పాఠశాలలో చదువుతున్నప్పుడే 11వ ఏట రంగస్థలం పై ప్రవేశించారు. పద్య నాటకం పట్ల అభిమానం ఏర్పరుచున్న పులిపాటి తెనాలి రామ విలాస సభలో సభ్యుడిగా చేరారు. స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వర రావు, బళ్ళారి రాఘవ, ఉప్పాల వెంకటరత్తయ్య వంటి మహామహుల సరసన మద్రాసు, మైసూరు, మహారాష్ట్ర, బెంగాల్ వంటి ప్రాంతాల్లో ప్రదర్శనలనిచ్చారు.
నటులు రాగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రదర్శనలు జరుగుతున్న నాటకాలలో అర్జునుడు, నక్షత్రకుడు, భవానీ శంకరుడు, సుబుద్ధి, చెకుముకి శాస్త్రి, వెంగళరాయడు, భరతుడు, నారదుడు పాత్రలను పోషించడమే కాక, 1932లో సినిమా రంగంలో ప్రవేశించి చింతామణిలో భవానీ శంకరుడు, హరిశ్చంద్రలో నక్షత్రకుడు, సారంగధరలో సుబుద్ధి, పాశుపతాస్త్రంలో నారదుడుగా నటించారు. మోహినీ రుక్మాంగద, సతీ తులసి, చంద్రహాస, తల్లిప్రేమ, విష్ణుమాయ చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఈయన మొత్తం పన్నెండు సినిమాలలో నటించారు..

వీరికి రెండుసార్లు గజారోహణ సన్మానం జరిగింది. 1960లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది. ఈయన 1972 సం:లో గుంటూరు జిల్లా తెనాలిలో దివంగతులయినారు...

ఈలపాట రఘురామయ్య

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
"ఎవరి పాట అయితే విని నైటింగేల్ ఆఫ్ ఆంధ్ర" అని విశ్వకవి రవీంద్ర నాధ్ ప్రస్తుతించారో....
ఎవరి నటనైతే చూచి సాక్షాత్ రఘు రాముడివే నీవని కాశీనాధుని నాగేశ్వరరావు గారు పాత్ర పేరు పెట్టి మెచ్చుకున్నారో....
ఎవరి ఈలపాట అయితే విని ఆయన వేళ్ళ మధ్య పరికరం ఏమన్నా ఉందా..!!?? అని ప్రధాని  జవహర్ లాల్ నెహ్రు ఆశ్చర్యం తో ఆడిగారో....
 ఆ #ఈలపాట #రఘురామయ్య గారే  మా తెలుగు నాటక రంగ  వైభవం ఈ నాడు గుర్తుకుతెచ్చుకుంటున్న "#చిరస్మరణీయులు...  
మనం ఈలపాట  రఘురామయ్య  అని పిలుచుకునే ఈయన అసలు పేరు కల్యాణం చిన వెంకటసుబ్బయ్య.ఆయన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో 1901 మార్చ్ 5వతారీఖున కల్యాణం నరసింహా రావూ,సుబ్బమ్మ దంపతులకు అయిదవ సంతానంగా జన్మించాడు.వారు మొత్తం ఎనిమిది మంది సంతానం.ఇతని కంటే పెద్దతని పేరు కూడా వెంకటసుబ్బయ్య కావడంతో ,ఇతనిని చిన వెంకటసుబ్బయ్య అని పిలిచే వారు.
చిన్నప్పటినుండీ చదువుకు దూరంగానూ,ఆటపాటలకు దగ్గరగానూ గడిపేవారు.

ఏవో కూని రాగాలు తీస్తూ,లొల్లాయి పదాలు పాడుతూ,ఊళ్లో ఏ సన్నాయి మేళం కనపడినా వారి వెంటబడిపోతూ,ఊరి వెంట బలాదూరుగా తిరుగుతున్న ఆయన్ని గొర్రెలను కాసేపనిలో పెట్టారట తల్లిదండ్రులు.తల్లి చాలా గారాబంగా చూసేదట ,అందరికీ జొన్నన్నమైతే ఇతనికి వరన్నం,మీగడపెరుగూ పెట్టేదట.

అలా గొర్రెలను కాచుకుంటూ యేవో తోచిన పాటలు పాడుకుంటూ తిరిగే ఆయన,తోటి గొర్రెలకాపరులను పిలవడానికి ఒక రోజు ఈల వేశాడట.అది చాలా ప్రత్యేకంగా తోచిన మిత్రులు"ఇదేదో భలేగా వుందే"అని మెచ్చుకుంటే ,ఈలమీద పాటలూ,రాగాలూ కూడా తీసి వినిపించాడట.ఇలా చినవెంకటసుబ్బయ్య పద్యాలూ,పాటలూ బాగా పాడుతున్నాడని తెలుసుకున్న,వారి ఊరి వాడే అయిన దంటు వెంకట కృష్ణయ్య ,తన స్నేహితుడూ ప్రఖ్యాత నటుడూ అయిన యడవల్లి సూర్య నారాయణకి అప్పగించాడు. యడవల్లి .సూర్యనారాయణ గుంటూరులో వుండేవాడు,ఆయన "నాటక పితామహ"అని పిలుచుకునే హరిప్రసాదరావు శిష్యుడు.

ఆయన ఆ సమయంలో "రామదాసు"నాటకంలో రామదాసు కొడుకు రఘురాముడు వేషం వేసేందుకు ,బాగా పాడగల బాలనటుడి కోసం వెతుకుతున్నాడు. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టనిపించిందాయనకు.చదువుసంధ్యా లేని చిన సుబ్బయ్య లో అధ్భుతమైన గాన ప్రతిభ దాగి వుందని గమనించాడాయన .అతనికి మంచి తర్ఫుదు ఇచ్చి మంచి నటుడుగానూ ,గాయకుడుగానూ తీర్చిదిద్దాలనుకున్నాడు.అతని పాట విన్న వెంటనే తన జేబులోనుండి ముఫ్ఫయి రూపాయలు తీసి ఇచ్చారు. పారితోషికంగా.ఆ డబ్బుతో అతని తండ్రి సుద్దపల్లిలో మూడెకరాలు పొలం కొన్నాడట. ఇదంతా జరిగేటప్పటికి చిన వెంకట సుబ్బయ్యకి ఏడెనిమిది సంవత్సరాల వయస్సు.అప్పటి నుండీ ఆయన తన దగ్గరే వుంచుకుని అతనికి పాడటంలో,నటనలో మంచి శిక్షణ నిచ్చాడు.పొద్దున లేచిన దగ్గరనుండీ వివిధ రాగాలలోని పద్యాలూ,పాటలూ వినడం,రాగాలు గుర్తించటం,సాధన చేయడం,సంభాషణలు ,పలకడం మళ్లీ సాయంత్రం రిహార్సల్సూ.ఇటువంటి శిక్షణలో చిన వెంకట సుబ్బయ్య సానబెట్టిన వజ్రంలా తయారయ్యారు.

యడవల్లి సూర్యనారాయణగారి "రామదాసు, శకుంతల,కృష్ణ లీలలు"లోని బాలపాత్రలు వరసగా "రఘురాముడు,భరతుడు,శ్రీకృష్ణుడు "పాత్రలు ధరిస్తూ పద్యాలూ,పాటలూ అవలీలగా పాడుతూ మంచి పేరు తెచ్చుకుని "గాన బాలసరస్వతి "అనే బిరుదుకూడా తన గురువు గారి గురువైన హరిప్రసాద రావు గారి చేతుల మీదుగా అందుకున్నారు.
మరి ఈ చిన వెంకట సుబ్బయ్య "రఘురామయ్య "ఎలా అయ్యాడంటే,యడవల్లి బృందం ఆంధ్ర దేశంలోనే కాక చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పర్యటిస్తూ తమ నాటకాలను ప్రదర్శించే వారు ,అలా వారు మద్రాసు లో 1912సం"లో విక్టోరియా హాలులో "రామదాసు "ప్రదర్శి స్తున్నపుడు,రామదాసు కొడుకుగా నటిస్తున్న చినవెంకట సుబ్బయ్య ధాటీగా ,పద్యాలూ,పాటలూ పాడుతుంటే అతిథి గా వచ్చిన కాశీనాథుని నాగేశ్వరరావుగారు చూసి ఎంతో మెచ్చుకుని కొంత డబ్బూ ,ఒక బంగారు గొలుసూ ప్రదానం చేసి "రఘురాముడంటే ఇతనే "అన్నారట.ఆనాటి నుండీ అందరూ ఆయన్ని "రఘురామయ్య "అని పిలవ సాగారు.

చిన్నప్పుడు గొర్రెలు కాచుకునేటప్పుడు పాడిన ఈలపాట,నాటకాల వాళ్లను కూడా ఆకర్షించింది.నాటకం చివర తప్పని సరిగా ఆయన ఈలపాట కచేరీ కూడా వుండటం ఆనవాయితీ అయింది.1915 లో సికింద్రాబాద్ లో జరిగిన ఈల పాట కచేరీ తర్వాత అందరూ ఆయన్ని "ఈలపాట రఘురామయ్య "అనసాగారు. క్రమేణా ఆయన బాలనటుడి స్థాయినుండీ పెద్ద నటుడి స్థాయికి చేరుకున్నాడు.మనిషి రూపం కూడా చక్కగా వుండటంతో,అన్ని రకాలపాత్రలూ,స్త్రీ వేషాలతో సహా కొట్టినపిండి అయ్యాయి.
యడవల్లి సూర్యనారాయణతో బాటు,కపిలవాయి రామనాథశాస్త్రి,జొన్నవిత్తుల.శేషగిరిరావు,పువ్వుల సూరిబాబు,స్థానం నరసింహా రావు,రాళ్లభండి కుటుంబరావులాంటి ఉద్దండులైన నటుల సాహచర్యంలో పోటా పోటీగా నటించి,సాటిలేని మేటిగా రాటుదేలారు.కానీ ఆయన తనను కన్న కొడుకుగా చూసుకుని ఉన్నతశ్రేణికి చెందిన నటునిగా తీర్చి దిద్దిన గురువు యడవల్లి సూర్యనారాయణను మరిచి పోలేదు జీవితాంతం కృతజ్ఞతగా తలుచుకునే వారు.

ఇంతలో టాకీ సినిమాల ప్రభంజనం బలంగా వీచసాగింది.రంగస్థల నటులందరూ,యడవల్లి సూర్యనారాయణతో సహా సినిమాల వేపు బలంగా ఆకర్షింపబడ్డారు. ఈ లోగా బెజవాడలో మారుతీ టాకీసు స్థాపించిన ప్రముఖ ఎగ్జిబిటర్ పోతిన శ్రీనివాసరావుగారు ,ఒక నాటక ప్రదర్శనలో నారదుడిగా నటిస్తున్న రఘురామయ్యను చూసి చాలా ముచ్చట పడ్డారు.
ఆయన పూనా లోని "సరస్వతీ సినీ టోన్ "అనే సంస్ధ తరఫునతాను నిర్మించి,దర్శకత్వం వహించిన "పృథివీ పుత్ర" అనే సినిమాలో నారద వేషానికి రఘురామయ్యను బుక్ చేశారు.అలా ఆయన చిత్రజైత్ర యాత్ర ప్రారంభమైంది.
మన రఘురామయ్యను "పృథివీ పుత్ర" సినిమాకు నారద పాత్రకోసం బుక్ చేసుకున్న నిర్మాతా,దర్శకుడూ పోతిన శ్రీనివాసరావు అని చెప్పుకున్నాం కదా ఆయన నిర్మాత డూండీ కి తండ్రి.

అంతే కాదు ఆంధ్రదేశంలో మొట్టమొదట సినిమా థియేటర్ (1921)ని "మారుతీ టాకీస్ "పేరిట బెజవాడలో నిర్మించిన ఘనత ఈయనదే .అందులో మొదట్లో టాకీలు రాకమునుపు మూకీలు కూడా ఆడేవారు. పూనాలోని "సరస్వతీ సినీటోన్ "అనే సంస్థ తమ చిత్రాలకు ఎగ్జిబిటర్ గా వున్న పోతిన.శ్రీనివాసరావుని తమ సంస్థ పేరిట ఒక తెలుగు చిత్రం తీయమని కోరింది .దానికాయన ఒప్పుకుని "పారిజాతాపహరణం,నరకాసుర వధ"లని కలిపి "పృథివీపుత్ర "అనే చిత్రం తీశాడు.అది ఆయన తీసిన ఒకే ఒక్క చిత్రం ,పూనా లో షూటింగ్ జరుపుకుంది.1933 డిసెంబర్ లో విడుదలయింది ,రఘురామయ్య నారద వేషానికి మంచి పేరు వచ్చింది.

తర్వాత బెజవాడ తిరిగి వచ్చి నాటకాలాడడం మొదలు పెట్టాడు ,మధ్య మధ్యలో సినిమాలూ వస్తూనే వున్నాయి .1935లో "భక్త కుచేల"వచ్చింది అందులో కృష్ణుడి వేషం.ఈ సినిమా రిలీజయ్యాక ,నిర్మాత హెచ్ .ఎం .రెడ్డి,దర్శకుడు హెచ్ .వి .బాబు కలిసి "దృౌపదీ వస్త్రాపహరణం"అనే సినిమాతీయాలనుకుని ,అందులో కృష్ణుడి వేషం రఘురామయ్యకిద్దామనుకున్నారు,ఎలా వుంటాడో చూద్దామని "భక్తకుచేల" ప్రదర్శించే థియేటర్ కి వెళ్లి చూసి "చాలా లావుగా,మోటుగా వున్నాడని వద్దనుకున్నారు.ఈ మాటలు వారి వెనకే వున్న రఘురామయ్య విని బాధపడ్డాడు.ఆవేషం సి.యస్ .ఆర్ .కి వెళ్లింది.ఆ రోజునే నటుడికి శారీరం (గాత్రం)తో పాటు శరీరం కూడా ముఖ్యమే అని తెలుసుకున్న రఘురామయ్య కఠినమైన ఆహారనియమాలతో,క్రమబధ్ధమైన వ్యాయామంతో,యోగాభ్యాసం తో తన శరీరాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు.తన ఆరోగ్యానికేం ఢోకా లేదనీ ఎనభై యేళ్లు పైబడి బతుకుతాననీ చెప్పేవారట.చివరి వరకూ ఆయన నియమ బధ్ధమైన జీవితాన్నే గడిపే వారు.

భక్త కుచేల తర్వాత ఆయన "లంకాదహనం,రుక్మిణీ కల్యాణం,కచ దేవయాని,గొల్లభామ "మొదలైన చిత్రాలలో నటించారు.విచిత్రమేమంటే ఆయన సుమారు41 చిత్రాలలో నటించారు అందులో నాలుగో,అయిదో సాంఘికాలు మిగతా వన్నీ పౌరాణికాలే. వాటిల్లో మళ్లీ 13శ్రీకృష్ణ పాత్రలూ,10నారద పాత్రలూ,4ఇంద్ర పాత్రలూ.1967లో ఆయన శిష్యుడూ,నటుడూ అయిన పద్మనాభం తీసిన "శ్రీమర్యాదరామన్న"ఆయన చివరి చిత్రం .అయితే ఆయన నటించిన చిత్రాలలో 1947 లో వచ్చిన "గొల్లభామ "లో ఆయన వేషం ప్రత్యేకమయినది ,అందులోని పాటలూ,పద్యాలూ ప్రజలను బాగా ఆకర్షించాయి."వలపు తేనియలూనిన వనజ మీవు"అనే పద్యం పాడకపోతే జనాలు ఊరుకునే వారు కారు.ఒకసారి ఏకంగా ట్రెయినాపేశారు పద్యం పాడేదాకా. ఆయనా ,సి.కృష్ణవేణీ కలిసి పాడిన యుగళగీతాలు కూడా ఈనాడు విన్నా మధురంగా వుంటాయి.
ఆయన నటించిన చిత్రాలలో ముఖ్యమయినవి -గొల్లభామ తర్వాత"చింతామణి,దక్షయజ్ఞం,ఉషా పరిణయం,శ్రీకృష్ణమాయ,,నాగులచవితి,మదాలస ,మాయపిల్ల,దేవాంతకుడు,మోహినీ భస్మాసుర" 1967 లో వచ్చిన శ్రీమర్యాదరామన్న తర్వాత నాటక రంగానికి తిరిగి వచ్చి నాటకాలలో ముమ్మరంగా నటించసాగారు.1975లో "శ్రీరామాంజనేయ యుధ్ధం లో రెండు పాటలు ఆంజనేయుడికి ప్లేబాక్ పాడారంతే.

చివరి వరకూ ఆయన కంఠం అంతే స్థిరంగా,శ్రావ్యంగా చెక్కుచెదరకుండా వుండటాని కి హిందూస్థానీ సంగీతం మీద వున్న మక్కువతో ఆయనచేసిన సాధనా,కర్ణాటక సంగీతం మీద వున్నపట్టూ,కారణమనిపిస్తాయి.
హిందుస్థానీ సంగీతంలో ఆయన "బాలగంధర్వ"కి ఏకలవ్య శిష్యుడు.చిన్నతనం నుండీ ఆయన రికార్డులు వినేవాడు,అలాంటి బాణీల్లోనే పద్యాలూ,పాటలూ రాయించుకునే వాడు.
అసలు "బాలగంధర్వ "ఎవరంటే మరాఠీ రంగస్థలం మీద ఆడే మ్యూజికల్ డ్రామాల్లో స్త్రీ పాత్రలు ధరిస్తూ పాటలు పాడే ప్రముఖ హిందుస్థానీ గాయకుడు.ఆయన అసలు పేరు నారాయణ శ్రీ పాద రాజ హంస్ .ఆయన గురువు భాస్కర్ బువాబక్లే .చిన్నతనంలో ఆయన పాడుతుండగా విని లోకమాన్య బాలగంగాధర తిలక్ "బాలగంధర్వ "అనే బిరుదిచ్చాడు.
ఆయన బాణీని సొంతం చేసుకుని నాటకాల్లో పద్యాలూ ,పాటలూ పాడే రఘురామయ్యని చూసి తెలుగుప్రేక్షకులే కాదుమరాఠీ వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు.

1970ప్రాంతాలలో ప్రముఖ మరాఠీ నటగాయకుడూ,సంగీతజ్ఞుడూ పి.యల్ .దేశ్పాండే మన రఘురామయ్య బాణీ విని ఆశ్చర్యపోయి ,ఆయనను బాలగంధర్వ పేరిట జరిగే సంగీత పోటీలకు ముఖ్య అతిథి గా ఆహ్వానించారు.పూనా లో జరిగిన ఆసభలోమహామహులైన భీమ్ సేన్ జోషీ,హీరాబాయ్ బరోడ్ కర్ ,నారాయణరావ్ వ్యాస్ ,వసంత దేశ్ పాండేల ముందు రఘురామయ్య "మూర్తిమంత భితి ఊభి "అనే బాలగంధర్వ పాటని అతి మధురంగా గానం చేసి వాళ్లందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.ఈ సంఘటన పి.యల్ .దేశ్ పాండే బాలగంధర్వ శతజయంతి సంచికలో స్వయంగా రాసి పేర్కొన్నాడు .ఇంతకంటే ఆయన ప్రతిభకు కొలమానంవేరే కావాలా!

ఆయన వ్యక్తిగత జీవితాని కి వస్తే --మొదటి వివాహం 1930లో ఈమని గ్రామానికి చెందిన లక్ష్మీకాంతమ్మతో జరిగింది,దురదష్టవశాత్తూ ఆమె 1932లో ప్రసవ సమయంలో మరణించింది,బిడ్డకూడా దక్కలేదు.
రెండవ వివాహం 1938లో బాపట్లకు చెందినరోహిణి.సావిత్రిని చూసి ఇష్టపడి చేసుకున్నది.
ఆవిడ రఘురామయ్య కంటే చదువుకున్నది.ఆవిడ ఆయనకి నాటకాలూ ,సినిమాల స్క్రిప్టులు చదివి పెట్టడం లోనూ,పద్యాలు ధారణ చేయడం లోనూ,పదాలవిరుపుల గురించీ,భావం పలకడం గురించీ చాలా సహాయం చేస్తూ వుండేది.వారికొక కుమార్తె పేరు సత్యవతి. 1963లో ఆయన నాటకాలలో నటించే తన సహనటి ఆదోని లక్ష్మిని వివాహమాడారు వారికి ఇద్దరు మగపిల్లలు రామకృష్ణ,శ్రీధర్ ,ఒక ఆడపిల్ల ఆండాళ్

ఇక ఆయన పొందిన సన్మానాలూ ,గౌరవాలూ లెక్కేలేదు.

1928 లో రవీంద్రనాథ్ టాగూర్ కలకత్తాలో ఈయన పాట విని "నైటింగేల్ ఆఫ్ ఆంధ్రా స్టేజ్ "అని ప్రశంసించారు.1973లో బాలగంధర్వకి లభించినట్టే కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కారం లభించింది.గజారోహణాలూ,కనకాభిషేకాలూ జరిగాయి.1975 లో పద్మశ్రీ ప్రకటించారు.అయితే దురదృష్ట వశాత్తూ అది అందుకోకుండానే ఆయన మరణించారు.
మంత్రులూ,రాష్ట్రపతులూ,జడ్జీలూ ఆయన అభిమాన గణంలో వుండేవారు.1951లో ప్రథానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆయన ఈలపాట విని ఆశ్చర్యపోయి,వేళ్లమధ్య యేమైనా పరికరం వుందా అని అడిగారు. 1974లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కూడా ఈయన ఈలపాటవిని ప్రశంశించారు.

80ఏళ్ల పైనే జీవిస్తానని అందరికీ అభయమిచ్చిన రఘురామయ్య తన 74వయేట 1975ఫిబ్రవరి 24వ తేదీన తనువు చాలించి తన గంధర్వలోకానికేగారు."వలపు తేనియలూనిన"అని తేనెలూరిన గొంతు శాశ్వతంగా మూగబోయింది.
చివరి వరకూ సంతకం చేయడం కూడా చేతకాని ,ఒక పల్లెటూరి బాలుడు ,ఒక్క తప్పుకూడా లేకుండా సంస్కృత సమాసాలూ ,పద్యాలూ ,పాటలూ పాడి మహా గాయకుడుగా,మహా నటుడుగా యెదిగి నలభైవేలకు పైగా నాటకప్రదర్శనలు జరిపి,నలభై యొక్క సినిమాలలో నటించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడంటే దాని వెనక ఆయన చేసిన కృషీ,పట్టుదల ఆయన పడిన కష్టం మనకు నిజంగా అద్భుతాన్నీ,ఆశ్చర్యాన్నీ కలిగించాయి. ఆయన పాడిన పాటలూ,పద్యాలూ కొన్నయినా అంతర్జాలంలో దొరుకుతుండడం అదృష్టం
 జై రఘురామా...!!!సాకేత సార్వభౌమా...!!